'వెన్నుపోటు దినం'.. ఊసేది జగన్?!
ఏపీ ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. జూన్ 4(బుధవారం) వెన్నుపోటు దినం గా ప్రకటించారు.
By: Tupaki Desk | 4 Jun 2025 6:47 PM ISTఏపీ ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. జూన్ 4(బుధవారం) వెన్నుపోటు దినం గా ప్రకటించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని కూడా నాయకులకు ఆయన పిలుపునిచ్చారు. తాను కూడా ఈ నిరసనలో పాల్గొంటానని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా జగన్ దిశానిర్దేశం చేశారు. అయితే.. జగన్ మాట ఏమేరకు నిలబడిందన్న విషయాన్ని చూస్తే.. పెద్దగా ఎవరూ స్పందించలేదనే చెప్పాలి.
పక్కాగా వైసీపీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పెద్దగా పాల్గొనలేదు. మధ్యాహ్నం 1 గంట సమయానికి రాష్ట్రంలో వైసీపీ నాయకులు కేవలం రెండు మూడు జిల్లాల్లో మాత్రమే బయటకు వచ్చారు. తాడేపల్లిలో నూ ఈ కార్యక్రమానికి ఎవరూ హాజరు కాలేదు. విజయవాడలో నాయకత్వ లోపాలు స్పష్టంగా కనిపించాయి. దీంతో ఈ కార్యక్రమానికి ఎవరూ మద్దతు పలకలేదు. విశాఖలో మాత్రం ఎమ్మెల్సీ వరదు కళ్యాణి.. నేతృత్వంలోని నాయకులు బయటకు వచ్చారు.
మీడియాతో కొందరు నాయకులు మాట్లాడారు. ఇక, శ్రీకాకుళం, విజయనగరంలోను పెద్దగా ఈ హడావుడి ఏమీ కనిపించలేదనే చెప్పాలి. విజయవాడలో దేవినేని అవినాష్ మాత్రమే బయటకు వచ్చారు. అది కూడా.. ఆయన పార్టీ కార్యాలయానికి మాత్రమే పరిమితమయ్యారు. ఇక, అనంతపురంలో సాకే శైలజానాథ్ మొక్కుబడిగా బయటకు వచ్చారు. కర్నూలు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో పెద్దగా ఊపు కనిపించలేదు.
లక్ష్యం ఏంటి?
ఇక, వెన్నుపోటు దినం లక్ష్యం ఏంటంటే.. గత జూన్ 4న రాష్ట్రంలో ఎన్నికల ఫలితం వచ్చింది. ఆ తర్వాత.. నుంచి నేటి వరకు కూడా.. అప్పట్లో ఇచ్చిన కూటమి పార్టీల హామీలు నెరవేరలేదన్నది జగన్ చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ప్రజలకు అలివి మీరిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని.. తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచారనేది జగన్ విమర్శ. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఎన్నికల ఫలితం వచ్చిన రోజును పురస్కరించుకుని వెన్నుపోటు దినంగా పాటిస్తున్నారు. అయితే.. ప్రజల నుంచి పెద్దగా స్పందన రాకపోవడం గమనార్హం.
