మాజీ సీఎం మనవరాలిని కాల్చిచంపారు
సుష్మా దేవికి రమేష్‌తో 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి పిల్లలు కూడా ఉన్నారు. కొంతకాలంగా వారిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 10 April 2025 10:39 AM ISTబీహార్ మాజీ ముఖ్యమంత్రి , ప్రస్తుత కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ మనవరాలు దారుణ హత్యకు గురయ్యారు. 32 ఏళ్ల సుష్మా దేవిని ఆమె భర్త రమేష్ గృహ కలహాల కారణంగా కాల్చి చంపాడు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గయా జిల్లాలోని టెటువా గ్రామంలో జరిగింది.
సుష్మా దేవికి రమేష్‌తో 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి పిల్లలు కూడా ఉన్నారు. కొంతకాలంగా వారిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం రమేష్ సుష్మా ఇంటికి వచ్చి గొడవపడ్డాడు. తీవ్ర వాగ్వాదం జరుగుతుండగా రమేష్ కోపోద్రిక్తుడై నాటు తుపాకీతో సుష్మాను కాల్చాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సుష్మా అక్కడికక్కడే మృతి చెందింది.
సుష్మా తన పిల్లలను తీసుకొని భర్తకు దూరంగా తన సోదరి పూనం కుమారితో కలిసి నివసిస్తోంది. ఘటన జరిగిన సమయంలో పూనం కూడా ఇంట్లోనే ఉంది. తుపాకీ శబ్దం విన్న వెంటనే పిల్లలు భయంతో కేకలు వేశారు. అనంతరం పూనం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నిందితుడు రమేష్ కాల్పులు జరిపిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. అతడిని పట్టుకునేందుకు గయా పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్‌ఎస్‌పి ఆనంద్ కుమార్ తెలిపారు. తన సోదరిని చంపిన రమేష్‌కు కఠినమైన శిక్ష పడాలని, అతనికి మరణశిక్ష విధించాలని పూనం డిమాండ్ చేసింది.
సుష్మా దేవి గ్రామ అభివృద్ధి కార్యకర్త (వికాస్ మిత్ర)గా పనిచేస్తుండగా రమేష్ ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దంపతుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు పూనం అక్కడికి వచ్చిందని సమాచారం. ప్రస్తుతం కేంద్ర సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) శాఖ మంత్రిగా ఉన్న జీతన్ రామ్ మాంఝీ ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
