'జూబ్లీహిల్స్' టికెట్ నాకే ఇవ్వాలి: కాంగ్రెస్‌లో కొత్త నినాదం
బీఆర్ ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికె ట్ వ్యవహారం.. అటు బీజేపీలోనూ.. ఇటు కాంగ్రెస్‌లోనూ వివాదంగా మారింది.
By: Tupaki Desk | 19 Jun 2025 3:19 PM ISTబీఆర్ ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికె ట్ వ్యవహారం.. అటు బీజేపీలోనూ.. ఇటు కాంగ్రెస్‌లోనూ వివాదంగా మారింది. బీజేపీలో ఈ టికెట్‌ను అమ్మే సుకున్నారని.. కొన్నాళ్ల కిందట ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు కాంగ్రెస్‌లో మాజీ క్రికెట్, గత ఎన్నికల్లో పరాజయంపాలైన అజారుద్దీన్.. తెరమీదికి వచ్చారు. జూబ్లీహిల్స్ టికెట్ తనకే ఇవ్వాలంటూ.. ఆయన దాదాపు డిమాండ్ చేసినంత పనిచేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్‌పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉన్న మహ్మద్ అజారుద్దీన్.. గత 2023లో ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇప్పుడు ఆయన మరోసారి ఇక్కడ నుంచి పోటీ కి రెడీ అవుతున్నానని స్వయంగా ప్రకటించుకున్నారు. అంతేకాదు.. తనను స్థానిక నాయకులు పట్టించుకోకపోతే.. నేరుగా ఢిల్లీకి వెళ్లి మరీ ఈ టికెట్‌ను సొంతం చేసుకుంటానని వ్యాఖ్యానించారు. ఇక్కడ నుంచి గెలిచి.. రాహుల్ గాంధీకి కానుకగా ఇస్తానని చెప్పుకొచ్చారు.
దీంతో కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ టికెట్ వ్యవహారం సంచలనంగా మారింది. ''గత ఎన్నికల్లో చివరి నిమిషంలో నాకు టికెట్ ఇచ్చారు. అయినా.. బలంగా పోరాటం చేశా. కానీ, ఓడిపోయినా.. మెజారిటీ విషయంలో పోటాపోటీగా పోరాడాను. గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఎక్కువగా ఓట్లు వచ్చేలా కృషి చేశా. ఇక్కడ నా హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడి టికెట్ నాకే ఇవ్వాలి'' అని అజారుద్దీన్ వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇంకా ఆరు మాసాల సమయం ఉంది. కానీ, ఈలోగానే.. కాంగ్రెస్ నాయకులు ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా ఈ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది రేవంత్‌కు అభ్యర్థనలు పంపారు. మరికొందరు తమకు అనుకూలంగా సోషల్ మీడియాలో కథనాలు రాసుకుంటున్నారు. ఇలా జూబ్లీహిల్స్ టికెట్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారడం గమనార్హం. మరోవైపు బీఆర్ ఎస్ ఎలాంటి పోటీ లేకుండా ఏకపక్షంగా గెలిచేందుకు ఇతర పార్టీలను మచ్చిక చేసుకునే అవకాశం ఉందన్న చర్చ కూడా సాగుతోంది.
