Begin typing your search above and press return to search.

జోదా - అక్బర్ పెళ్లి అబద్ధం... కీలక విషయాలు లేవనెత్తిన గవర్నర్!

జోధా, అక్బర్ వివాహం చేసుకున్నారని.. ఈ కథపై ఒక సినిమా కూడా తీశారు.. చరిత్ర పుస్తకాలు కూడా ఇదే చెబుతున్నాయి కానీ అది అబద్ధం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజస్థాన్ గవర్నర్ హరిభావు బగాడే.

By:  Tupaki Desk   |   30 May 2025 10:40 AM IST
జోదా - అక్బర్ పెళ్లి అబద్ధం... కీలక విషయాలు లేవనెత్తిన గవర్నర్!
X

జోధా, అక్బర్ వివాహం చేసుకున్నారని.. ఈ కథపై ఒక సినిమా కూడా తీశారు.. చరిత్ర పుస్తకాలు కూడా ఇదే చెబుతున్నాయి కానీ అది అబద్ధం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజస్థాన్ గవర్నర్ హరిభావు బగాడే. ఉదయపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. అక్బర్ నామాలో జోధా, అక్బర్ వివాహం గురించి ప్రస్తావించలేదని పేర్కొన్నారు.

అవును... అక్బర్ కు సంబంధించిన చరిత్రలోని ఒక అంశంపై రాజస్థాన్ గవర్నర్ బగాడే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... జోధా బాయి - అక్బర్ ల వివాహతో పాటు పలు ఉదంతాలు భారతదేశ చరిత్రలో తప్పులుగా నమోదయ్యాయని.. దానికి బ్రిటిష్ చరిత్రకారుల ప్రాభవం కారణం అని అన్నారు. ఈ సందర్భంగా 1569నాటి ఓ అంశంపై చర్చను లేవనెత్తారు!

ఇందులో భాగంగా... అప్పట్లో భర్మల్ అనే రాజు ఉండేవాడని.. అతను తన పనిమనిషి కుమార్తెను అక్బర్ కు ఇచ్చి వివాహం చేయించాడని హరిభావూ పేర్కొన్నారు. దీంతోనే 1569లో అమెర్ పాలకుడు భర్మల్ కుమార్తె, అక్బర్ మధ్య జరిగిన వివాహానికి సంబంధించిన చారిత్రక కథనంపై చర్చ తిరిగి మొదలైందని అంటున్నారు!

ఈ సందర్భంగా బ్రిటీష్ చరిత్రకారులను తప్పుబట్టిన ఆయన... వారే మన దేశానికి చెందిన వీరుల చరిత్రను మార్చివేశారని.. కొంతమంది భారతీయ రచయితలు బ్రిటీష్ వారికి ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. ఇదే సమయంలో.. అక్బర్ కు సంధిని కోరుతూ రాజ్ పుత్ పాలకుడు మహారాణా ప్రతాప్ లేఖరాశాడనే చారిత్రక వాదనను ఆయన ఖండించారు.

అసలు మహారాణా ప్రతాప్ తన ఆత్మగౌరవం విషయంలో ఎప్పుడూ రాజీపడలేదని.. అబ్కర్ తో సంధిని కోరారనే ప్రచారం పూర్తిగా తప్పుదారి పట్టించేదని అన్నారు. చరిత్రలో అక్బర్ గురించి అధిక సమాచారం ఉంది కానీ, మహారాణా ప్రతాప్ గురించి తక్కువగా ఉందని అన్నారు. అయితే.. పరిస్థితి ఇప్పుడు మెరుగుపడుతోందని గవర్నర్ తెలిపారు.

ఈ క్రమంలో.. కొత్త జాతీయ విద్యా విధానంలో మన సంస్కృతిని, అద్భుతమైన చరిత్రను కాపాడుకుంటూ భవిష్యత్ సవాళ్లకు కొత్త తరాన్ని సిద్ధం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా... మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశభక్తికి చిహ్నాలు అని గవర్నర్ బగాడే కొనియాడారు.

వారిద్దరి జననాల మధ్య 90 ఏళ్ల అంతరం ఉందని.. వారు సమకాలీనులైతే దేశ చిత్ర మరోరకంగా ఉండేదని.. ఇద్దరినీ ధైర్యం, దేశభక్తి యొక్క ఒకే దృక్పథంగా చుస్తారని చెప్పిన గవర్నర్... మహారాష్ట్రలోని శంభాజీనగర్ లో మహారాణా ప్రతాప్ గౌరవార్థం ఆయన గుర్రపు స్వారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.