జస్టిస్ సుదర్శన్ రెడ్డి మనసులో మాట !
తాను ఎందుకు పోటీకి దిగాను అంటే అని చాలా ఆసక్తికరమైన సమాచారాన్నే జస్టిస్ సుదర్శన్ రెడ్డి వివరించారు. తాను రాజ్యాంగం కోసమే పోటీకి దిగాను అని ఆయన చెప్పారు.
By: Tupaki Desk | 1 Sept 2025 8:07 PM ISTఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అనూహ్యమైన అభ్యర్థిని ఎంచుకుంది. ఎన్నో పేర్లు ప్రచారంలోకి వచ్చినా అసలు రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని ఒక న్యాయ కోవిదుడిని ఎంపిక చేసింది. ఆయన విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయ మూర్తిగా ఉన్నారు. ఆయన కూడా ఈ విధంగా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి దిగాల్సి వస్తుందని ఊహించి ఉండరు. కానీ ఆయనను ఇండియా కూటమి నేతలు సంప్రదించగానే అంగీకరించారు. మరి ఆయన మనసులో ఈ పోటీ మీద ఏముంది అన్నదే చర్చగా ఉంది.
ఎందుకు పోటీ అంటే :
తాను ఎందుకు పోటీకి దిగాను అంటే అని చాలా ఆసక్తికరమైన సమాచారాన్నే జస్టిస్ సుదర్శన్ రెడ్డి వివరించారు. తాను రాజ్యాంగం కోసమే పోటీకి దిగాను అని ఆయన చెప్పారు. యాభై ఏళ్ళ పాటు న్యాయ వ్యవస్థలో తాను కొనసాగుతున్న ఆయన ఉన్నట్లుండి రాజకీయాల్లోకి రావడం అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే రాజ్యాంగం కాపాడడం తన కర్తవ్యం అని భావించాను అన్నారు. ఒక దేశ పౌరుడిగా తాను ఈ పోటీకి అందుకే అంగీకరించాను అన్నారు.
కీలకమైన పదవి :
ఉప రాష్ట్రపతి పదవి కీలకమైనదిగా ఆయన అభివర్ణించారు. రాజ్యాంగ పదవి కాబట్టే తాను పోటీ చేస్తున్నాను అని అన్నారు. ఈ పదవిలో తాను రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాను అని దృఢమైన నమ్మకాన్ని కలిగి ఉన్నాను అన్నారు. ఇక తాను నిరంతరం పౌర హక్కుల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను అని చెప్పారు. అలాగే సామాజిక న్యాయం గురించి తరచూ ప్రస్తావిస్తాను అన్నారు. ఇక భారత రాజ్యాంగంలో పొందుపర్చిన ఆదేశిక సూత్రాల గురించి కూడా తాను అందరికీ అవగాహన కల్పిస్తూంటాను అని అన్నారు. అటువంటి తనకు ఒక రాజ్యాంగ పదవిలో పోటీ చేసే అవకాశం వస్తే వదులుకోకూడదు అనే పోటీకి సిద్ధపడ్డాను అన్నారు.
ఆత్మ ప్రబోధం మేరకే :
ఉప రాష్ట్రపతి పదవి అన్నది రాజ్యాంగబద్ధమైనది అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గుర్తు చేశారు. ఈ పదవి కోసం పోటీ చేస్తున్న తనకు రాజకీయాలకు అతీతంగా అంతా మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాను అన్నారు. తాను అందరి వాడిని ఆయన అంటూ రాజ్యాంగ రక్షణ అన్నది తన లక్ష్యమని ఆయన తెలియజేశారు. ఇది పార్టీలకు చూసే విషయం కాదని వ్యక్తులను చూసి ఓటు వేయాల్సిన తరుణం అన్నారు
డిబేట్ కి సిద్ధం :
ఇక తన ప్రత్యర్థిగా ఉన్న ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ తో మాట్లాడేందుకు తాను సిద్ధమని జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. ఇద్దరికీ డిబేట్ పెడితే తాను మాట్లాడుతాను అన్నారు ఎవరి అభిప్రాయం ఏమిటో అందరికీ తెలుస్తుంది అని అన్నారు. ఇదిలా ఉండగా తన ప్రత్యర్ధిగా ఉన్న రాధాక్రిష్ణన్ తో మాట్లాడే అవకాశం తనకు ఇంతవరకూ దక్కలేదని ఆయన అన్నారు. ఏది ఏమైనా తనకు ఎంపీల మద్దతు మీద నమ్మకం ఉందని అన్నారు. అందుకే ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారని అనేక మంది తనను అడిగినా తాను రాజ్యాంగం కోసమే అని జవాబు చెబుతాను అన్నారు. తెలంగాణాలోని ఇండియా కూటమి ఎంపీలు ప్రజా ప్రతినిధుల సమావేశంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి పాల్గొని ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు.
