Begin typing your search above and press return to search.

ఇప్పుడు జోగి రమేశ్ నెంబర్.. ఏం చేస్తారో?

వైసీపీ నేతల వరుస అరెస్టుల నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేశ్ నెంబర్ వచ్చిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   10 April 2025 11:17 AM IST
Jogi Ramesh CID Investigation
X

వైసీపీ నేతల వరుస అరెస్టుల నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేశ్ నెంబర్ వచ్చిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారనే ఆరోపణలతో పోలీసు కేసు ఎదుర్కొంటున్న జోగిని విచారణకు రమ్మంటూ సీఐడీ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో జోగి ముందస్తు బెయిల్ పై బయట ఉన్నారు. అయితే విచారణ అనంతరం జోగిపై సీఐడీ ఎలాంటి యక్షన్ తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.

వైసీపీ అధికారంలో ఉండగా, అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారని మాజీ మంత్రి జోగి రమేశ్ పై కేసు నమోదైంది. ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుపై దాడికి యత్నించడంపై అప్పట్లోనే సీఆర్ఫీఫ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ ఫిర్యాదును తేలిగ్గా తీసుకోవడంతో జోగి రమేశ్ పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. ఈ సంఘటన తర్వాతే ఆయనకు మంత్రి పదవి దక్కింది. దాంతో జోగిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు.

ఇక గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. విచారణను సీఐడీకి అప్పగించారు. దీంతో మాజీ మంత్రి జోగికి కష్టాలు మొదలయ్యాయి. అదేసమయంలో అరెస్టు భయంతో అప్పట్లో అండర్ గ్రౌండుకి వెళ్లిన జోగి రమేశ్ స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు బెయిల్ కోసం ప్రయత్నించారు. అన్ని స్థాయిల్లోనూ ఆయనకు ఎదురుదెబ్బ తగలగా, సుప్రీంకోర్టు మాత్రం అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. విచారణకు సహకరించమంటూ ఆదేశాలిచ్చింది. ఇప్పటికే పలుమార్లు సీఐడీ విచారణ ఎదుర్కొన్న జోగి రమేశ్ కు కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చారు. ఆకస్మాత్తుగా మళ్లీ రమ్మంటూ నోటీసులు జారీ చేయడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

గత ప్రభుత్వంలో నోటి దురుసుతో వ్యవహరించిన నేతల్లో జోగి రమేశ్ పేరు కూడా మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ లో రాశారంటున్నారు. దీంతో ఆయనపై కూటమి ప్రభుత్వం రాగానే ఫోకస్ చేశారు. ముందుగా అగ్రిగోల్డ్ ల్యాండ్ స్కాంలో జోగి కుమారుడిని అరెస్టు చేశారు. ఈ విషయంపై బాగా కుంగిపోయిన జోగి రమేశ్ టీడీపీతో సత్సంబంధాలకు ప్రయత్నించారు. ఆ పార్టీ చేరేందుకు కూడా ప్రయత్నించారని ప్రచారం జరిగింది. అయితే ఆయన రాకను టీడీపీలోని అన్ని స్థాయిల్లో వ్యతిరేకించడంతో వైసీపీలో ఉండిపోవాల్సివచ్చిందని అంటున్నారు. జోగిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం ఆయనను అరెస్టు చేయించేందుకు పావులు కదుపుతోందని ప్రచారం జరుగుతోంది. దీంతో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మళ్లీ ఆయనను విచారణకు పిలవడం ఆసక్తి రేపుతోంది.