Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ టికెట్ మా ఇంటికే.. ఎవరీ మాగంటి వజ్రనాథ్?

సరిగ్గా గత నెల ఐదో తేదీన గుండెపోటుకు గురయ్యారు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్.

By:  Tupaki Desk   |   4 July 2025 12:19 PM IST
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ టికెట్ మా ఇంటికే.. ఎవరీ మాగంటి వజ్రనాథ్?
X

సరిగ్గా గత నెల ఐదో తేదీన గుండెపోటుకు గురయ్యారు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, జూబ్లీహిల్స్ వంటి సీటును పార్టీకి కంచుకోటగా మలిచిన గోపీనాథ్ జూన్ 8న మరణించారు. దీంతో తెలంగాణలో ఉప ఎన్నిక అనివార్యం అయింది. నవంబరులోపు ఎన్నిక జరగాల్సి ఉంది. బహుశా బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి నిర్వహిస్తారని భావింవచ్చు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సిటింగ్ స్థానం టికెట్ ను ఆశిస్తూ పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి.

దాదాపు రెండేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్, కాంగ్రెస్ నుంచి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ ప్రధాన అభ్యర్థులుగా పోటీపడ్డారు. ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ను మాగంటి కుటుంబ సభ్యులకే ఇస్తారు అన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సిటింగ్ ఎమ్మెల్యే ఆకస్మికంగా మరణిస్తే ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేవారు. ఈ సంప్రదాయం ఇప్పుడు కొనసాగడం లేదు. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యం.

బీఆర్ఎస్ టికెట్ ను మాగంటి గోపీనాథ్ అన్న వజ్రనాథ్ ఆశిస్తున్నారు. తాజాగా నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ క్యాడర్, అభిమానులను కలుస్తున్నారు. టికెట్ ను బీఆర్ఎస్ తమ కుటుంబానికే కేటాయించిందని కూడా అంటున్నారు. ఎవరిని అభ్యర్థిగా నిలుపుతామనేది పార్టీనే నిర్ణయిస్తుందని, తానూ రేసులో ఉన్నట్లుగా స్పష్టం చేశారు.

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ టికెట్ రేసులో ఉన్నట్టు ప్రకటించిన మాగంటి వజ్రనాథ్ స్వయంగా గోపీనాథ్ కు అన్న. తమ్ముడి గెలుపు కోసం పదేళ్లుగా నియోజకవర్గంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. కాకపోతే అది తెరవెనుక. వ్యాపారం చూసుకుంటూనే బీఆర్ఎస్ కోసం పనిచేశారు. ఇప్పుడు తమ్ముడి స్థానంలో తానే పోటీ చేస్తానని చెబుతున్నారు.

మాగంటికి జూబ్లీహిల్స్ పేద ప్రజల్లో మంచి పేరుంది. ముఖ్యంగా బస్తీల్లో ఆయన ఇమేజీ బాగుంది. ఇప్పుడు సానుభూతి పవనాలు కూడా తోడైతే... బీఆర్ఎస్ సిటింగ్ స్థానాన్ని నిలుపుకోవడం ఖాయం అని చెబుతున్నారు. అయితే, ప్రధాన పోటీదారు బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి.