తుర్కియే వర్సిటీతో డీల్ రద్దు చేసుకున్న జేఎన్ యూ!
తాజాగా తుర్కియేలోని ఇనొను విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న ఎంవోయూను నిలిపివేస్తున్నట్లుగా ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జేఎన్ యూ (జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం) తాజాగా ప్రకటించింది.
By: Tupaki Desk | 15 May 2025 11:00 AM ISTఆపరేషన్ సిందూర్ వేళ.. పాకిస్తాన్ కు బాహాటంగా మద్దతు పలికి.. వారికి సాయం చేసే అంశంలో భారత్ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా వ్యవహరించిన తుర్కియే (టర్కీ) మీద భారతీయుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎవరికి వారు తుర్కియే ఉత్పత్తుల్ని స్వచ్ఛందంగా బాయ కాట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని వారు తమ సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించటంతో.. ఈ ప్రచారం అంతకంతకూ విస్త్రతం కావటమే కాదు.. చివరకు ప్రతిష్ఠాత్మక సంస్థలు సైతం అదే బాటలో నడుస్తున్నాయి.
తాజాగా తుర్కియేలోని ఇనొను విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న ఎంవోయూను నిలిపివేస్తున్నట్లుగా ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జేఎన్ యూ (జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం) తాజాగా ప్రకటించింది. భారత - తుర్కియే దేశాల మధ్య ఇటీవల మూడేళ్ల కాల వ్యవధికి చెందిన విద్యాపరమైన ఒప్పందాలు జరిగాయి. తాజా పరిణామాల నేపథ్యంలో వాటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా జేఎన్ యూ వెల్లడిచింది. దేశ భద్రత ద్రష్ట్యా ఇనొను వర్సిటీతో కుదుర్చుకున్న ఎంవోయూను తాము నిలిపివేసినట్లుగా చెబుతున్నారు.
గతంలో చేసుకున్న ఒప్పందంలో భాగంగా అధ్యాపకులు.. విద్యార్థుల మార్పిడికి సంబంధించిన ప్రణాళికలు ఉన్నాయి. వాటన్నింటిని తక్షణం నిలిపి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తుర్కియేలోని మలట్యాలో ఇనొను విశ్వవిద్యాలయం ఉంది. విభిన్న సాంస్క్రతిక పరిశోధనలు.. విద్యార్థుల సామర్థ్యాల్ని పెంచేలా జేఎస్ యూ - ఇనొను వర్సిటీ మధ్య ఎంవోయూ కుదురింది. తాజా పరిణామాలను చూస్తే.. రానున్న రోజుల్లో ఆ దేశంతో భారత వాణిజ్య సంబంధాలు పూర్తిగా తగ్గే అవకాశం ఉందంటున్నారు. ప్రజలే కాదు.. భారత ప్రభుత్వం కూడా తుర్కియే కు వ్యతిరేకంగా జట్టు కట్టే వ్యూహాల్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.