Begin typing your search above and press return to search.

రాముడు మాంసాహారే.. కాక రేపుతున్న ఎన్సీపీ నేత వ్యాఖ్యలు!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత డాక్టర్‌ జితేంద్ర అవద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   4 Jan 2024 9:59 AM GMT
రాముడు మాంసాహారే.. కాక రేపుతున్న ఎన్సీపీ నేత వ్యాఖ్యలు!
X

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత డాక్టర్‌ జితేంద్ర అవద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు శాఖాహారి కాదని మాంసాహారి అని హాట్‌ కామెంట్స్‌ చేశారు. మహారాష్ట్రలోని షిర్డీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) నేత డాక్టర్‌ జితేంద్ర అవద్‌ మాట్లాడుతూ శ్రీరాముడు శాకాహారి కాదని, మాంసాహారేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్ల పాటు అడవిలో వనవాసం ఉన్న వ్యక్తి (శ్రీరాముడు) శాకాహారం కోసం ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. ఇది నిజమో కాదో ప్రజలే గ్రహించాలని కోరారు.

14 సంవత్సరాలు అడవిలో నివసించిన వ్యక్తి మాంసాహారం తినకుండా.. శాకాహారమే ఎలా తినగలిగాడని జితేంద్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామ మందిరం ప్రారంభించనున్న జనవరి 22ను డ్రై డేగా, మాంసాహార నిషేధ దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు.. బాలాసాహెబ్‌ ఠాక్రే జీవించి ఉంటే, శివసేనకు చెందిన సామ్నా వార్తాపత్రిక ’రామ్‌ మాంసాహారం’ అంశంపై విమర్శనా వ్యాసాలు రాసేదని బీజేపీ ఎమ్మెల్యే రామ్‌ కదమ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ లో ట్వీట్‌ చేశారు.

కాగా.. రాముడు శాకాహారి కాదన్న అవద్‌ వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, వెంటనే ఉపసంహరించుకోవాలని పలువురు నిరసనలు చేస్తున్నారు.

తన వ్యాఖ్యలు వివాదం రేపడంతో జితేంద్ర అవద్‌ స్పందించారు. రాముడు ఏమి తిన్నాడనే విషయంపై వివాదం ఎందుకున్న ఆయన.. రాముడు క్షత్రియుడు. కాబట్టి క్షత్రియులు మాంసాహారులు. వారు తప్పకుండా నాన్‌ వెజ్‌ ను తింటారని తెలిపారు. అంతే కాకుండా తన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. దేశ జనాభాలో 80% మంది మాంసాహారులు, వారు కూడా రామభక్తులేనని జితేంద్ర తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం గమనార్హం.

అలాగే దేశ స్వాతంత్య్రం గురించి కూడా ప్రస్తావించిన జితేంద్ర అవ«ద్‌ ఎవరెన్ని చెప్పినా గాంధీ, నెహ్రూల కారణంగానే మనకు స్వాతంత్య్రం వచ్చిందని తేల్చిచెప్పారు. మహాత్మాగాంధీ ఒక ఓబీసీ అనే విషయాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) వారు గుర్తుంచుకోవాలన్నారు. గాంధీజీ హత్యకు అసలు కారణం కులతత్వమేనని జితేంద్ర బాంబుపేల్చారు.