పసిపిల్లలపై ఇంత క్రూరత్వమా? గురువే రాక్షసుడిగా మారితే పిల్లల భవిష్యత్తు ఎక్కడ?
"ఒకవేళ ఇదే మా పిల్లలకు జరిగి ఉంటే మేము ఊరుకునేవాళ్లమా?", "పిల్లలను కాపాడాల్సిన విద్యాసంస్థల అధిపతులే ఇలా రాక్షసుల్లా మారితే ఇక ఎవరిని నమ్మాలి?" అంటూ నెటిజన్లు అధికారులను నిలదీస్తున్నారు.
By: A.N.Kumar | 14 Jun 2026 1:34 AM ISTపాఠశాల అంటే పిల్లలకు రెండో ఇల్లు. తల్లిదండ్రుల తర్వాత చిన్నారులు ఎక్కువ సమయం గడిపేది.. ఎన్నో విషయాలు నేర్చుకునేది గురువుల దగ్గరే. అందుకే మన సంస్కృతిలో గురువును దైవంతో సమానంగా భావిస్తారు. కానీ సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఆ గురువే చిన్నారులపై క్రూరంగా ప్రవర్తిస్తే? రక్షించాల్సిన చేతులే భక్షకులుగా మారితే ఆ పిల్లల పరిస్థితి ఏమిటి? ఊహించుకోవడానికే గుండె తరుక్కుపోయే ఇలాంటి ఒక అమానుష ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ప్లే స్కూల్‌లో అమానవీయ ఘటన
జార్ఖండ్‌లోని జప్లా ప్రాంతంలో ఉన్న "లక్ష్మి శిశు వాటిక ప్లే స్కూల్" లో చోటుచేసుకున్న ఘోరం విద్యా వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉంది. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ శశికేష్ కశ్యప్ అమాయక చిన్నారులపై అమానుషంగా దాడి చేశాడు. ఇంకా సరిగా మాట్లాడటం కూడా రాని కనీసం తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఇంట్లో చెప్పుకోలేని పసిపిల్లలను ఆయన చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అవి చూసిన ప్రతి తల్లిదండ్రుల హృదయం కలచివేస్తోంది.
ప్రేమగా చెప్పాల్సింది పోయి.. పశువుల్లా కొడతారా?
పిల్లలు తప్పులు చేయడం సహజం. ముఖ్యంగా ప్లే స్కూల్ వయసులో ఉన్న పిల్లలు అల్లరి చేయడం, సరిగ్గా వినకపోవడం, విషయాలను అర్థం చేసుకోలేకపోవడం చాలా సాధారణం. అలాంటి సమయంలో వారికి ఓపికగా, ప్రేమగా చెప్పాలి. ఆటపాటలతో మంచి బుద్ధులు నేర్పాలి. అంతేకాని పసిపిల్లలపై శారీరక హింసకు పాల్పడటం, వారిని భయభ్రాంతులకు గురిచేయడం ఎలాంటి పరిస్థితుల్లోనూ సమర్థించదగిన విషయం కాదు. ఇది ముమ్మాటికీ మానవత్వానికే మచ్చ.
సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ఆగ్రహం
"ఒకవేళ ఇదే మా పిల్లలకు జరిగి ఉంటే మేము ఊరుకునేవాళ్లమా?", "పిల్లలను కాపాడాల్సిన విద్యాసంస్థల అధిపతులే ఇలా రాక్షసుల్లా మారితే ఇక ఎవరిని నమ్మాలి?" అంటూ నెటిజన్లు అధికారులను నిలదీస్తున్నారు.
చర్యలు శూన్యం.. నెటిజన్ల ఆవేదన
ఈ దారుణ ఘటనపై బాధితుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ నిందితుడిపై ఇప్పటివరకు కఠినమైన చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. చట్టం ఇంత మందకొడిగా వ్యవహరించడం వల్లే ఇలాంటి నరరూప రాక్షసులకు ధైర్యం పెరుగుతోందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పిల్లల మనసులపై జీవితాంతం పడే మచ్చ
చిన్నారుల మనసులు చాలా సున్నితమైనవి. చిన్న వయసులో వారు ఎదుర్కొనే ఇటువంటి హింస, వారి శరీరానికే కాదు.. వారి మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సమాజం పట్ల, పాఠశాలల పట్ల వారిలో జీవితాంతం ఒక తెలియని భయం, మచ్చగా మిగిలిపోతుంది.
అందుకే ఈ ఘటనపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించాలి. బాధ్యుడైన ప్రిన్సిపాల్‌పై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపాలి. అలాగే భవిష్యత్తులో ఏ ప్లే స్కూల్‌లోనూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాఖ గట్టి నిఘా పెట్టాలి.
పిల్లలపై ప్రేమ చూపించాల్సిన చోట హింస ప్రదర్శించడాన్ని ఈ సమాజం ఎప్పటికీ అంగీకరించదు. పసిపిల్లల కన్నీళ్లు, వారి భయం, వారి అనుభవించిన బాధకు న్యాయం జరిగే వరకు.. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష పడేవరకు ప్రతి ఒక్కరి మనసులో ఈ ప్రశ్న మారుమోగుతూనే ఉంటుంది. "అసలు ఆ పసిపిల్లలను అంతలా కొట్టడం ఎంతవరకు న్యాయం?" అని ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు.
