Begin typing your search above and press return to search.

సర్వే సంస్థల మాయలో పార్టీలు.. జూబ్లీహిల్స్ పై ఒక్కో సంస్థది ఒక్కో జోస్యం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది.

By:  Tupaki Desk   |   3 Nov 2025 11:00 PM IST
సర్వే సంస్థల మాయలో పార్టీలు.. జూబ్లీహిల్స్ పై ఒక్కో సంస్థది ఒక్కో జోస్యం
X

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఈ స్థానంలో మొత్తం 58 మంది పోటీ చేస్తుండగా, ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యే కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య నువ్వానేనా అన్నట్లు పోరు సాగుతుండగా, మరో ప్రతిపక్షం బీజేపీ కూడా ఎన్నికల ఫలితాన్ని మార్చేలా పోటీ ఇస్తోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన ఈ స్థానాన్ని నిలబెట్టుకోడానికి మళ్లీ ఆ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, చేతిలో ఉన్న అధికారంతో బీఆర్ఎస్ నుంచి జూబ్లీహిల్స్ ను కైవసం చేసుకోడానికి కాంగ్రెస్ చెమటోడ్చుతోంది. దీంతో ఆయా పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలు ఆసక్తి రేపుతున్నాయి.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రంగంలోకి దిగిన పార్టీలు ఓటర్లను ప్రభావితం చేయడానికి సరికొత్త ఎత్తులు వేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రలోభపెట్టడం ఒక వ్యూహమైతే.. ప్రజల నాడి ఫలానా పార్టీకి అనుకూలంగా ఉందంటూ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా సర్వే సంస్థలు, ప్రముఖ సెఫాలజిస్టులను రంగంలోకి దింపి ప్రజాభిప్రాయం తమకే అనుకూలంగా ఉందని మూడు పార్టీలు ప్రచారం చేసుకోవడం విశేషంగా చెబుతున్నారు. ఈ విషయంలో అన్నిపార్టీలు ఒకే విధానాన్ని అమలు చేస్తుండటంతో ప్రజల్లో గందరగోళం నెలకొంటుంది.

ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, పలు సంస్థలు జూబ్లీహిల్స్ లో ఓపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. పదుల సంఖ్యలో ఓటరు అభిప్రాయం తీసుకుంటున్నామని చెబుతున్న సంస్థలు ఎప్పుడు? ఎక్కడ? ఎవరిని కలిసిందీ స్పష్టంగా చెప్పడం లేదు. కానీ, ఎన్నికల నిబంధనలను అనుసరించి ‘షరతులు వర్తిస్తాయి’ అంటూ కనీకనిపించని నిబంధనతో తమ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ సర్వేలు తమకు డబ్బు ఇచ్చిన పార్టీలకు అనుకూలంగా ఉంటున్నట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ పై ఇప్పటివరకు వెల్లడైన ఓపినీయన్ పోల్స్ లో ఏ రెండు సర్వేలు ఒకవిధంగా ఉండకపోవడాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అనుభవాలతో అధికార కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ సైతం సర్వేలను అస్త్రంగా మార్చుకోవాలని చూస్తున్నాయని అంటున్నారు. అందుకే ఒక్కోపార్టీ ఒక్కో సంస్థను రంగంలోకి దింపి గెలిచేది ఆ పార్టీనే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి. ఏపీ ఎన్నికల్లో కచ్చితమైన అంచనా వేసి ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేసిన ఓ ప్రముఖ సంస్థ చేసిన సర్వే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అయితే అదేసంస్థ ఏపీ తర్వాత ఉత్తరాదిలో నిర్వహించిన సర్వేలో బొక్క బోర్లా పడిన విషయాన్ని విస్మరించకూడదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అదేవిధంగా మరికొన్ని ప్రముఖ సంస్థలు కూడా జూబ్లీహిల్స్ లో సర్వేలు చేశామని చెబుతున్నప్పటికీ, వాటి ఫలితాలను చూసిన వారు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాకే ఈ నివేదిక తయారు చేశారనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సర్వేలను నమ్ముకున్న పార్టీలు తమను తాము మోసం చేసుకుంటూ, ఓటర్లను మోసం చేసి ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నాయని అంటున్నారు.