జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎన్టీఆర్...చంద్రబాబు !
తెలంగాణాలో బీజేపీ బీఆర్ఎస్ లది ఒకే మాటగా ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయనడానికి ఎన్నో ఉదాహరణలు అన్నారు.
By: Satya P | 31 Oct 2025 9:32 PM ISTతెలంగాణాలో ఇపుడు హీటెక్కిస్తున్న ఉప ఎన్నికగా జూబ్లీ హిల్స్ ని చెప్పుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది ఒకేసారి. అది 2009లోనే. పి జనార్ధనరెడ్డి వారసుడు కుమారుడు అయిన విష్ణు వర్ధన్ రెడ్డి ఆనాడు గెలిచి తొలి ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ఆ తరువాత జరిగిన మరో మూడు ఎన్నికల్లో మాగంటి గోపీనాధ్ ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజేత అనిపించుకున్నారు. ఆయన 2014లో టీడీపీ నుంచి గెలిచారు. 2018, 2023లో బీఆర్ఎస్ తరఫున గెలిచారు. అయితే ఆ మధ్యన ఆయన దివంగతులు కావడంతో అనివార్యంగా ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే జూబ్లీ హిల్స్ కోట మీద కాంగ్రెస్ జెండా ఎగరేయాలని ఆ పార్టీ భారీ స్కెచ్ తో బరిలోకి దిగింది.
ఎన్టీఆర్ ప్రస్తావన :
ఇదిలా ఉంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భారీ ప్రచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టారు. ఆయన శుక్రవారం రాత్రి నిర్వహించిన భారీ సభ కాంగ్రెస్ నినాదాలతో దద్దరిల్లింది. ఇక రేవంత్ రెడ్డి ప్రత్యర్థి పార్టీల మీద తీవ్ర విమర్శలు చేస్తూ తన ప్రసంగాన్ని ధాటీగా చేశారు. ఆయన అనూహ్యంగా ఎన్టీఆర్ గురించి ప్రస్తావించారు. ఎన్టీఆర్ అందరికీ ఆదర్శప్రాయుడు అని కూడా ప్రశంసించారు. ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని మైత్రీవనంలో తాము నిర్మిస్తామని తానే స్వయంగా వచ్చి ప్రారంభిస్తాను అని రేవంత్ రెడ్డి ప్రకటించడం విశేషం.
బాబు మీద కూడా :
అదే సమయంలో ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు మీద కూడా రేవంత్ రెడ్డి ప్రశంసా పూర్వకంగా మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ చనిపోతే ఆ వెంబడి వచ్చిన ఉప ఎన్నికల్లో పీజేఆర్ గౌరవార్ధం ఆనాడు టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ పెట్టకుండా సహకరించారు అని గుర్తు చేశారు. అలాంటి మంచి సంప్రదాయం బాబు నెలకొల్పితే దానిని బీఆర్ఎస్ మరచిందని మరణించిన వారి కుటుంబాల మీద పోటీకి దిగిందని నేరుగా పీజేఆర్ కుటుంబం మీదనే పోటీకి దిగిందని ఆయన విమర్శించారు. ఇపుడు బీఆర్ఎస్ సెంటిమెంట్లూ సంప్రదాయాలు చెప్పడం విడ్డూరం అన్నారు.
ఆ రెండూ ఒక్కటే :
తెలంగాణాలో బీజేపీ బీఆర్ఎస్ లది ఒకే మాటగా ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయనడానికి ఎన్నో ఉదాహరణలు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లలో గెలిస్తే బీఅర్ ఎస్ డిపాజిట్లు కోల్పోయిందని దానికి కారణం అవగాహనే అన్నారు. బీఆర్ ఎస్ ఓట్లు బీజేపీకి టర్న్ చేయడం వల్లనే ఆ పార్టీ గెలిచిందని అంతకు ముందు కూడా తెలంగాణాలో కాంగ్రెస్ లేకుండా చేయాలని ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచేలా బీఆర్ ఎస్ చూసిందని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీలను నమ్మవద్దు ఓటు వేయవద్దని ఆయన ప్రజలకు వినతి చేశారు అభివృద్ధి చేసే పార్టీ కాంగ్రెస్ అని వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని ఆయన సూచించారు.
ఎన్టీఆర్ బాబు పేర్లతో :
జూబ్లీ హిల్స్ లో ఒక బలమైన సామాజిక వర్గం ఉంది ఆ వర్గం ఓట్లు బీఆర్ఎస్ కి వెళ్ళకుండా ఎత్తుగడ కోసమే ఎన్ టీఆర్ చంద్రబాబు పేర్లను సీఎం ప్రస్తావించారు అని అంటున్నారు. పైగా బీఆర్ఎస్ అభ్యర్ధి కూడా బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ ఓట్లు అటు మళ్ళకుండా వ్యూహాంత్కంగా వ్యవహరించారు అని అంటున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ ఒక పద్ధతి ప్రకారం అన్ని వర్గాల మద్దతుని సాధించేలా ఈ ఉప ఎన్నికల్లో పనిచేస్తుంది అని అంటున్నారు.
