Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... బీఆరెస్స్ మాజీ ఎంపీ సంతోష్ పై ఫోర్జరీ కేసు!

బీఆరెస్స్ కు బ్యాడ్ టైం నడుస్తుందనే చర్చ గత కొంతకాలంగా.. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినప్పటినుంచీ జరుగుతోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   24 March 2024 9:49 AM GMT
బిగ్ బ్రేకింగ్... బీఆరెస్స్ మాజీ ఎంపీ సంతోష్ పై ఫోర్జరీ కేసు!
X

బీఆరెస్స్ కు బ్యాడ్ టైం నడుస్తుందనే చర్చ గత కొంతకాలంగా.. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినప్పటినుంచీ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలకు పరిమితమైపోవడం ఒక సమస్య అయితే... రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత వరుసగా బీఆరెస్స్ నేతలు కారు దిగిపోతుండటం మరొక బ్యాడ్ న్యూస్ అని చెబుతున్నారు. ఇక లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ జాబితా మరింత పెరగొచ్చనే చర్చా తెరపైకి వస్తోంది.

ఇక ఇప్పటికే బీఆరెస్స్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ కాబడటం, ప్రస్తుతం జైల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉండటం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది! దీంతో... కేసీఆర్ పూర్తిగా సైలంట్ అయిపోయారని.. నిన్నమొన్నటివరకూ బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న తమ కుమార్తె ఇలా లిక్కర్ స్కాంలో అరెస్ట్ కాబడటంపై తీవ్ర ఆందోళనలో ఉన్నారని అంటున్నారు.

ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆరెస్స్ కు మరో అతిపెద్ద సమస్య కాబోతుందనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అది అతిపెద్ద క్రైం అని.. దానికి సంబంధించిన పూర్తి విషయాలు వెలుగులోకి వస్తే తెలంగాణ రాజకీయాల స్వరూపమే పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమయంలో బీఆరెస్స్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పై కేసు నమోదైంది!

బీఆరెస్స్ అధికారంలో ఉన్నంతకాలం కేసీఆర్ కు రైట్ హ్యాండ్ అనే పేరున్న బీఆరెస్స్ నేత, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై తాజాగా కేసు నమోదైంది! బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో భుమి కబ్జాకు యత్నిస్తున్నారంటూ నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఫిర్యాదు మేరకు సంతోష్ కుమార్ తో పాటు లింగారెడ్డి శ్రీధర్ పైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇందులో భాగంగా... బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని సర్వే నెంబర్ 129 / 54 లో 1350 చదరపు గజాల స్థలాన్ని నవయుగ సంస్థ కొనుగోలు చేసిందంట. అయితే... నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలం కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఈ నెల 21న కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో... వీరిపై సెక్షన్ 400, 447, 471, 120బి రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది!