హే.. భాయ్.. 'ఎంత' పెట్టొచ్చు?.. ఉప ఎన్నికలో బెట్టింగ్‌ల జోరు!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సమయం చేరువ అయిన వేళ.. బెట్టింగుల జోరుకు తెర లేచింది.
By: Tupaki Desk | 4 Nov 2025 2:00 AM ISTజూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సమయం చేరువ అయిన వేళ.. బెట్టింగుల జోరుకు తెర లేచింది. ``హే .. భాయ్.. ఎంత పెట్టొచ్చు?`` అంటూ.. జంటనగరాల్లోని కొందరు బెట్టింగు రాయుళ్లకు ఏపీ సహా బెంగళూరు నుంచి బెట్టింగ్ రాయుళ్లు ఫోన్లు చేస్తున్నట్టు తెలిసింది. 2023 తర్వాత.. తెలంగాణలో జరుగుతున్న ఎన్నిక లు కావడంతోపాటు.. రేవంత్ రెడ్డి పాలనకు కూడా ఈ ఉప పోరు గీటురాయిగా మారుతుందన్న అంచనాల నేపథ్యంలో బెట్టింగులకు అవకాశం ఏర్పడిందన్న చర్చ సాగుతోంది.
ప్రముఖ జాతీయ మీడియా పత్రికల్లోనూ జూబ్లీహిల్స్‌పై బెట్టింగులు జరుగుతున్నాయన్న కథనాలు రావడం గమనార్హం. అయితే.. దీనికి రెండు కారణాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.
1) నిజంగానే బెట్టింగు లు కట్టేవారు. సహజంగానే ఏపీ తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ వేడి కొనసాగుతుంది. దీంతో సహజంగా నే ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలు సహా.. అనంతపురం, కడపలలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. బెట్టింగులకు దిగుతున్నారు. ఇక, బెంగళూరుకు చెందిన వ్యాపారులు కూడా ఇదే బాట పట్టారు.
ఇక, 2వ కారణం.. కొన్ని కీలక పార్టీలు.. చాలా వ్యూహాత్మకంగా తమ గ్రాఫ్‌ను పెంచుకునేందుకు.. కూడా బెట్టింగులను ప్రోత్సహించిన పరిస్థితి గత ఎన్నికల్లో కనిపించింది. అంటే.. తమ పార్టీ గెలుస్తుందని ఎక్కువ మంది బెట్టింగ్ కట్టినట్టుగా పరోక్షంగా ప్రచారం చేసుకుంటారు. తద్వారా ఓటరు ఆలోచనను ప్రభావితం చేస్తారు. ఇది తమకు లాభిస్తుందన్న ఆశతో చివరి నిముషంలో ఫలితాలను తమకు అనుకూలంగా ఇస్తుందన్న ఆశతో ఉంటారు.
తాజాగా జూబ్లీహిల్స్ విషయంలో ఈ రెండింట్లో ఏది జరిగిందన్నది చెప్పలేకపోయినా.. ప్రస్తుతం సీఎం రేవంత్ వర్సెస్ బీఆర్ ఎస్ అన్నట్టుగాఈ ఉప ఎన్నిక మారిపోయిన దరిమిలా.. బెట్టింగులకు అవకాశం ఏర్పడిందన్న చర్చ సాగుతుండడం గమనార్హం. ప్రస్తుతం బెట్టింగుల జోరు.. జూబ్లీహిల్స్, తారనాక, మణికొండ, ఖైరతాబాద్‌ల వేదిగా .. ముమ్మరంగా సాగుతోందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
