ఈ ఆఫీసు అద్దె రూ.వెయ్యి కోట్లు... మనదేశంలోనే ఎక్కడో తెలుసా?
భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఆఫీస్ స్పేస్ ప్రీ-లీజు ఒప్పందం ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.
By: Tupaki Desk | 26 Jun 2025 9:00 PM ISTభారతదేశంలో జరిగిన అతిపెద్ద ఆఫీస్ స్పేస్ ప్రీ-లీజు ఒప్పందం ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులో భాగంగా... అమెరికా ఆర్థిక దిగ్గజం జేపీ మోర్గాన్ ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో జపాన్ కు చెందిన సుమిటోమో గ్రూప్ అభివృద్ధి చేస్తున్న వాణిజ్య టవర్ కోసం చెల్లించే మొత్తం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అవును... అవును ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లో 1,16,210 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఆఫీస్ స్థలం లీజు వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ స్థలం భారత్ లో జేపీ మోర్గాన్ కొత్త ప్రధాన కార్యాలయంగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన లీజు 10 సంవత్సరాల కాలానికి సంతకం చేయబడింది.
ఈ క్రమంలో.. మొత్తం లీజు వ్యవధి 25 సంవత్సరాల వరకు విస్తరించవచ్చని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ డేటా సంస్థ 'ప్రాప్ స్టాక్' ద్వారా యాక్సెస్ చేయబడిన పత్రాల ప్రకారం.. ఈ ఒప్పందంలో నెలవారీ అద్దె రూ.6.91 కోట్లుగా ఉంది. అంటే... కార్పెట్ ఏరియా చదరపు అడుగుకు రూ.595 చొప్పున లెక్కించబడుతుంది! ఇక కండిషన్స్ విషయానికొస్తే.. అద్దె ప్రతి మూడు సంవత్సరాలకు 15% చొప్పున పెరుగుతుంది.
ఈ క్రమంలో మొదటి 10 సంవత్సరాలలో జేపీ మోర్గాన్ సుమారు రూ.1,000 కోట్ల అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అదే .. పూర్తిగా 25 సంవత్సరాల కాలంలో మొత్తం అవుట్ ఫ్లో చూసుకుంటే.. అది రూ.2,500 కోట్లు దాటవచ్చని అంటున్నారు. దీంతో... ప్రపంచ వ్యాపార కేంద్రంగా భారత్ లో పెరుగుతున్న ప్రాముఖ్యతకు ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోందని అంటున్నారు.
కాగా... బీకేసీ - జి బ్లాక్ లోని నిర్మాణంలో ఉన్న టవర్ లోని 11, 12వ అంతస్తులలో ఆఫీస్ స్పేస్ ఉంది. సుమిటోమో రియాల్టీ & డెవలప్‌మెంట్ కో కు సంబంధించిన భారతీయ విభాగం 'గోయిసు రియాల్టీ' ఈ టవర్ ను నిర్మిస్తోంది. ఈ క్రమంలో.. జేపీ మోర్గాన్ ఇప్పటికే రూ. 62.23 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించిందని తెలుస్తోంది.
