రాజీవా-రమేషా.. జోగి కుంటుంబంలో టికెట్ పోరు.. !
వైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్.. కుటుంబంలో రాజకీయ వివాదం ముసురుకుందా? టికెట్ కోసం తండ్రీ కొడుకులు..
By: Garuda Media | 5 April 2026 6:00 PM ISTవైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్.. కుటుంబంలో రాజకీయ వివాదం ముసురుకుందా? టికెట్ కోసం తండ్రీ కొడుకులు.. వాదులాడుకుంటున్నారా? అంటే.. అవుననే అంటున్నారు వైసీపీ నాయకులు. ఇది కొంత చిత్రంగానే ఉన్నా.. వాస్తవమని తెలుస్తోంది. జోగి రమేష్ వచ్చే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. వాస్తవానికి ఆయన తనకు కలిసి వచ్చిన నియోజకవర్గంగా చెబుతున్నారు.
గత 2019 ఎన్నికల్లో పెడన నుంచి పోటీ చేసిన జోగి.. విజయం దక్కించుకున్నారు. తర్వాత.. ఎన్నికల్లో ఆయన మైలవరం నుంచి పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ప్రస్తుతం వివిధ కేసుల్లో ఆయన చిక్కుకున్న విషయం తెలిసిందే. నకిలీ మద్యం నుంచి అగ్రిగోల్డ్ భూముల వరకు కూడా పలు కేసుల్లో ఆయన ఉన్నారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఆయన.. వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టారు.
అయితే.. గత ఎన్నికల్లోనే తన కుమారుడిని బరిలోకి తీసుకురావాలని అనుకున్నప్పటికీ.. జగన్ అవకాశం ఇవ్వలేదు. దీంతో రమేష్ పోటీ చేశారు. కానీ, వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ములా అవలంభిస్తామని ఇటీవల పార్టీ అధినేత చెప్పుకొచ్చారు. అయితే.. ఈ ఫార్ములా ఒక్క జోగికేనా.. మిగిలిన వారికి కూడానా అనేది తెలియాల్సి ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఒక టికెట్టే లభిస్తే.. అది తనకేనని రాజీవ్ పట్టుబడుతున్నారని సమాచారం.
అది కూడా మైలవరం అయితే.. తన గెలుపు పక్కా అని రాజీవ్ అంచనా వేసుకుంటున్నారు. కానీ, రమేష్ మాత్రం.. ఈ ఒక్కసారికి తనే పోటీ చేస్తానని.. రెండో టికెట్ ఇస్తే.. నువ్వ పోటీ చేయాలని కుమారుడికి తే ల్చి చెప్పినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై ఇంట్లో పెద్ద రచ్చ సాగిందని పార్టీలో గుసగుస వినిపిస్తోంది. అయితే.. దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అనే అంశంకూడా చర్చకు దారి తీసింది. ఇంట్లో గొడవ పడితే.. అది వైసీపీ అధినేతకు చేరి.. తమ కుటుంబాన్ని ఓదార్చేందుకు.. సానుభూతి చూపించేందుకు రెండు టికెట్లు ఇచ్చినా ఇచ్చే అవకాశం ఉందన్న వ్యూహంతోనే జోగి ఆయన కుమారుడు ఈ విధమైన రగడకు తెరదీశారన్న చర్చ కూడా సాగుతోంది.
