పీపీపీ వివాదంలోకి కేంద్రం.. వైసీపీ ఏం చేస్తుందో?
ఏపీలో పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణంపై నెలకొన్న వివాదం ఆసక్తికర మలుపు తిరిగింది.
By: Tupaki Desk | 26 Dec 2025 1:02 PM ISTఏపీలో పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణంపై నెలకొన్న వివాదం ఆసక్తికర మలుపు తిరిగింది. కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షం వైసీపీ కోటి సంతకాల ఉద్యమంతో ఈ అంశాన్ని ప్రజల్లో విస్తృత చర్చకు పెట్టింది. అధికార, విపక్షాల మధ్య ఈ వివాదం దుమారం రేపుతుండగా, ఆకస్మాత్తుగా కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. పీపీపీ విధానంపై టీడీపీ కూటమిని తీవ్రంగా విమర్శిస్తున్న వైసీపీ.. కేంద్రం కూడా మద్దతు ఇవ్వడాన్ని ఎలా స్వీకరిస్తుందనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారిందని అంటున్నారు.
బీజేపీతో సత్సంబంధాలు కోరుకుంటున్న వైసీపీ అధినేత జగన్.. కేంద్ర వైద్య మంత్రి జేపీ నడ్డా అభిప్రాయంతో ఏకీభవిస్తారా? విభేదిస్తారా? అన్నదే రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. పీపీపీ విధానంపై కూటమి ప్రభుత్వం ప్రకటించిన నుంచి వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ ప్రభుత్వం వస్తే పీపీపీ విధానంలో నిర్మించిన కాలేజీలను వెనక్కి తీసుకుంటామని, కాంట్రాక్టర్లను జైళ్లలో పెడతామంటూ వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తీవ్ర హెచ్చరికలు చేశారు. దీంతో ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన నాలుగు కాలేజీల బిడ్లకు కేవలం ఒక చోట ఒక సంస్థ మాత్రమే బిడ్ దాఖలు చేసింది. జగన్ హెచ్చరికల వల్లే పీపీపీ విధానంపై కాలేజీల నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థలు ముందుకు రాలేదని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా.. ఏపీ వైద్య మంత్రి సత్యకుమార్ యాదవ్ కు రాసిన లేఖ అనూహ్యంగా వివాదాన్ని మలుపు తిప్పిందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పీపీపీ విధానాన్ని బాగుందని ప్రశంసించడంతోపాటు వైబెలిటీ గ్యాప్ ఫండింగ్ లో సగం వాటాను కేంద్రం కూడా భరించడానికి సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇప్పటికే దేశవ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాలను కేంద్రం పీపీపీ విధానంలో నడుపుతోందని ఉదహరించారు. సత్ఫలితాలిచ్చిన ఈ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు ఉంటే చెప్పాలని కేంద్ర మంత్రి నడ్డా కోరడాన్ని విశేషంగా చెబుతున్నారు.
వైసీపీ వ్యతిరేకిస్తున్న పీపీపీ విధానంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి బహిర్గతమవడంతో కూటమి పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు. కేంద్రం కూడా పీపీపీకి మద్దతు ఇస్తుండటంతో కాంట్రాక్టు సంస్థలు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ విషయంలో వైసీపీ నిర్ణయమే ఉత్కంఠ రేపుతోంది. పీపీపీ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైసీపీ కేంద్రంపైనా విమర్శలు చేస్తుందా? లేక ఈ విషయంలో నిర్ణయాన్ని మార్చుకుంటుందా? అనేది ఆసక్తి రేపుతోందని అంటున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉండటానికే ప్రాధాన్యమిస్తోందని, ఆ పార్టీ నేతలు ఎవరూ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన దాఖలాలు లేవని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పీపీపీపై కేంద్ర నిర్ణయాన్ని ఇకపై కూటమి నేతలు హైలెట్ చేసే అవకాశం ఉందంటున్నారు.
ఇప్పటికే పీపీపీపై ముందుకు వచ్చేవారిని అరెస్టు చేస్తామని జగన్ ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ మంత్రి సత్యకుమార్ యాదవ్ పలు ప్రశ్నలు లేవనెత్తారని అంటున్నారు. పీపీపీకి మద్దతు ఇస్తున్న ప్రధాని మోదీని అరెస్టు చేయిస్తారా? అంటూ గతంలో మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. అయితే అప్పట్లో ప్రధాని పేరును ఆయన వ్యూహాత్మకంగా ప్రస్తావించారని అంతా భావించారు. కానీ, ఇప్పుడు కేంద్ర మంత్రి నడ్డా లేఖ రాయడం ద్వారా కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టంగా వెల్లడైందని చెబుతున్నారు.
