రూ.52 వేల కోట్ల పరిహారంతో కేసుల మాఫీకి జాన్సన్ అండ్ జాన్సన్ రెఢీ
అయితే.. ఆ తర్వాత నుంచి ఇతర రాష్ట్రాల్లోని పలువురు బాధితులు వేసిన కేసుల్లో కంపెనీకి వందల మిలియన్ డాలర్ల జరిమానాలు పడుతూనే వచ్చాయి.
By: Garuda Media | 29 July 2026 6:56 PM ISTపేదోడైనా.. సంపన్నుడైనా.. స్థాయి ఏదైనా..పసికందు పుట్టినంతనే వారి సంరక్షణ కోసం వాడే తొలి బ్రాండెడ్ వస్తువుల్లో ముందు ఉంటుంది జాన్సన్ అండ్ జాన్సన్ కు చెందిన టాల్కం పౌడర్. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ పాత టాల్కమ్ పౌడర్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయినప్పటికీ.. ఆ సంస్థ మీద ఉన్న కేసులకు సంబంధించిన న్యాయపోరాటం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే ప్రపంచ దేశాల్లో తనపై ఉన్న 76 వేల కేసుల చిక్కుముడుల నుంచి బయటకు వచ్చేందుకు సదరు సంస్థ రూ.52 వేల కోట్ల భారీ పరిహారం ఇచ్చేందుకు ముందుకు రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఈ సంస్థ మీద న్యాయపోరాటం చేస్తున్న వారి పోరాటాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఈ భారీ పరిహార ప్యాకేజీకి సిద్ధమైనట్లుగా చెప్పాలి. అయితే.. ఇదంతా తనను నమ్మి వినియోగించిన వినియోగదారుల మీద ప్రేమ కంటే కూడా వారి ఆగ్రహాం కారణంగా వెల్లువలా పడిన కేసుల చికాకుల నుంచి.. వారికి వ్యతిరేకంగా చేసే న్యాయపోరాటం ఖర్చులు అంతకంతకూ పెరిగిపోవటంతో.. వాటికి శాశ్వితంగా సెలవు చెప్పేందుకు వీలుగా ఈ భారీ పరిహార ప్యాకేజీని ప్రకటించిందన్న మాట వినిపిస్తోంది.
ఇంతకూ జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడర్ వివాదం ఏంటి? మన దేశంలో దీనిపై జరిగిన చర్చ.. రచ్చ కంటే ప్రాశ్చాత్య దేశాల్లో జరిగిందే ఎక్కువ. అక్కడి కేసులు.. న్యాయస్థానాల తీర్పుల ప్రభావం మన మీద పడినా.. అందుకు తగ్గట్లుగా స్పందించిన ప్రభుత్వ సంస్థల తీరు మాత్రం అంతంతే అని మాత్రం చెప్పక తప్పదు. ఇంతకూ ఈ వివాదం లోతుల్లోకి వెళితే.. విభ్రాంతికర అంశాలు కనిపిస్తాయి.
అసలు వివాదం ఏంటి?
ప్రపంచ ప్రఖ్యాత టాల్కం కంపెనీల్లో జాన్సన్ అండ్ జాన్సన్ కు ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ తయారు చేసే టాల్కం బేబీ పౌడర్ ను ఎక్కువ కాలం వినియోగించటం ద్వారా తమకు తమ కుటుంబ సభ్యులకు అండాశయ క్యాన్సర్ బారిన పడ్డారని.. లేదంటే ఊపిరితిత్తులకు సంబంధించిన మెసోథెలియోమా అనే క్యాన్సర్ బారిన పడినట్లుగా పేర్కొంటూ బాధితులు కోర్టుకు ఎక్కటంతో ఈ బేబీ టాల్కం పౌడర్ విశ్వసనీయత మీదా.. సదరు ఉత్పత్తి మీద కొత్త సందేహాలకు కారణమైంది.
టాల్కం పౌడర్ తో క్యాన్సర్ ఎలా?
అత్యంత మృదువుగా ఉండే టాల్కమ్ పౌడర్ తయారీలో క్యాన్సర్ కు కారణమయ్యే అస్బెస్టాస్ అనే ఖనిజ పదార్థం కలిసి ఉంటుందన్నది పిటిషనర్ల వాదన. ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ వివాదానికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు.. ప్రభుత్వ సంస్థలకు చెందిన వివరాలు వేర్వేరుగా ఉండటం కనిపిస్తుంది. అమెరికాకు చెందిన అత్యున్నత ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ‘ఎఫ్ డీఏ’ ఈ వివాదంలోకి జోక్యం చేసుకొని సదరు పౌడర్ శాంపిళ్లను స్వయంగా పరీక్షించింది.
ఎఫ్ డీఏ ఏం చెప్పింది?
2019 అక్టోబరులో ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ శాంపిళ్లలో అత్యంత ప్రమాదకరమైన క్రిసోటైల్ అస్బెస్టాస్ ఆనవాళ్లు ఉన్నట్లుగా ఎఫ్ డీఏ తేల్చింది. అనంతరం జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థను హెచ్చరించిన నేపథ్యంలో అప్పట్లో మార్కెట్ లో ఉన్న దాదాపు 33వేల బేబీ టాల్కమ్ పౌడర్ డబ్బాల్ని వాలంటరీగా వెనక్కి తీసుకుంది. ఈ వివాదంపై అప్పట్లో జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ వాదన వేరుగా ఉంది. థర్డ్ పార్టీ ల్యాబ్ లతో సొంతంగా పరీక్షలు చేయించామని.. తమ పౌడర్ లో ఎలాంటి అస్బెస్టాస్ లేదని పేర్కొంది. ఎఫ్ డీఏ పరీక్షల్లోనే ఏదో లోపం జరిగి ఉంటుందని వాదించింది. అయితే.. ఎఫ్ డీఏ మాత్రం తాను వినిపించిన వాదనకే కట్టుబడి ఉండటం గమనార్హం.
జాన్సన్ అండ్ జాన్సన్ వాదనకు ఎదురుదెబ్బలు షురూ
ఈ వివాదం నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్ సీ) సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ వాదనకు భిన్నమైన అంశాన్ని స్పష్టం చేసింది. అదేమంటే.. అస్బెస్టాస్ ను మానవులకు క్యాన్సర్ బారిన పడే గ్రూప్ 1 పదార్థంగా వర్గీకరించటం ఎదురుదెబ్బగా మారింది. అంటే..ఒక వేళ బేబీ టాల్కమ్ పౌడర్ లో అస్బెస్టాస్ కలిసి ఉంటే.. అది కచ్ఛితంగా క్యాన్సర్ కు దారి తీస్తుందని స్పష్టం చేసింది. ఈ ఉదంతానికి సంబంధించి ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ గుర్తించిన ఆధారాల ద్వారా కొన్ని సంచలన అంశాల్ని ప్రపంచం ముందు పెట్టింది.
అదేమంటే కంపెనీకి చెందిన అంతర్గత ల్యాబ్ రిపోర్టులు.. మెమోల ప్రకారం 1971 నుంచి 2000 ప్రారంభం వరకు తాము సేకరించిన ముడి టాల్క్.. దాని పౌడర్లలో అస్బెస్టాస్ ఆనవాళ్లు ఉన్నట్లుగా కంపెనీ పరిశోధకులు గుర్తించిన అంశాన్ని అధికారులు పసిగట్టారు. ఈ విషయాన్ని బయటకు రాకుండా ఉంచటం.. టాల్కం ఉత్పత్తులపై కఠినమైన నిబంధనలు తీసుకురాకుండా ప్రభుత్వ నియంత్రణ సంస్థలను ప్రభావితం చేయటానికి కంపెనీ ప్రయత్నించిందంటూ కోర్టులో దాఖలు చేసిన పత్రాలు చెప్పేశాయి. ఇది జాన్సన్ అండ్ జాన్సన్ ను ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసిందని చెబుతారు.
ఈ వివాదం మీద కొన్ని సంస్థలు అనుకూలంగా.. మరికొన్ని ప్రతికూలంగా వాదనలు వినిపించాయి.మొత్తంగా మెడికల్ ప్రపంచంలో టాల్కమ్ పౌడర్ వినియోగం కారణంగా క్యాన్సర్ వస్తుందా? లేదా? అన్న విషయంపై ఏకాభిప్రాయానికి మాత్రం రాని పరిస్థితి. దీనికి రెండు ఉదాహరణలు చెబితే మరింత బాగుంటుంది. జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ వైద్య పరిశోధనల ప్రకారం టాల్కమ్ పౌడర్ ను జననేంద్రియాల వద్ద ఎక్కువ కావలం వినియోగిస్తే మహిళల్లో అండాశయ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం సుమారు 33 శాతం పెరుగుతుందని చెబితే.. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ మాత్రం టాల్కమ్ కు క్యాన్సర్ కు ఉన్న లింక్ మీద మరిన్ని పరిశోధనలు జరగాలని చెబుతూ.. తమ అధ్యయనాల్లో క్యాన్సర్ వచ్చే ముప్పు తక్కువన్నట్లుగా తేలినట్లు చెప్పటమే దీనికి నిదర్శనం.
ఈ వాదనలు.. ప్రతివాదనలు ఎలా ఉన్నా.. టాల్కమ్ పౌడర్ లో అస్బెస్టాస్ కలిస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్న వాదనను ఎఫ్ డీఏ ల్యాబ్ స్పష్టం చేయటం.. ఈ వాదనకు బలం చేకూరేలా జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థకు చెందిన ఇంటర్నల్ (అంతర్గత) పత్రాలు బలమైన ఆధారాలుగా మారటంతో.. కోర్టు జ్యూరీలు బాధితులకు అనుకూలంగా తీర్పులు ఇవ్వటం మొదలు పెట్టాయి.
ఈ మొత్తం రచ్చకు రెండు న్యాయపోరాటాలు కీలకంగా చెప్పాలి. ఇందులో ఒక కేసులో కంపెనీ మీద న్యాయపోరాటం చేస్తున్న మహిళ.. కోర్టు వెలుపల భారీ మొత్తాన్ని పరిహారంగా ఇచ్చేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ ఆఫర్ చేసినా.. పైసా తీసుకోకుండా ఆ విషయాన్ని కోర్టులో చెప్పటం ద్వారా కొత్త సంచలనానికి తెర తీస్తే.. ఇది జరిగిన కొన్నేళ్ల తర్వాత మరో మహిళ ఇదే ఉత్పత్తి వినియోగం ద్వారా తాను క్యాన్సర్ బారిన పడినట్లుగా పేర్కొంటూ చేసిన న్యాయపోరాటం.. జాన్సన్ అండ్ జాన్సన్ కు పెద్ద ఎదురుదెబ్బగా చెబుతారు.
ఇంతకూ ఆ ఇద్దరు ఎవరు? వారి న్యాయపోరాటం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..
2009లో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ మీద మొదటిసారి కోర్టు ముందుకు వచ్చిన డీన్ బెర్గ్ కేసును చూస్తే.. ఆమె అమెరికాలోని సౌత్ డకోటా రాష్ట్రానికి చెందిన ఒక ఫిజీషియన్ అసిస్టెంట్. 1975 నుంచి దాదాపు 30 ఏళ్ల పాటు ప్రతి రోజు తన వ్యక్తిగత పరిశుభ్రత కోసం జాన్సన్ అండ జాన్సన్ బేబీ పౌడర్ ను వినియోగించేవారు. 2006లో ఆమెకు స్టేజ్ 3 అండాశయ క్యాన్సర్ ఉన్నట్లుగా వైద్యులు తేల్చారు. చికిత్సలో భాగంగా ఆమెకు కీమోథెరపీ తదితరాలు చేశారు. తమ కుటుంబ హిస్టరీలో ఎవరికీ క్యాన్సర్ చరిత్ర లేకపోవటం.. తనకు ఎలాంటి అనారోగ్య అలవాట్లు లేకున్నా క్యాన్సర్ ఎందుకు వచ్చిందన్న ఆలోచనలు ఆమెకు ఎక్కువగా ఉండేవి.
దీంతో ఆమె.. తన క్యాన్సర్ మూలాలకు కారణమైన అంశాలపై శోధించటం షురూ చేశారు. ఇందులో భాగంగానే కొన్ని మెడికల్ జర్నల్స్ లో టాల్కమ్ పౌడర్ వినియోగానికి.. అండాశయ క్యాన్సర్ కు ఉన్న లింక్ గురించి చదివి.. తాను అలా క్యాన్సర్ బాధితురాలు అయ్యానని భావించి ఆమె 2009లో సివిల్ కేసు వేశారు. టాల్కమ్ పౌడర వినియోగంతో అండాశయ క్యాన్సర్ వచ్చే ముప్పు అంశాన్ని1982 నుంచే కంపెనీకి చెందిన కొందరు శాస్త్రవేత్తలు అంతర్గతంగా కంపెనీకి చెప్పినట్లుగా డీన్ బెర్గ్ తరఫు లాయర్లు నిరూపించారు. అదే సమయంలో ముగ్గురు ప్రముఖ క్యాన్సర్ పరిశోధకులు కోర్టు విచారణకు హాజరై..డీన్ బెర్గ్ అండాశయాల కణజాలంలో టాల్క్ కణాలు ఉన్నాయని.. ఆ పౌడర్ వల్లే ఆమెకు క్యాన్సర్ వచ్చిందంటూ స్పష్టమైన సాక్ష్యాలు ఇచ్చారు.
డీన్ బెర్గ్ క్యాన్సర్ కు జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కమ్ పౌడరే కారణమని.. వినియోగదారులను హెచ్చరించే విషయంలో కంపెనీ ఘోరంగా ఫెయిల్ అయ్యిందన్న అంశాన్ని జ్యూరీ ఏకగ్రీవంగా అంగీకరించింది. అయితే.. అప్పటి చట్టాల పరకారం పౌడర్ వల్లే క్యాన్సర్ వచ్చిందని వంద శాతం శాస్త్రీయంగా నిరూపించటంలో సాంకేతిక లోపాలు ఉన్నట్లుగా జ్యూరీ భావించింది. ఈ కేసు వివాదం నడుస్తుండగా.. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తమపై కేసు వేసిన డీన్ బెర్గ్ కు ఒక సీక్రెట్ ఆఫర్ ఇచ్చింది. కేసును సెటిల్ చేసుకుంటే కోర్టు బయట భారీ మొత్తాన్ని ఇస్తామని.. కేసును వెనక్కి తీసుకోవాలని.. తమ ఆఫర్ ను ఎక్కడా బయటపెట్టకూడదన్న కండీషన్ పెట్టింది. అందుకు డీన్ బెర్గ్ నో చెప్పేశారు.
తనకు డబ్బులు ముఖ్యం కాదని.. ప్రపంచంలోని మహిళలందరికి నిజం తెలియాలని చెబుతూ జాన్సన్ అండ్ జాన్సన్ ఆఫర్ ను రిజెక్టు చేశారు. ఈ కేసు ద్వారా ఆమె సాధించిన విజయం పరిహారం కాకున్నా.. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ సురక్షితం కాదన్న అంశాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు. ఈ కేసు పునాదిగామారి ఆ తర్వాత అంటే.. 2016లో జాక్వెలిన్ ఫాక్స్ కేసు వేయటానికి.. ఆ తర్వాత వేలాది మంది మహిళలు కంపెనీ మీద ధైర్యంగా కోర్టును ఆశ్రయించటానికి కారణమైందని చెప్పాలి.
రూ.600 కోట్ల ఫైన్
ఇక్కడే జాక్వెలిన్ ఫాక్స్ కేసు గురించి చెప్పాలి. ఈ కేసులో ఆమె సాధించిన విజయం జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థకు భారీ ఫైన్ కోర్టు వేసింది. ట్విస్ట్ ఏమంటే.. ఈ భారీ ఫైన్ ను కంపెనీ బాధితురాలికి చెల్లించలేదు. దీనికి కారణం ఒక సాంకేతిక కారణం. అయితే.. ఈ కేసు తర్వాత జే అండ్ జే మీద పెద్ద ఎత్తున కేసులు నమోదైన పరిస్థితి. అమెరికాలోని అలబామా రాష్ట్రానికి చెందిన జాక్వెలిన్ ఫాక్స్ 35 ఏళ్లకు పైనే జాన్సన్ అండ జాన్సన్ బేబీ పౌడర్ తో పాటు షవర్ టు షవర్ టాల్కమ్ పౌడర్ ను వ్యక్తిగత పరిశుభ్రత కోసం ఉపయోగించేవారు. 2013లో ఆమెకు అండాశయ క్యాన్సర్ ఉన్నట్లుగా నిర్దారణ అయ్యింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత సెంట్ లూయిస్ సర్క్యూట్ కోర్టులో 12 మంది సభ్యుల జ్యూరీ సుదీర్ఘ విచారణ తర్వాత జే అండ్ జే తీవ్రమైన తప్పు చేసినట్లుగా తేల్చారు. బాధితురాలి కుటుంబానికి 72 మిలియన్ డాలర్లు మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.600 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించారు.
ఇంతకూ జాక్వెలిన్ ఫాక్స్ కు వచ్చిన క్యాన్సర్ టాల్కమ్ పౌడర్ తోనే అన్న విషయాన్ని ఎలా తేల్చారన్న విషయంలోకి వెళితే.. క్యాన్సర్ నిర్దారణ తర్వాత ఆమె అండాశయాల కణజాలాన్ని పాథాలజీ ల్యాబ్ లో క్షుణ్ణంగా పరీశించారు. అక్కడ టాల్క్ ఖనిజానికి చెందిన సూక్ష్మ కణాలు పేరుకుపోయిన వైనాన్ని వైద్య నిపుణులు గుర్తించారు. దాదాపు 35 ఏళ్ల పాటు ఆమెె జననేంద్రియాల వద్ద సదరు పౌడర్ వాడటంతో ఆ టాల్క్ కణాలు శరీరంలోపలకు ప్రయాణించి.. అండాశయాలకు చేరినట్లుగా గుర్తించారు.అవి తీవ్రమైన ఇన్ప్లమేషన్ కు దారి తీసి.. కాలక్రమంలో క్యాన్సర్ బారిన పడే పరిస్థితి దాపురించింది.
తనకు వచ్చిన క్యాన్సర్ కు జే అండ్ జే టాల్కమ్ పౌడర్ అన్న విషయాన్ని తెలుసుకున్న ఆమె.. డీన్ బెర్గ్ మహిళ చేసిన న్యాయపోరాటం గురించి తెలుసుకున్న జాక్వెలిన్ న్యాయపోరాటానికి దిగారు. తాను ఎంతగానో నమ్మిన బ్రాండ్ కారణంగా తనకు క్యాన్సర్ రావటంపై తీవ్ర ఆగ్రహానికి గురై.. తనలాంటి మరే మహిళా మోసపోకూడదన్న ఉద్దేశంతో ఆమె న్యాయపోరాటానికి దిగినట్లుగా పేర్కొన్నారు. ఆమె తన మరణానికి ముందు కోర్టు కోసం రికార్డు చేసిన ఆడియో సాక్ష్యం జ్యూరీ సభ్యుల మనసుల్ని కదిలించింది. తను నమ్మిన బ్రాండ్ తనను ఎలా మోసం చేసిందో ఆమె ఆ ఆడియోలో వివరించిన వైనం అక్కడి వారిని కదిలించి వేసిందని చెబుతారు. అదే సంచలన జరిమానాకు కారణమైందని చెబుతారు.
టాల్కమ్ పౌడర్ తో క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందనే విషయాన్ని కంపెనీ మెడికల్ కన్సల్టెంట్లు 1990లలోనే హెచ్చరించినట్లుగా తెలిపే కొన్ని అంతర్గత ఇమొయిళ్లు.. రిపోర్టులను లాయర్లు కోర్టులో ప్రవేశ పెట్టటంతో అసలు నిజం వెలుగు చూసింది. అంతేకాదు.. వ్యాపార లాభాలు దెబ్బ తినకుండా ఉండాలన్న ఉద్దేశంతో వినియోగదారులకు హెచ్చరిక కూడా ప్రింట్ చేయకుండా కంపెనీ మోసం చేసినట్లుగా జ్యూరీ నిర్దారించింది. అయితే.. జే అండ్ జే మాత్రం తన మీద వచ్చిన ఆరోపణల్ని కొట్టేసింది. టాల్కమ్ పౌడర్ వినియోగానికి.. అండాశయ క్యాన్సర్ కు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం ఉందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవని వాదించింది.అయితే.. ఈ వాదనతో జ్యూరీ ఏకీభవించలేదు.
దీంతో.. బాధితురాలికి నష్టపరిహారంగా 10 మిలియన్ డాలర్లు.. కంపెనీ కావాలనే నిజాన్ని దాచి పెట్టినందుకు 62 మిలియన్ డాలర్ల జరిమానా కోర్టు విధించింది. దురదృష్టకరమైన అంశం ఏమంటే.. కోర్టు తీర్పు రావటానికి మూడు నెలల ముందే ఆమె క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు. ఆమె మరణం తర్వాత ఆమె కుమారుడు మార్విన్ సాల్టర్ చట్టపరమైన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇంత జరిగిన తర్వాత కూడా జే అండ్ జే పరిహారాన్ని చెల్లించలేదు. కారణం.. జాక్వెలిన్ ఫాక్స్ అలబామా రాష్ట్ర నివాసి అయితే.. ఆమె మిస్సోరి కోర్టులో కేసు వేసిన కారణాన్ని చూపిన జే అండ్ జే సదరు కోర్టులో కేసు వేయటానికి చట్టపరమైన పరిధి లేదని వాదించింది. జ్యూరీ తీర్పుపై అప్పీలుకు వెళ్లిన జే అండ్ జే సాంకేతిక తప్పిందాన్ని చూపించటంతో.. అంతకు ముందు ఇచ్చిన తీర్పును పూర్తిగా కొట్టేసింది.
అయితే.. ఆ తర్వాత నుంచి ఇతర రాష్ట్రాల్లోని పలువురు బాధితులు వేసిన కేసుల్లో కంపెనీకి వందల మిలియన్ డాలర్ల జరిమానాలు పడుతూనే వచ్చాయి. చూస్తుండగానే ఈ కేసులు వేల కొద్దీ కోర్టుల్లో దాఖలయ్యాయి. వీటిపై న్యాయపోరాటం సంస్థకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇందుకు అయ్యే లీగల్ ఖర్చులు కంపెనీకి భారంగా మారాయి.ఈ నేపథ్యంలో తనపై ఉన్న అన్ని కేసుల నుంచి బయటకు వచ్చేందుకు తాజాగా భారీ ప్రతిపాదనతోముందుకు వచ్చింది. అన్ని కేసుల్ని సెటిల్ చేసుకునేందుకు రూ.52 వేల కోట్ల పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. తాను చెప్పిన భారీ మొత్తాన్ని 18 నెలల వ్యవధిలో చెల్లిస్తానని చెప్పింది. అయితే.. బాధితుల్లో 95 శాతం మంది అంగీకరిస్తేనే ఈడీల్ ముందుకు పడనుంది. ఒకవేళ అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడితే.. కేసులు యథాతధంగా సాగనున్నాయి. ఒక అంచనా ప్రకారం తనపై దాఖలయ్యే కేసుల కోసం, ఒప్పందాల కోసం జాన్సన్ అండ్ జాన్సన్ సుమారు రూ.33వేల కోట్ల నుంచి రూ.42 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతారు.
చివరగా.. ఈ మొత్తం వివాదం నేపథ్యంలో జాన్సన్ అండ్ జాన్సన్ తన ఉత్పత్తుల్లో టాల్కమ్ కు బదులుగా కార్న్ స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ ను అమ్ముతోంది. ఇందుకు కెన్ వ్యూ అనే కంపెనీకి దీన్ని బదలాయించింది. జాన్సన్ అండ్ జాన్సన్ కు బదులుగా భారతదేశంలోనూ కెన్ వ్యూ కంపెనీ ప్రస్తుత బేబీ పౌడర్ ను ఉత్పత్తి చేస్తోంది. ఇదంతా 2023 తర్వాత జరిగింది. ఇప్పటికి ఈ బేబీ పౌడర్ వినియోగించే వారు తాము కొనే ఉత్పత్తి వెనుక కార్న్ స్టార్చ్ తో తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. వాటిని మాత్రమే వినియోగించటం సురక్షితమని చెబుతున్నారు. సో.. బీకేర్ ఫుల్.
