Begin typing your search above and press return to search.

నందమూరి ముఖ్యమంత్రి ఆయనే !

నందమూరి ఇంటి పేరులోనే అదిరిపోయే సౌండ్ ఉంది. పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి.

By:  Tupaki Desk   |   20 May 2024 3:30 PM GMT
నందమూరి ముఖ్యమంత్రి ఆయనే !
X

నందమూరి ఇంటి పేరులోనే అదిరిపోయే సౌండ్ ఉంది. పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ ఇంట పుట్టిన వారిని ఎవరినైనా తెలుగింట విశేషంగా ఆరాధిస్తూనే ఉంటారు. అలా నందమూరి తారక రామారావు మనవడుగా మూడవ తరంగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తన రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో అద్భుత విజయాలే అందుకున్నారు.

తాత ముఖ వర్చస్సుతో పాటు తరగని ప్రతిభను సైతం సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ కి సినీ రంగంలో ఎదురే లేని పరిస్థితి ఉంది. ఆయన ట్రిపుల్ ఆర్ తో వరల్డ్ వైడ్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన సినీ జీవితం ఇపుడు సరి కొత్త మలుపులు తీసుకుంటూ పరుగులు పెడుతోంది.

అయితే జూనియర్ ఎన్టీఆర్ కి తాత వారసత్వం కేవలం సినిమాలే కాదు రాజకీయ రంగం కూడా ఉందని అభిమానులు అంటూంటారు. తాతలా మంచి మాటకారి అద్భుతమైన ఉపన్యాసాలు ఇవ్వడంతో దిట్టగా జూనియర్ పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రసంగాలలో తెలుగుదనం అలా పరవళ్ళు తొక్కుతుంది. నాడు సీనియర్ ఎన్టీఆర్ ఉపన్యాసాల ఒరవడిని పుణికి పుచ్చుకుని 2009 ఎన్నికల వేళ ఉమ్మడి ఏపీ అంతా జూనియర్ కలియతిరిగి తాతకు తగ్గ మనవడు అనిపించారు.

ఆనాటికి జూనియర్ వయసు కేవలం పాతికేళ్ళు మాత్రమే. తాజా పుట్టిన రోజుతో 41 ఏళ్ళు నిండాయి. సినీ రంగంలో ఉజ్యల భవిష్యత్తు ఉందని ఏ జాతకం అక్కరలేకుండానే ఎవరైనా చెప్పే సత్తా జూనియర్ సొంతం. అదే సమయంలో రాజకీయంగా జూనియర్ తన తాత స్థాయిలో పవర్ చూపించగలడని మాత్రం జోస్యాలు చాలానే చెబుతున్నాయి.

జూనియర్ జన్మ నక్షత్రం చూసిన వారు ఆయన జాతకాలకు పరిశీలించిన వారు చెప్పేది ఒక్కటే ఆయన భవిష్యత్తులో నందమూరి ముఖ్యమంత్రిగా ఏపీని ఏలుతారు అని. యూట్యూబ్ లో జోస్యాల ద్వారా పేరు తెచ్చుకున్న వేణు స్వామి వంటి వారు అయితే 2034లో జూనియర్ కచ్చితంగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని, ఆయన ముఖ్యమంత్రి అవడం ఖాయమని.

ఆయనకు రాజకీయ సిరి ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. జూనియర్ ని ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరు అని కూడా ఆయన ఘంటాపధంగా చెబుతున్నారు. ఇదంతా జూనియర్ అభిమానులకు విశేషంగా ఆకట్టుకుంటోంది. నిజం చెప్పాలంటే 1983లో ఎన్టీఆర్ పెట్టిన పార్టీ టీడీపీ ఈ రోజుకూ అలా కొనసాగుతూ వస్తోంది. ఈసారి ఎన్నికలు ఆ పార్టీకి ఒక సవాల్ గా మారాయి.

ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచినా ఓడినా వీటితో సంబంధం లేకుండా జూనియర్ రాజకీయ ఎంట్రీ అన్నది మరో దశాబ్దం తరువాత ఉంటుందని, అది గ్రాండ్ గా ఉంటుందని అంటున్నారు. జూనియర్ కి అప్పటికి యాభై ఏళ్ళు నిండుతాయని ఆయన సినీ జీవితానికి విరామం ఇచ్చి రాజకీయాల్లోకి ప్రవేశిస్తారు అని జ్యోతీష్య పండితులు చెబుతున్నారు.

వారు చెప్పారు అని కాదు కానీ జూనియర్ ఎన్టీఆర్ అంటేనే సక్సెస్ ఫుల్ మాన్ అని అంతా ఒప్పుకుంటారు. ఆయన పట్టుబట్టాలే కానీ ఏ రంగంలో అయినా రాణించగలరు అన్నది ఆయన వైఖరి చూస్తేనే చెప్పేయవచ్చు. ఈ జోస్యాలను వింటూ ఆనందిస్తూ ప్రస్తుతం జూనియర్ సినిమాలను ఎంజాయ్ చేస్తున్న అభిమానులు అంతా ఎప్పటికైనా ఏపీ సీఎం మా జూనియర్ ఎన్టీఆర్ అని గుండె మీద చేయి వేసుకుని గట్టిగా చెబుతూనే ఉంటారు. అది జరగడం ఖాయమని కూడా అంటూంటారు. ఇది కాలం చెప్పాల్సిన జవాబు. అంతవరకు జూనియర్ సక్సెస్ ని అలా చూస్తూ ఫ్యాన్స్ అయినా మరెవరు అయినా ఎంజాయ్ చేయడమే.