Begin typing your search above and press return to search.

కంపను కదిపిన బైడెన్.. కొత్త పర్మిట్ విధానంలో అనూహ్య సమస్యలు

ఆచితూచి అన్నట్లు నిర్ణయం తీసుకోవాల్సిన అంశంలో బైడెన్ సర్కారు అనుసరిస్తున్న తీరు అమెరికాలో కొత్త చిచ్చుకు కారణమవుతోంది.

By:  Tupaki Desk   |   28 Nov 2023 5:03 AM GMT
కంపను కదిపిన బైడెన్.. కొత్త పర్మిట్ విధానంలో అనూహ్య సమస్యలు
X

ఆచితూచి అన్నట్లు నిర్ణయం తీసుకోవాల్సిన అంశంలో బైడెన్ సర్కారు అనుసరిస్తున్న తీరు అమెరికాలో కొత్త చిచ్చుకు కారణమవుతోంది. ఎంతో కాలంగా ఉన్న వలసదారులకు లభించాల్సిన వర్కుపర్మిట్లకు భిన్నంగా.. కొత్తగా దేశానికి వచ్చే లాటిన్ అమెరికా వాసులకు జెట్ స్పీడ్ తో వలస పర్మిట్లు లభిస్తున్న వైనంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అమెరికాలోని పాత వారికి.. కొత్త వారికి మధ్య పెరుగుతున్న అంతరం ఆ దేశానికి మంచిది కాదన్న మాట వినిపిస్తోంది. కొత్తగా జారీ చేస్తున్న వీసా విధానం కారణంగా బైడెన్ సర్కారు తేనె తుట్టెను కదిపినట్లు అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బైడెన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలతో ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న వలసదారుల్లో ఆగ్రహం పెరగటమే కాదు.. కొత్తగా వచ్చే వారు ఇబ్బందులు ఎదుర్కొనేలా చేస్తోంది. తాజాగా వాషింగ్టన్ లో జరిగిన భారీ ర్యాలీని పలువురు గుర్తు చేస్తున్నారు. మెక్సికో.. వెనెజువెలా.. కొలంబియా తదితర లాటిన్ అమెరికా దేశాల నుంచి అమెరికాకు వచ్చే వాలస వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీనికి తోడు కొత్త సమస్యలు అంతే వేగంగా పెరుగుతున్నాయి.

ఇలా వచ్చిన వలస శ్రామికులు అమెరికాలో పంట కోతల కోసం పండ్లు.. కూరగాయలు తెంపటం.. హోటళ్లలోనూ.. షాపుల్లోనూ.. భవన నిర్మాణంలోనూ పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏమంటే.. అమెరికాలో దశాబ్దాల నుంచి ఉంటున్న వారికి వర్కుపర్మిట్లు లభించటంలేదు. కానీ.. కొత్తగా వస్తున్న వలస కార్మికులకు మాత్రం వర్కుపర్మిట్లు లభించటంపై ఆగ్రహంవ్యక్తమవుతోంది.

బైడెన్ సర్కారు అనుసరిస్తున్న తీరుతో.. వలసదారుల్లో విభేదాల్ని.. ఉద్రిక్తతల్ని పెంచుతోంది. అమెరికాలో దగ్గరి బంధువులు.. తెలిసిన వారు ఉంటున్నారని.. వారు తమను ఆదుకుంటారని వస్తున్న వారిని గతంలో వచ్చి ఉంటున్న వారు.. వీరిని పలుకరించని పరిస్థితి. బైడెన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీపీ వన్ అనే యాప్ సాయంతో వర్కుపర్మిట్లు సులువుగా లభించటమే కాదు.. జెట్ స్పీడ్ తో అనుమతులు వస్తున్నాయి.

సెప్టెంబరులో పని అర్హత పొందిన వారికి పంపిన తాజా సమాచారం 14 లక్షలమంది కావటం ఒక ఎత్తు అయితే.. దశాబ్దాల తరబడి అమెరికాకు వచ్చి పని చేస్తూ.. పన్నులు కడుతున్నవారికి మాత్రం వర్కు పర్మిట్లు లభించకపోవటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొత్త వలసదారులకు ఆహారం.. ఆశ్రయం.. ఇతర వసతుల కల్పన కోసం బైడెన్ సర్కారు 140కోట్ల డాలర్లను మంజూరు చేయాలని పార్లమెంట్ ను కోరటం గమనార్హం. కొత్తగా వచ్చిన వారితోపాటు దశాబ్దాలుగా అమెరికాలోనే ఉంటున్న పాతవారికీ వర్కు పర్మిట్ల జారీ చేయాలన్న డిమాండ్ అంతకంతకూ ఎక్కువై.. ఆందోళన దిశగా అడుగులు పడుతున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.