కంపెనీల వింత రూల్స్.. రెండేళ్ల కంపెనీలో ఐదేళ్ల ఎక్స్ పీరియన్స్ అంట.. రెడ్డిట్ యూజర్ షాకింగ్ పోస్ట్!
ఈ రెడ్డిట్ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు కూడా ఇలాంటి అనుభవాలే తమకు ఎదురయ్యాయని కామెంట్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 26 May 2025 11:09 PM ISTఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కంపెనీల నుంచి ఎదురవుతున్న వింత డిమాండ్లు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇలాంటి ఒక సంఘటనను ఒక రెడ్డిట్ యూజర్ పంచుకున్నారు. కేవలం రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం అప్లై చేసుకుంటే, ఐదేళ్ల ఎక్స్ పీరియన్స్ కావాలని చెప్పి తనను రిజెక్ట్ చేశారట. ఈ సంఘటనను వ్యంగ్యంగా వివరిస్తూ.. "మీకు కొత్తగా పుట్టిన కంపెనీలో ఎక్స్ పీరియన్స్ ఉన్న వ్యక్తి కావాలా... అనుభవం ఉన్న వ్యక్తి కూడా కావాలా?" అని రాసుకొచ్చారు. ఉద్యోగాల పేరిట కంపెనీలు అసాధ్యమైన నైపుణ్యాలను డిమాండ్ చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా మంది నిరుద్యోగుల ఆవేదనకు అద్దం పడుతోంది.
ఈ రెడ్డిట్ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు కూడా ఇలాంటి అనుభవాలే తమకు ఎదురయ్యాయని కామెంట్ చేస్తున్నారు. కంపెనీలు కొన్నిసార్లు చాలా విచిత్రమైన డిమాండ్లను పెడుతున్నాయని, అవి అసాధ్యంగా ఉన్నాయని వాపోతున్నారు.కొన్ని కంపెనీలు కొత్తగా వచ్చిన టెక్నాలజీలపై ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం అడుగుతున్నాయి. అయితే, ఆ టెక్నాలజీ వచ్చి రెండేళ్లే అయితే అంత అనుభవం ఎలా ఉంటుందని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా పెద్ద పెద్ద కంపెనీల్లో పని చేసిన అనుభవం, లేదా చాలా ఎక్కువ టెక్నికల్ స్కిల్స్ ఉండాలని అడుగుతున్నారని, ఇది ఫ్రెషర్లకు, తక్కువ అనుభవం ఉన్నవారికి చాలా కష్టంగా మారిందని చెబుతున్నారు. ఇలాంటి డిమాండ్ల వల్ల ఉద్యోగాలు దొరకడం చాలా కష్టంగా మారిందని, నిరుద్యోగుల్లో నిరాశ పెరుగుతోందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ రెడ్డిట్ యూజర్ చెప్పినట్లుగా, కంపెనీలు తమ అవసరాల పేరుతో అభ్యర్థుల నుంచి అసాధ్యమైన నైపుణ్యాలను ఆశిస్తున్నాయని, ఇది ఒక రకంగా యువతతో ఆడుకుంటున్నట్లే అనిపిస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో పోటీ ఎక్కువగా ఉండడం, ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడం కూడా కంపెనీలు ఇలాంటి అదనపు డిమాండ్లను పెట్టడానికి కారణం కావచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే, ఇది ఉద్యోగం దొరకకుండా మరింత కష్టతరం చేస్తుందని, సమర్థులైన అభ్యర్థులు కూడా అవకాశాలు కోల్పోయేలా చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగుల ఎంపిక ప్రక్రియలో కంపెనీలు మరింత రియలస్టిక్ గా ఉండాలని లేదా కనీసం తమ కంపెనీ వయసు, టెక్నాలజీ ఏజ్ కు తగ్గ అనుభవాన్ని కోరాలని కోరుతున్నారు.
