Begin typing your search above and press return to search.

ఇజ్రాయెల్‌ విషయంలో జో బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు!

హమాస్‌ పై ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలుపెట్టాక ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఐదుసార్లు ఫోన్‌ లో మాట్లాడారు.

By:  Tupaki Desk   |   16 Oct 2023 7:56 AM GMT
ఇజ్రాయెల్‌ విషయంలో జో బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు!
X

ఇజ్రాయెల్‌.. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ పై చేస్తున్న దాడులకు సంబంధించి కొద్ది రోజుల క్రితం ఇజ్రాయెల్‌ కు సంపూర్ణ మద్దతును ప్రకటించింది.. అమెరికా. అంతేకాకుండా ఇజ్రాయెల్‌ కు మద్దతుగా మధ్యధరా సముద్రంలో తమ యుద్ధ నౌకను, ఆయుధాలను సైతం అందుబాటులో ఉంచింది. హమాస్‌ పై ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలుపెట్టాక ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఐదుసార్లు ఫోన్‌ లో మాట్లాడారు. ఇజ్రాయెల్‌ పై హమాస్‌ దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. హమాస్‌ దాడులను గతంలో ఆల్‌ ఖైదా ఉగ్రవాదులు అమెరికాపై చేసిన దాడులతో పోల్చారు.

అలాంటిది ఉన్నట్టుండి ఒక్కసారిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్వరంలో మార్పు వచ్చింది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌.. హమాస్‌ ఉగ్రవాదులు ఉన్న గాజాను అష్ట దిగ్బంధనం చేసిన సంగతి తెలిసిందే. విద్యుత్, నీరు, ఆహారం, నిత్యావసర వస్తువులు తదితరాలన్నింటిని గాజాకు వెళ్లనీయకుండా ఇజ్రాయెల్‌ ఆపేసింది. దీంతో ఆకలితో, చీకటితో గాజా వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు ముప్పేట ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులతో హమాస్‌ కు భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది. ముఖ్యంగా గాజాలో మహిళలు, చిన్నారులు కూడా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణిస్తున్నారు.

మరోవైపు గాజాను ఇజ్రాయెల్‌ చుట్టుముట్టడంతో ఇరాన్, లెబనాన్‌ ఇప్పటికే ఇజ్రాయెల్‌ కు హెచ్చరికలు జారీ చేశాయి. లెబనాన్‌ కు చెందిన హిజ్బొల్లా ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌ పై దాడులకు దిగారు. మరోవైపు అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటిగా ఉన్న సౌదీ అరేబియా, ఇతర అరబిక్‌ దేశాలు.. హమాస్‌ కు మద్దతుగా కార్యాచరణకు ఉపక్రమిస్తున్నాయి.

ఒకవేళ ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేస్తున్న అరబిక్‌ దేశాలు.. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, యూఏఈ తదితర దేశాలు ఈ యుద్ధంలో జోక్యం చేసుకుంటే ప్రాంతీయ సంక్షోభం తలెత్తుతుంది. ఈ పరిణామాలతో చమురు రేట్లు భగ్గుమనడం ఖాయం. అలాగే చమురు సరఫరాపైన ఈ సంక్షోభం పడే ప్రమాదం ఉంది.

ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ బలగాలు సుదీర్ఘకాలం గాజాలో ఉండటం పెద్ద పొరబాటుగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. యుద్ధాల్లో పాటించాల్సిన నిబంధనలను ఇజ్రాయెల్‌ అమలు చేస్తుందని తాము నమ్ముతున్నట్లు తెలిపారు. అమాయక పౌరులకు నీరు, ఆహారం, ఔషధాలు అందేట్లు చూడాలని ఇజ్రాయెల్‌ ను కోరారు.

గాజాను సుదీర్ఘకాలం పాటు ఇజ్రాయెల్‌ తన ఆధీనంలో ఉంచుకొంటుందని తాను భావించడంలేదని బైడెన్‌ తెలిపారు. గాజాలో పరిపాలన పాలస్తీనీయుల ఆధ్వర్యంలోనే ఉండాలన్నారు. ఒక వేళ సుదర్ఘీకాలం గాజాలోనే ఇజ్రాయెల్‌ దళాలు ఉంటే అది పెద్ద పొరబాటుగా మారుతుందని బైడెన్‌ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బైడెన్‌ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి.