భారత్-పాక్ వివాదంలో బుక్కైన హేజిల్‌వుడ్.. ఏం జరిగిందంటే?
దీనిపై స్పందించిన హేజిల్‌వుడ్ మేనేజర్, ఆయనకు ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఎలాంటి అధికారిక సోషల్ మీడియా ఖాతాలు లేవని స్పష్టం చేశారు.
By: Tupaki Desk | 14 May 2025 5:24 PM ISTభారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చల్లారినప్పటికీ, రాజకీయంగా వాటి ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు ఎక్కువయ్యాయి. తాజాగా, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఇలాంటి ఫేక్ వార్తల బారిన పడ్డారు. భారత్‌కు మద్దతుగా.. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లుగా ఆయన పేరుతో ఓ నకిలీ పోస్ట్ వైరల్‌గా మారింది.
ఇటీవల 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచులను తాత్కాలికంగా వాయిదా వేయడం, దీంతో హేజిల్‌వుడ్ సహా పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ స్వదేశాలకు పయనమవడం జరిగింది. ఈ పరిణామాల మధ్యే హేజిల్‌వుడ్ పేరుతో ఓ సోషల్ మీడియా పోస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియా క్రికెటర్ అయినప్పటికీ, పాక్ ఉగ్రవాదులపై పోరాడుతున్న భారత సాయుధ దళాలకు మద్దతు తెలుపుతున్నట్లు ఆ పోస్ట్‌లో ఉంది. "మీ పోరాటం కేవలం భారత్ కోసమే కాదు.. సురక్షితమైన ప్రపంచం కోసం" అని అందులో పేర్కొన్నారు.
ఈ ఫేక్ పోస్ట్‌పై ఆస్ట్రేలియా మీడియాలోనూ కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన హేజిల్‌వుడ్ మేనేజర్, ఆయనకు ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఎలాంటి అధికారిక సోషల్ మీడియా ఖాతాలు లేవని స్పష్టం చేశారు. హేజిల్‌వుడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కూడా దీనిపై తక్షణమే స్పందించింది. ఆ ఫేక్ అకౌంట్ నుంచి పోస్ట్‌ను తొలగించడంతో పాటు, ఆ అకౌంట్‌ను కూడా తీసివేయించింది.
సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, 'ఆపరేషన్ సిందూర్' ప్రభావంతోనే ఐపీఎల్ మ్యాచుల నిర్వహణపై ప్రభావం పడిందని, ఒక మ్యాచ్ వేదిక కూడా మారినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో ప్రముఖ క్రీడాకారుల పేరుతో వస్తున్న ఫేక్ వార్తలపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నిజమని నమ్మవద్దని, అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాలని వారు హెచ్చరిస్తున్నారు.
