దేశచరిత్రలో రెండో దళిత వ్యక్తి... తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్!
భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా 'జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్' బాధ్యతలు చేపట్టనున్నారు.
By: Tupaki Desk | 17 April 2025 11:28 AM ISTభారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా 'జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్' బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో.. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా బాధ్యతలను చేపట్టనున్న రెండో దళిత వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. ఆయన కంటే ముందు 2007లో జస్టిస్ బాలకృష్ణన్ ఆ పదవిని అలంకరించారు.
అవును... భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. సీనియారిటీ పరంగా తన తర్వాత స్థానంలో ఉన్న ఆయన పేరును కేంద్ర న్యాయశాఖకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సంప్రదాయానికి అనుగుణంగా సిఫారసు చేశారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో... ఆ మరుసటి రోజు మే 14న జస్టిస్ బీఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఈ అత్యున్నత పదవిలో ఆరు నెలలకు పైగా కొనసాగిన అనంతరం.. నవంబర్ 23న పదవీ విరమణ చేస్తారని తెలుస్తోంది. ఆయన 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఎవరీ జస్టిస్ బీఆర్ గవాయ్?:
మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబర్ 24న జన్మించిన జస్టిస్ బీఆర్ గవాయ్.. 1985 మార్చి 16న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. అనంతరం నాగ్ పూర్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్లు, అమరావతి యూనివర్శిటీకి స్టాండింగ్ కౌన్సిల్ గా పని చేశారు. ఆ తర్వాత 1987 - 1990 మధ్య ముంబై హైకోర్టులో ఇండిపెండెంట్ గా ప్రాక్టీస్ చేశారు.
ఈ క్రమంలో 1992 ఆగస్టులో ముంబై హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులయ్యారు. అనంతరం 2000లో నాగ్ పూర్ బెంచ్ కు గవర్నమెంట్ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులయ్యారు. ఈ క్రమంలో 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
అనంతరం 2005లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ క్రమంలోనే 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు జస్టిస్ బీఆర్ గవాయ్.
వెలువరించిన చారిత్రాత్మక తీర్పులు!:
2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన అనంతరం జస్టిస్ బీఆర్ గవాయ్.. అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో భాగమయ్యారు.. పలు చారిత్రాత్మక తీర్పులను వెలువరించారు. ఇందులో జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 2023 డిసెంబర్ లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పులో జస్టిస్ గవాయ్ ఒకరు!
ప్రధానంగా.. పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4-1తో ఇచ్చిన తీర్పులో జస్టిస్ గవాయ్ పాలుపంచుకున్నారు. రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోనూ జస్టిస్ గవాయ్ భాగస్వామి.
ఇటీవల సంచలనంగా మారిన ఎస్సీ వర్గీకరణలో రాష్ట్రాలకు రాజ్యాంగపరమైన అధికారం కల్పిస్తూ ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6-1తో ఇచ్చిన తీర్పులోనూ.. ముందుగా నోటీసు ఇవ్వకుండా ఎలాంటి కట్టడాలు కూల్చడానికి వీలు లేదని, సదరు వ్యక్తికి 15 రోజుల సమయం ఇవ్వాల్సిందేనని దేశవ్యాప్తంగా మార్గదర్శకాలను ఖరాఉ చేసిన తీర్పుకు జస్టిస్ బీఆర్ గవాయ్ నాయకత్వం వహించారు.
