Begin typing your search above and press return to search.

భారత్ లో ఉపరాష్ట్రపతులకు జూలై నెలకు ఉన్న సంబంధం తెలుసా..!

మే 3 - 1969న భారత మూడవ రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఆకస్మిక మరణంతో.. రాష్ట్రపతి ఎన్నిక అనివార్యం అయ్యింది!

By:  Tupaki Desk   |   24 July 2025 8:30 AM IST
భారత్  లో ఉపరాష్ట్రపతులకు జూలై నెలకు ఉన్న సంబంధం  తెలుసా..!
X

సాధారణంగా పలు రాజకీయ పార్టీలకు, పలువురు సీనియర్ నేతలకు ఆయా నెలల్లో సంక్షోభం ఉందని అంటుంటారు! చరిత్రలో ఎదురైన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఆగస్టు సంక్షోభం, సెప్టెంబర్ సంక్షోభం అని చెబుతుంటారు! ఈ సమయంలో.. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఉప రాష్ట్రపతులకు జూలై నెలకు ఏదో సంబంధం ఉందనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

అవును... ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు (జూలై 21)న ఆరోగ్య కారణాలను చూపుతూ జగదీప్‌ ధన్‌ ఖడ్‌ తన పదవికి రాజీనామా చేశారు. తన పదవీకాలం పూర్తి కావడానికి ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఆయన అనూహ్య నిర్ణయం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ పలు కీలక సందేహాలను లేవనెత్తింది.

ఈ సందర్భంగా జూలై నెలకు, భారత ఉపరాష్ట్రపతి పదవికి ఉన్న సంబంధం మరోసారి తెరపైకి వచ్చింది. ఎందుకంటే... ఈ నెలలో ఆసక్తికరంగా అనేక మంది ఉపరాష్ట్రపతులు రాజీనామాలు చేయడం, మరణించడం వంటి పరిణామాలు నెలకొన్నాయి! ఈ సందర్భంగా ఒకసారి చరిత్రలోకి వెళ్దామ్... జూలై నెలకు - ఉప్రరాష్ట్రపతులకు ఉన్న బంధం గురించి తెలుసుకుందాం..!

మే 3 - 1969న భారత మూడవ రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఆకస్మిక మరణంతో.. రాష్ట్రపతి ఎన్నిక అనివార్యం అయ్యింది! ఈ సమయంలో... రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం కోసం వీవీ గిరి 1969 జూలై 20న తన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆ ఎన్నికల్లో గెలిచి భారతదేశానికి నాలుగో రాష్ట్రపతి అయ్యారు.

అనంతరం 1987లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలతో.. అప్పటి ఉపరాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన తన ఉపరాష్ట్రపతి పదవికి 1987 జూలై నెలలోనే రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో శంకర్ దయాళ్ శర్మ ఉపరాష్ట్రపతిగా ఎన్నికై.. 1987 సెప్టెంబర్ 3న బాధ్యతలు స్వీకరించారు.

ఈ క్రమంలో ఆయన 1992 రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి, అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత 1992 జూలై నెలలో ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అదే ఏడాది ఆగస్టులో జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్ నారాయణన్ విజయం సాధించారు. అనంతరం 1997లో అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఆ ఏడాది జూలైలో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు.

ఈ క్రమంలోనే 1997 - 2002 మధ్య ఉపరాష్ట్రపతిగా పనిచేసిన కృష్ణకాంత్... 2002 జూలై 27న పదవిలో ఉండగానే మరణించారు. ఇక 2007 జూలై 21న రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రతిభా పాటిల్ చేతిలో ఓటమి పాలైన అనంతరం ఉపరాష్ట్రపతి బైరన్ సింగ్ షెకావత్ తన పదవికి రాజీనామా చేశారు. ఇది.. జూలై నెలకూ, ఉపరాష్ట్రపతులకూ ఉన్న సంబంధం!!