ఒక్కటైన ఎన్డీయే ఇండియా కూటమి...మ్యాటర్ సీరియస్ !
ఒక అంశంలో మాత్రం ఈ రెండు పక్షాలు కలసిపోయాయి. దానిని పార్లమెంట్ వేదికగా చర్చించేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యాయి.
By: Tupaki Desk | 21 July 2025 4:00 AM ISTఎపుడూ ఉప్పూ నిప్పులా అధికార విపక్షాలు ఉండడం సహజం. చట్ట సభలలో అది ప్రతిబింబిస్తుంది కూడా. సమావేశాలు అనగానే విపక్షం ఒక అజెండా ముందుకు తెస్తుంది. దానిని అధికార పక్షం అంగీకరించదు. అలా వాదోపవాదాపు సాగుతూ ఉంటాయి. కానీ చిత్రంగా ఈసారి పార్లమెంట్ సమావేశాల ముందు అధికార ఎన్డీయే విపక్ష ఇండియా కూటమి ఒక్కటి అయ్యాయి.
ఒక అంశంలో మాత్రం ఈ రెండు పక్షాలు కలసిపోయాయి. దానిని పార్లమెంట్ వేదికగా చర్చించేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యాయి. ఇంతకీ అంతటి సీరియస్ మ్యాటర్ ఏమిటి అంటే న్యాయ వ్యవస్థలో అవినీతి అంశం. ఇదే రెండు శిబిరాలను ఒక్కటి చేసింది అని అంటున్నారు.
జస్టిస్ వర్మ మీద మహాభియోగ తీర్మానం విషయంలో రెండు పక్షాలు ఒక్కటి అయ్యాయి. ఈ ఏడాది మార్చి 14న ఢిల్లీలో హోళీ పండుగ సందర్భంగా జస్టిస్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ వేళ భారీగా నోట్ల కట్టలు బయటపడడం అంతటా కలకలం రేగింది.
ఇది న్యాయ వ్యవస్థ మీదనే అతి పెద్ద చర్చకు దారి తీసింది. న్యాయ వ్యవస్థలో అవినీతి అంటూ ఆరోపణలు వెల్లువగా వచ్చాయి. దాంతో సుప్రీం కోర్టు వర్మ విషయంలో స్వయంగా జోక్యం చేసుకుని విచారణకు ఆదేశించింది. ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ జస్టిస్ వర్మ పైన మహాభియోగ తీర్మానానికి సిఫార్సు చేసింది.
అయితే ఈ మహాభియోగ తీర్మానం సిఫార్సు మీద జస్టిస్ వర్మ సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విషయం అలా ఉంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ హైకోర్టు న్యాయమూర్తి కానీ తొలగించాలి అంటే రాష్ట్రపతి ఉత్తర్వులతోనే సాధ్యపడుతుంది. రాజ్యాంగం ప్రకారం అది విధానంగా ఉంటోంది.
ఇక మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్ సభలో వంద మంది సభ్యులు రాజ్యసభలో యాభై మంది సభ్యులు అవసరం అవుతారు. ఈ మీదట తీర్మానం మీద చర్చ జరిగి ఓటింగుకు వస్తే మెజారిటీ ఓట్లను బట్టి ఈ మహాభియోగ తీర్మానం ఆమోదం పొందుతుంది. ఆ తీర్మానాన్ని పరిశీలించి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. అపుడు న్యాయమూర్తిని సుప్రీం కోర్టు తొలగించేందుకు వీలు పడుతుంది.
అలా జస్టిస్ వర్మ విషయంలో ఇప్పటికే అధికార ఎంపీలు అన్నీ కలసి వందమందికి పైగా సంతకాలు చేశాయి. అలా తొలిసారి ఈ ఇష్యూ సీరియస్ ని దృష్టిలో ఉంచుకుని ఎన్డీయే ఇండియా కూటమి ఒక్కటిగా నిలిచి న్యాయ వ్యవస్థలో అవినీతి మీద చర్చించబోతున్నాయి అని అంటున్నారు. ఇక ఈ తీర్మానం మీద సంతకం చేసిన వారిలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ఇప్పటికే ఆయనతో పాటు మరో 35 మంది దాకా కాంగ్రెస్ ఎంపీలు సంతకాలు చేశారు.
దీని మీద కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ అంతా ఒక్కటిగా నిలవడం మంచి పరిణామం అన్నారు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు, రాజకీయాలకు అతీతమైన అంశంగా ఉంది అని అంటున్నారు. న్యాయ వ్యవస్థలో అవినీతి లేకుండా చూడడం అందరి బాధ్యత అన్నారు. మొత్తం మీద చూస్తే ఈసారి పార్లమెంట్ సమావేశంలో అనేక అంశాలు తెర మీదకు రాబోతూండగా జస్టిస్ వర్మ మీద అభిశంసన తీర్మానం హైలెట్ గా నిలవనుంది అని అంటున్నారు. అంతే కాదు అధికార విపక్షాలు అంతా కలసి ఏకగ్రీవంగా ఈ అంశం మీద ఉండడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
