Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ రహస్య సర్వే.. ఓటరు నాడి పట్టేందుకు ప్రయత్నం!

అసలే మరో సిట్టింగ్ స్థానంలో కూడా ఓడిపోతే పార్టీపై తీవ్ర ప్రభావం పడుతుందని బీఆర్ఎస్ నాయకత్వం ఆందోళన చెందుతోంది.

By:  Tupaki Desk   |   25 Jun 2025 2:00 AM IST
జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ రహస్య సర్వే.. ఓటరు నాడి పట్టేందుకు ప్రయత్నం!
X

తెలంగాణలో అనుకోకుండా జరగనున్న ఉప ఎన్నిక జూబ్లీహిల్స్. ఈ నియోజకవర్గం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఉన్నా.. ఆంధ్రా ఓటర్లదే ప్రభావం. ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ ఏడాది ఆఖరులోగా ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. బహుశా బిహార్ అసెంబ్లీతో పాటే ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. 2023 ఆఖరులో జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలై ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ 2024 లోక్ సభ ఎన్నికల్లో చరిత్రలో తొలిసారిగా ఒక్క సీట్లోనూ విజయం సాధించలేదు. అదే సమయంలో జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ ఓడిపోయి ఓ సిటింగ్ స్థానాన్ని కోల్పోయింది. అందుకని ఇప్పుడు జూబ్లీహిల్స్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.

కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్యప్రియ అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నికలో సానుభూతితో గెలవొచ్చని బీఆర్ఎస్ భావించింది. కానీ, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ విజయం సాధించారు. అందుకనే.. జూబ్లీహిల్స్ లోనూ సానుభూతి వర్కవుట్ అవుతుందా? ఉప ఎన్నికలో ఎవరికి ఓటు వేస్తారు? తదితర ప్రశ్నలతో సర్వే చేస్తోంది. ఇది రహస్యంగా చేస్తోందని సమాచారం.

అసలే మరో సిట్టింగ్ స్థానంలో కూడా ఓడిపోతే పార్టీపై తీవ్ర ప్రభావం పడుతుందని బీఆర్ఎస్ నాయకత్వం ఆందోళన చెందుతోంది. జూబ్లీహిల్స్ లో ఎలాగైనా గెలిచి.. వచ్చే మూడేళ్లలో జరిగే ఎన్నికలకు తాము బలంగా ఉన్నామన్న సంకేతాలు పంపాలని చూస్తోంది. ఇక రహస్య సర్వేలో ఉప ఎన్నికలో మీరు ఎవరికి ఓటు వేస్తారు? మాగంటి గోపీనాథ్ భార్య సునీతను నిలిపితే గెలుస్తారా? సానుభూతి ఓట్లు పడతాయా? అన్న వివరాలు సేకరిస్తోంది. ఈ సర్వే నివేదిక ద్వారానే బీఆర్ఎస్ ముందకెళ్లేందుకు సిద్ధం అవుతోందని చెబుతున్నారు. కాగా, అధిష్ఠానం సర్వే ద్వారా ముందుకెళ్తోంటే.. బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నవారు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.