నాగబంధం మ్యూజిక్ డైరెక్టర్.. ఇంట్రెస్టింగ్ స్టోరీ
ఇంత భారీ చిత్రానికి ఒక కొత్త సంగీత దర్శకుడు పని చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. తన పేరు జునైద్ కుమార్ ఛెత్రి. ఈ పేరు చూస్తే ముంబయి నుంచి ఎవరినో పట్టుకొచ్చినట్లున్నారు అనిపిస్తుంది.
By: Tupaki Political Desk | 11 July 2026 2:49 PM ISTస్టార్లు నటించకపోయినా, ఒక పెద్ద సినిమా స్థాయిలో బజ్ తెచ్చుకున్న సినిమా.. నాగబంధం. నిర్మాతగా చాలా సినిమాలు తీసిన అభిషేక్ నామా దర్శకుడిగా మారి రూపొందించిన ఈ చిత్రంలో ‘పెదకాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటించాడు. ఏకంగా వంద కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రంలో కథాకథనాల విషయంలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. సాంకేతిక ఆకర్షణలు మాత్రం అందరి ప్రశంసలు అందుకున్నాయి. కెమెరా పనితనం, విజువల్ ఎఫెక్ట్స్ మ్యూజిక్ గురించి అందరూ మాట్లాడుకున్నారు.
ఇంత భారీ చిత్రానికి ఒక కొత్త సంగీత దర్శకుడు పని చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. తన పేరు జునైద్ కుమార్ ఛెత్రి. ఈ పేరు చూస్తే ముంబయి నుంచి ఎవరినో పట్టుకొచ్చినట్లున్నారు అనిపిస్తుంది. కానీ అతను పక్కా హైదరాబాదీ కావడం విశేషం. హిందీలో ఎన్నో కమర్షియల్ యాడ్స్‌కు మ్యూజిక్ చేసిన సజన్ మనవడే ఈ జునైద్. చిన్నతనంలోనే తాత ప్రభావం వల్ల సంగీతం మీద జునైద్‌కు ఆసక్తి పెరిగింది. టీనేజీలోనే తన ప్రయాణం సంగీతంతోనే అని అతను ఫిక్సయిపోయాడు. మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ మీద పట్టు సాధించి ప్రోగ్రామర్‌గా మారాడు.
అతడి పనితనం నచ్చి సురేష్ బొబ్బలి తన దగ్గర ప్రోగ్రామర్‌గా పెట్టుకున్నాడు. జునైద్‌కు మణిశర్మ ఆరాధ్య సంగీత దర్శకుడు. ఎప్పటికైనా ఆయన దగ్గర పని చేయాలన్నది తన కల. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ద్వారా ఆ అవకాశం అతడికి లభించింది. విరాట పర్వం, కార్తికేయ-2, ఇస్మార్ట్ శంకర్, బలగం.. ఇలా పలు చిత్రాలకు ప్రోగ్రామర్‌గా పని చేసిన జునైద్.. ప్రోగ్రామర్‌గా ఇండస్ట్రీలో చాలా బిజీ అయ్యాడు.
రెండేళ్ల కిందట అతడికి సంగీత దర్శకుడిగా అనుకోకుండా అవకాశం దక్కింది. మణిశర్మ దగ్గర పని చేస్తున్నపుడు అభిషేక్ నామా అతణ్ని కలిసి.. ఒక గ్లింప్స్‌కు మ్యూజిక్ చేయమని అడిగాడు. అతను ఆ సినిమా ఏంటని కూడా అడక్కుండా తనకిచ్చిన కంటెంట్‌కు బీజీఎం చేసి ఇచ్చాడు. ఆ చిత్రమే.. నాగబంధం. అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌తోనే ఈ చిత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి జునైద్ ఇచ్చిన బీజీఎం నచ్చి అభిషేక్ నామా అతణ్నే సంగీత దర్శకుడిగా పెట్టుకున్నాడు.
ఈ అవకాశాన్ని రెండు చేతులా ఉపయోగించుకుంటూ ఈ చిత్రానికి చక్కటి పాటలతో పాటు అదిరిపోయే బీజీఎం ఇచ్చాడు. ముఖ్యంగా నమోరే పాట బాగా పాపులర్ కాగా.. బీజీఎం విషయంలోనూ జునైద్‌కు చాలా మంచి పేరొచ్చింది. ‘నాగబంధం’లో యాక్షన్ ఘట్టాలతో పాటు ఎన్నో భారీ సన్నివేశాలున్నాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్లలో అయితే స్కోర్ వేరే లేవెల్లో ఉంటుంది. అనుభవం ఉన్న సంగీత దర్శకుడిలా తన పనితనం చూపించాడు జునైద్. ‘నాగబంధం’లో తన వర్క్ మున్ముందు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని జునైద్ ఆశిస్తున్నాడు.
