ఆ నలుగురిలో మిగిలిన వారి పరిస్థితి ఏంటో.. ఆపరేషన్ కృష్ణా వైసీపీ!
మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుతో ‘ఆపరేషన్ కృష్ణా వైసీపీ’లో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసినట్లు కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Political Desk | 2 Nov 2025 11:00 PM ISTమాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుతో ‘ఆపరేషన్ కృష్ణా వైసీపీ’లో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసినట్లు కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో దూకుడుగా వ్యవహరించిన నేతల్లో ఒకరైన మాజీ మంత్రి జోగిని కల్తీ మద్యం స్కాంలో తాజాగా అరెస్టు చేశారు. నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి జోగి అరెస్టుపై అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే తగిన సమయం కోసం ఎదురుచూసిన ప్రభుత్వం కల్తీ మద్యం తయారీలో ఆయన పాత్రపై ఆధారాలు లభించడంతో అరెస్టు చేయించింది. ఇక జోగి అరెస్టు తర్వాత నెక్ట్స్ ఎవరన్న చర్చ మొదలవగా, ఆపరేషన్ కృష్ణా వైసీపీలో ఇంకా మిగిలిన ఇద్దరి భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది.
కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కేసులను తెరపైకి తీసుకువచ్చి, ఆయా కేసుల్లో నిందితులైన వైసీపీ నేతల అరెస్టు దిశగా వేగంగా చర్యలు తీసుకుంది. ప్రధానంగా గత ప్రభుత్వంలో దూకుడుగా వ్యవహరించి, అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ ను వ్యక్తిగతంగా దూషించడంతోపాటు వారి కుటుంబ సభ్యులను కించపరిచిన నేతల లిస్టును తయారు చేసిన ప్రభుత్వం.. ఒక్కొక్కరిని అరెస్టు చేయించిందని అంటున్నారు. ఈ లిస్టులో వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పదవులు అనుభవించిన వారితోపాటు సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారు. వీరిలో చాలామంది ఇప్పటికే అరెస్టు అయ్యారు. తాజాగా జోగి అరెస్టు కూడా ఇందులో భాగంగానే చెబుతున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన నేతల్లో జోగి రమేష్, కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ గత ప్రభుత్వంలో దూకుడుగా వ్యవహరించారు. నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడారని విమర్శలు ఎదుర్కొన్నారు. వీరు వాడిన భాష అభ్యంతరకంగా ఉండటం వల్ల వైసీపీ గత ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుందనే వ్యాఖ్యలు, విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఈ నేతల మాటలతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికీ ఆగ్రహంగానే ఉన్నారని అంటున్నారు. అందుకే ఈ నలుగురి అరెస్టుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
టీడీపీ కేడర్ ఒత్తిడితో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని, మాజీ మంత్రి జోగి అరెస్టు అయ్యారు. ఈ పరిణామంతో టీడీపీ వర్గాలు కొంత శాంతించినట్లే కనిపిస్తున్నా, మిగిలిన వారిపై ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే ప్రభుత్వం టార్గెట్ చేసిన నేతల్లో మాజీ మంత్రి పేర్ని నాని న్యాయపరమైన రక్షణతో ప్రస్తుతం సేఫ్ గానే ఉన్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో సీనియర్ నేత కొడాలి నాని విషయంలోనే ప్రభుత్వం ఏం చేస్తుందనే ఉత్కంఠ నెలకొంది.
గత ప్రభుత్వంలో కొడాలి నాని ఏది మాట్లాడినా ఒక సంచలనమే అయ్యేది. ఆయన ఏం మాట్లాడేవారో? ఎందుకు అలా మాట్లాడేవారో కానీ, ఇప్పుడు ఆ మాటలతో తీవ్ర చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా ఏడాదిన్నరగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. అప్పుడప్పుడు నియోజకవర్గంలో కనిపిస్తున్నా, ఇంతకుముందులా యాక్టివుగా ఉండటం లేదు. దీనికి కారణం ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం ఎందుకన్న ఆలోచనే అంటున్నారు. అయితే కొడాలి అరెస్టు విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉన్నప్పటికీ, ఆయన అనారోగ్యం కారణంగా కాస్త వెనక్కి తగ్గుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు జోగి అరెస్టు తర్వాత మాజీ మంత్రులు పేర్ని, కొడాలిపై చర్చ మళ్లింది. ఈ ఇద్దరిపై ఇప్పటివరకు నమోదైన కేసుల్లో కోర్టు బెయిలు మంజూరు చేసింది. కానీ, ప్రభుత్వం మాత్రం సరైన కేసు కోసం ఇంకా ఎదురుచూస్తోందనే అంటున్నారు.
