Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్ పోరు.. మూడు పార్టీల్లో ఆశావహులకు టీడీపీతో లింకు!

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.

By:  Tupaki Desk   |   8 Sept 2025 3:00 AM IST
జూబ్లీహిల్స్ పోరు.. మూడు పార్టీల్లో ఆశావహులకు టీడీపీతో లింకు!
X

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తోపాటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రకటన రావొచ్చని అంటున్నారు. దీంతో స్థానిక రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్టీల లెక్కల ప్రకారం డిసెంబరులో ఎన్నికల జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంతే మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. రోజుల పరంగా చూస్తే నిండా వంద రోజుల గడువు కూడా లేదంటున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయని చెబుతున్నారు. అయితే చిత్రంగా మూడు పార్టీల నుంచి టికెటు ఆశిస్తున్న నేతలు గతంలో టీడీపీతో పనిచేసిన అనుభవం ఉండటమే ఇక్కడ ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో టీడీపీ ప్రభావం పెద్దగా లేకపోయినా, ప్రతి ఎన్నిక సందర్భంలోనూ ఆ పార్టీ ప్రస్తావన లేకుండా ఉండటం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉండిపోయినా, ఆ పార్టీ సానుభూతిపరులు మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా హంగామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద, గాంధీభవన్ లో పసుపు జెండాలతో హల్ చల్ చేశారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువగా టీడీపీకి సానుభూతిపరులైన బీసీలు, సెటిలర్లు ఉండటంతో ఆ పార్టీ ప్రభావం ఈ ఎన్నికపై ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ పోటీ చేసే పరిస్థితి లేదని అంటున్నారు. కానీ, పార్టీలు మాత్రం గెలుపు దక్కించుకోవాలంటే టీడీపీ ఓటర్ల సానుభూతి పొందడం అవసరమన్న ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. దీంతో టీడీపీ మూలాలు ఉన్న నేతలను ఎంపిక చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయంటున్నారు.

ఎమ్మెల్యే గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని బీఆర్ఎస్ ప్రతిపాదిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ సంప్రదాయం ఉన్నందున ఇప్పుడు కొనసాగిద్దామని చెబుతోంది. అయితే గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఏకగ్రీవం చేయడానికే అధికార కాంగ్రెస్ అంగీకరించనందున, జూబ్లీహిల్స్ లోనూ ఉప ఎన్నికకే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ గెలిచి రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో పార్టీ పట్టు పెరిగిందని నిరూపించుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన మైనార్టీ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు ఎమ్మెల్సీగా పంపి, ఈ స్థానాన్ని బీసీ నేత నవీన్ యాదవ్ కు అప్పగించాలని చూస్తున్నారని అంటున్నారు.

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఎంపికకు సీఎం రేవంత్ పకడ్బందీ వ్యూహం రచిస్తున్నారని అంటున్నారు. గతంలో ఒకసారి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ రెండో స్థానంలో నిలిచారు. అయితే అప్పట్లో టీడీపీ-బీజేపీ కలిసి పనిచేయడం వల్ల ఇక్కడ టీడీపీ గెలిచింది. దీంతో టీడీపీ ఓట్లకు గాలం వేయాలన్న ఆలోచనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా నవీన్ యాదవ్ పై మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. మైనార్టీలు ఎలాగూ తమతోనే ఉంటారన్న భావనతో ఉన్న రేవంత్ రెడ్డి, టీడీపీ ఓట్ల కోసం నవీన్ యాదవ్ సరైన అభ్యర్థిగా భావిస్తున్నారని అంటున్నారు. నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ కి టీడీపీతో మంచి సంబంధాలు ఉండేవని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో శ్రీశైలం యాదవ్ కు ఉన్న పరిచయాల వల్ల ప్రస్తుతం టీడీపీ ఓట్లను నవీన్ యాదవ్ ఆకర్షించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి కుటుంబ సభ్యులు ఎవరిని ఎంపిక చేసినా, వారికి టీడీపీ సానుభూతిపరులతో ఉన్న పరిచయాలు లాభిస్తాయని ఆ పార్టీ ఆశిస్తోందని చెబుతున్నారు. 2014లో మాగంటి గోపీనాథ్ తొలిసారి ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గెలిచారు. ఈ నియోజకవర్గం పరిధిలో చాలా డివిజన్లలో ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన కూలీలు, చిన్న ఉద్యోగులు ఓటర్లుగా ఉన్నారని చెబుతున్నారు. వీరంతా టీడీపీకి సానుభూతి చూపుతారని, గతంలో మాగంటి వారిని అన్నివిధాలా ఆదుకోవడం వల్ల ఇప్పుడు ఆ ఓట్లు తమకే వస్తాయని బీఆర్ఎస్ ఆశిస్తోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ సైతం టీడీపీ మూలాలు ఉన్న నేతకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చూస్తోందని అంటున్నారు. ఏపీలో ఎలాగూ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నందున ఇక్కడ టీడీపీ ఓట్లు చెదిరిపోవని, తమకే వస్తాయని ఆ పార్టీ లెక్కలేస్తోంది. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి మరోసారి నిలబడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈయనకు గతంలో టీడీపీలో పనిచేసిన అనుభవం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.