'చంద్రబాబు భార్యపై వ్యాఖ్యలు తప్పే'... జోగి రమేష్ లో మార్పు చూశారా?
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తాజాగా రెండు కీలక విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 7 Jun 2025 3:30 PM ISTగత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణిపై అభ్యంతరకర, అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అప్పట్లో పలువురు వైసీపీ నేతలు చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శల పాలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆ వ్యాఖ్యలు తప్పేనని, వాటిపై తమను ఇంట్లో కూడా నిలదీశారని అంటున్నారు జోగి రమేష్.
అవును.. వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తాజాగా రెండు కీలక విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తాము మూడు రాజధానుల అంశాన్ని ఎత్తుకోవడం తప్పు అయ్యింది అనేది ఒకటి కాగా.. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు మరింత సమస్యగా మారాయని.. అవి కూడా తమ ఓటమికి ఒక కారణం అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు.
తాజాగా ఓ ఛానెల్ తో మాట్లాడిన జోగి రమేష్... రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై చేసిన కామెంట్స్ కారణంగా తన భార్య తనను నిలదీసిందని.. అసెంబ్లీకి వెళ్లేది ఇటువంటి పనిమాలిన మాటలు మాట్లాడేందుకేనా.. చంద్రబాబు సతీమణిపై అలా మాట్లాడోచ్చా అని తనను ప్రశ్నించిందని.. తాము అలాంటి మాట్లు మాట్లాడటం తప్పేనని జోగి రమేష్ అంగీకరించారు.
కొంతమంది చేసిన తప్పుల వల్లో, తన వల్ల జరిగిన తప్పుల వల్లో పార్టీకి నష్టం జరిగిందని, దాన్ని తాము సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇదే సమయంలో... వైసీపీ ఎత్తుకున్న మూడు రాజధానుల అంశంపైనా ఆయన స్పందించారు. గతంలో మూడు రాజధానుల సిద్ధాంతం వల్ల వైసీపీ తీవ్రంగా నష్టపోయిందని.. ఇకపై ఏపీకి అమరావతే రాజధాని అని అన్నారు!
తాము మూడు రాజధాను అన్నతర్వాత రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు తర్వాత తాము మూడు రాజధానుల జోలికి వెళ్లమని.. జగన్ మళ్లీ సీఎం అయిన తర్వాత అమరావతిలోనే రాజధాని నిర్మాణం కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. రాజధాని కోసం పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై దాడులు తప్పేనని అన్నారు!
తాజాగా జోగి రమేష్ ఈ స్థాయిలో పశ్చాత్తాపం వ్యాఖ్యలు చేయడంతో దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ విషయం ఇప్పుడే తెలిసొచ్చిందా అని ఒకరంటే... ఇప్పటికైనా తెలుసుకున్నారు సంతోషం అని మరొకరు కామెంట్ చేస్తున్నారు.
