జూబ్లీహిల్స్ ’ఉప ఎన్నిక..’ ఏకగ్రీవం చేస్తారా? విష్ణునా..? అజహరా?
ఇప్పుడే అనుకోవడం కాదుకానీ.. తెలంగాణలో ప్రస్తుత శాసన సభ కొలువుదీరిన ఏడాదిన్నరలోనే రెండో ఉప ఎన్నిక అనివార్యం అయింది.
By: Tupaki Desk | 9 Jun 2025 3:00 AM ISTఇప్పుడే అనుకోవడం కాదుకానీ.. తెలంగాణలో ప్రస్తుత శాసన సభ కొలువుదీరిన ఏడాదిన్నరలోనే రెండో ఉప ఎన్నిక అనివార్యం అయింది. 2024 ప్రారంభంలోనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య ప్రియ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో లోక్ సభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ సీటు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ నియోజకవర్గానికీ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. సిటింగ్ ప్రజాప్రతినిధి మరణించిన నియోజకవర్గంలో ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఈ ఏడాది చివర్లో జరిగే బిహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుందని భావించాలి.
ఒకప్పటి ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగమైన జూబ్లీహిల్స్ ప్రాంతం పునర్విభజన అనంతరం 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. తొలుత ఎమ్మెల్యేగా దివంగత పి.జనార్దన్ రెడ్డి (పీజేఆర్) కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. అయితే, 2014 నుంచి మాగంటి గోపీనాథ్ హవా నడిచింది. 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి ఆయన విజయం సాధించారు.
వాస్తవానికి విష్ణు గత ఎన్నికల ముందు టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ లోకి వెళ్లారు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ పోటీ చేసి మాగంటి చేతిలో పరాజయం పాలయ్యారు. 2014లో మూడో స్థానంలో నిలిచిన విష్ణు.. 2018లో 68 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2023లో అజహర్ కు టికెట్ ఇస్తే ఆయన 80 వేల ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు.
అవన్నీ వదిలేస్తే ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ అభ్యర్థిగా విష్ణును నిలుపుతారా? లేక మాగంటి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తారా? అనేది చూడాలి. కాంగ్రెస్ నుంచి అజహర్ మళ్లీ పోటీకి దిగుతురా? అనేది కూడా ఆసక్తికరం. ఒకవేళ అధికార పార్టీ కావడం, దశాబ్దాల అనుబంధం, బలమైన అభ్యర్థి అయిన నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకుని టికెట్ ఇస్తారా? బీఆర్ఎస్ నుంచి విష్ణు బయటకు వస్తారా? అనేది చూడాలి.
కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు ఉప ఎన్నికలూ హైదరాబాద్ పరిధిలోనివే అవుతున్నాయి. వాస్తవానికి సిటింగ్ ఎమ్మెల్యే చనిపోతే.. ఆ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసే సంప్రదాయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో పాటించారు. ఇప్పుడు అది లేదు. ఎందుకంటే తెలంగాణలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్మరణం పాలయినా పోటీ జరిగింది. అంటే.. జూబ్లీహిల్స్ కూ ఉప ఎన్నిక ఖాయం అనుకోవాలి.