టెన్షన్ తీసుకోని జోగి రమేశ్
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ టెన్షన్ తీసుకునేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు.
By: Tupaki Desk | 11 April 2025 7:27 AMమాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ టెన్షన్ తీసుకునేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. తనపై నమోదైన కేసులో సీఐడీకి సహకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం సీఐడీ విచారణకు వెళ్లారు. దీంతో జోగి రమేశ్ సీఐడీకి సహకరిస్తారా? లేదా? అన్న చర్చకు తెరపడింది. ప్రస్తుతం విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో జోగి రమేశ్ విచారణ కొనసాగుతోంది. దీనిలో ఆయనను ఏయే విషయాలపై ప్రశ్నిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.
సీఐడీ విచారణకు వస్తారా? లేదా? అనే చర్చకు మాజీ మంత్రి జోగి రమేశ్ తెరదించారు. విజయవాడలోని తాడిగడపలో ఉన్న సీఐడీ కార్యాలయానికి శుక్రవారం వచ్చిన జోగి విచారణకు సహకరిస్తున్నారని చెబుతున్నారు. అయితే సీఐడీ అడుగుతున్న ప్రశ్నలకు ఆయన సరైన సమాచారం ఇస్తుందీ? లేనిదీ? ఇంకా స్పష్టత రాలేదు. 2021లో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఇంటిపై దాడికి దిగారని జోగి రమేశ్ పై తాడేపల్లి పోలీసుస్టేషనులో కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును సీఐడీకి బదిలీ చేసింది.
గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జోగి రమేశ్ దూకుడుగా వ్యవహరించేవారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ పై విమర్శలు చేయడానికి ముందుండేవారు. ఈ క్రమంలోనే 2021లో కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి భారీ కాన్వాయ్ తో చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఈ వివాదం పెను సంచలనమైంది. ఈ వ్యవహారం తర్వాతే జోగి రమేశ్ ను మంత్రిని చేశారంటారు. అయితే అప్పట్లో జోగి రమేశ్ చూపిన దూకుడు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేలా చేస్తోందని అంటున్నారు.