జూబ్లీ హిల్స్ హీట్ : కాంగ్రెస్ కి అడ్వాన్స్ కంగ్రాట్స్ !
ఇక చూస్తే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి మజ్లీస్ పూర్తి మద్దతు ప్రకటించింది.
By: Tupaki Desk | 18 Oct 2025 11:55 AM ISTఇంకా నామినేషన్ల ప్రక్రియ మొదలు కాలేదు, అభ్యర్థుల ఎంపిక మాత్రమే జరిగింది. ఎన్నికలకు ఇంకా కొంత టైం ఉంది పోరు చూస్తే మూడు ప్రధాన పార్టీల మధ్య గట్టిగానే ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఒక పార్టీకి అపుడే అడ్వాన్స్ గా కంగ్రాట్స్ దక్కాయంటే ఎలా ఆలోచించాలి. ఇంతకీ ఆ పార్టీ ఏమిటి ఏమా కధ అంటే కాంగ్రెస్ పార్టీకి మజ్లీస్ పార్టీ అపుడే కంగ్రాట్స్ చెప్పేసింది. అంతే కాదు ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ ని అభివృద్ధి పధంలో నడిపించాలని మజ్లీస్ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరుకుంటున్నారు.
మజ్లీస్ మద్దతు :
ఇక చూస్తే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి మజ్లీస్ పూర్తి మద్దతు ప్రకటించింది. అక్కడ మజ్లిస్ కి మంచి బలం ఉంది. మొత్తం నియోజకవర్గంలో ముస్లింల సంఖ్య కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మరో మాటలో చెప్పాలీ అంటే మజ్లీస్ కి సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంది. అలాగే నవీన్ కి ఇండిపెండెంట్ గా సాలిడ్ ఓట్ షేర్ ఉంది. ఇపుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా నవీన్ యాదవ్ నిలబడుతున్నారు. దాంతో ఆయనకు మజ్లిస్ మద్దతు మరింత ఉపకరిస్తుందని అంటున్నారు.
లెక్కలు ఇవే :
జూబ్లీ హిల్స్ నియోజకవర్గం 2009లో ఏర్పాటు అయింది. తొలి ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే. పీ జనార్ధన్ రెడ్డి కుమారుడు విష్ణు వర్ధన్ రెడ్డి ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన సయ్యద్ హుమయూన్ ఆలీకి టికెట్ ఇస్తే ఆయనకు 19,433 ఓట్లు 14 శాతం ఓటు షేర్ దక్కింది. ఇక 2014లో చూస్తే ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్ధిగా మాగంటి గోపీనాధ్ గెలిచారు. ఈ ఎన్నికల్లో మజ్లీస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తే 41,656 ఓట్లు దక్కాయి. అది 25.19 ఓటు షేర్ అన్న మాట. 2018లో నవీన్ యాదవ్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 18,817 ఓట్లతో పాటు 12.09 శాతం ఓటు షేర్ దక్కించుకున్నారు. 2023లో చూస్తే మజ్లిస్ కి 7,848 ఓట్లు 4.28 శాతం ఓటు షేర్ దక్కాయి. అప్పటికి కాంగ్రెస్ లో నవీన్ యాదవ్ చేరి ఆ పార్టీకి మద్దతుగా నిలిచారు. అయినా ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది. మెజారిటీ చూస్తే 16 వేల దాకా వచ్చింది.
మారిన నేపథ్యం :
ఇపుడు ఉప ఎన్నిక జరుగుతోంది. తెలంగాణాలో అధికారంలో కాంగ్రెస్ ఉంది. దాంతో రానున్న మూడేళ్ల కాలంలో తమ ప్రాంతం అభివృద్ధి చెందాలనుకునే వారు కచ్చితంగా కాంగ్రెస్ కే ఓటు వేస్తారు అని హస్తం పర్టీ నమ్ముతోంది. దానికి తోడు మజ్లిస్ పార్టీకి ఉన్న 7,848 ఓట్ల మద్దతు నవీన్ కి ఉన్న ఇండిపెండెంట్ ఓటు షేర్ ఇవన్నీ కూడా తమకు కలసి వస్తాయని భావిస్తోంది. ఇక 2023లో కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ పోటీ చేసారు. అలా ముస్లిం ఓటు చీలింది. ఈసారి గంపగుత్తగా కాంగ్రెస్ అభ్యర్ధికే పడతాయని లెక్క వేస్తున్నారు. దాంతోనే మజ్లీస్ మద్దతు ఇపుడు కీలకంగా మారింది. ఈ కారణంగానే నవీన్ కి అడ్వాన్స్ గా కంగ్రాట్స్ ని మజ్లీస్ చెబుతూ ఎమ్మెల్యేగా నియోజకవర్గం అభివృద్ధి చేయాలని కూడా సూచిస్తోంది. మొత్తానికి మజ్లీస్ మద్దతు కాంగ్రెస్ కి మంచి బూస్ట్ గా మారగా విపక్ష శిబిరం మాత్రం ఈ మద్దతు మీద విమర్శలు గుప్పిస్తోంది.
