అమరావతితో పెట్టుకుని ఓడిపోయాం: జోగి రమేష్
ఇప్పుడు కూడా.. అమరావతి జోలికి పోవడం సరికాదన్నట్టుగా జోగి వ్యాఖ్యానించారు. ``గతంలో ఒక పొరపాటు జరిగింది.
By: Tupaki Desk | 8 Jun 2025 10:29 AMఏపీ రాజధాని అమరావతి మహిళలపై వైసీపీ అధినేత జగన్‌కు చెందిన సాక్షి మీడియాలో వచ్చిన చర్చ.. తీవ్ర వ్యాఖ్యలు వంటివి.. రాజకీయ దుమారం రేపాయి. పార్టీలకు అతీతంగా అందరూ ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. అయితే.. వైసీపీ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎవరూ నేరుగా స్పందించలేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ రియాక్ట్ అయ్యారు. అమరావతితో పెట్టుకునే తాము గత ఎన్నికల్లో ఓడిపోయామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు కూడా.. అమరావతి జోలికి పోవడం సరికాదన్నట్టుగా జోగి వ్యాఖ్యానించారు. ``గతంలో ఒక పొరపాటు జరిగింది. ఇప్పుడు దానిని కొనసాగించడం సరికాదు. ఇది అందరికీ వర్తిస్తుంది`` అని జోగి వ్యాఖ్యానించారు. మహిళలకు జగన్ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్న ఆయన.. ఇళ్ల పట్టాల నుంచి పథకాల వరకు కూడా.. అన్నీ మహిళల పేరుతోనే జగన్ అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేబినెట్లో కూడా.. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు.
ఇక, మూడు రాజధానుల విషయంపైనా స్పందించిన జోగి.. తాము ప్రజలకు వివరించి చెప్పడంలో విఫల మయ్యామన్నారు. గతంలో జగన్ చేస్తానని ప్రకటించిన.. కార్యక్రమాన్నే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నా రని చెప్పారు. ``మేం రాజధానులు అన్నాం. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నది మా ఉద్దేశం. ఇప్పుడు అదే కదాచంద్రబాబు చేస్తున్నది`` అని వ్యాఖ్యానించారు. కర్నూలులో హైకోర్టు పెడతామని చెప్పామని.. కానీ.. ఇప్పుడు బాబు బెంచ్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.
విశాఖను ఆర్థిక రాజధాని చేయాలన్నది జగన్ సంకల్పమని.. అందుకే.. దానిని రాజధానిగా ప్రకటించారని చెప్పారు. కానీ.. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పనిచేస్తున్నారని.. ఐటీ ని విశాఖకు కీలకంగా మార్చడం లేదా? అని ప్రశ్నించారు. రాజధాని అమరావతి అలానే ఉంటుందని నాడు జగన్ చెప్పారని.. రైతులను ఒప్పించడంలో తాము విఫలమయ్యాయమని జోగి వ్యాఖ్యానించారు. గతంలో అమరావతితో పెట్టుకునే తాము ఓడిపోయామని పదే పదే చెప్పడం గమనార్హం.