ఓటుకు నోటు కేసు.. A4 జెరూసలేం మత్తయ్య సంచలన వ్యాఖ్యలు
గురువారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన మత్తయ్య ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లే తాను ఈ కేసులో ఇరుక్కున్నానని ఆరోపించారు.
By: Tupaki Desk | 25 Sept 2025 1:36 PM ISTఓటుకు నోటు కేసులో A4 నిందితుడు జెరూసలేం మత్తయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన మత్తయ్య ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లే తాను ఈ కేసులో ఇరుక్కున్నానని ఆరోపించారు. రూ.5 కోట్లకు రూ.50 లక్షలు కమీషన్ వస్తుందన్న ఆశతోనే తాను ఆ రోజు వెళ్లాలని, ఇప్పుడు కోర్టు ఖర్చులు కూడా వారి దగ్గర నుంచి తెచ్చుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తొమ్మిదేళ్లుగా కోర్టులు చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపాడు.
నిజానికి ఈ కేసులో తాను అప్పట్లోనే ఏసీబీ ముందు లొంగిపోవాలని భావించానని, అయితే రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి తనకు ఫోన్ చేసి లొంగిపోవద్దని చెప్పారని తెలిపారు. తాను ఆ రోజు లొంగిపోతే రేవంత్ రెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని, దానివల్ల ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతుందని గీతారెడ్డి చెప్పారని, అదే జరిగితే రేవంత్ రెడ్డి ఏసీబీ ఆఫీసులోనే ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించారని మత్తయ్య ఆరోపించారు.
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు జెరూసలెం మత్తయ్య కూడా నిందితుడుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మత్తయ్య ఆరోపణలు తీవ్ర సంచలనంగా చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఈ కేసు విషయమై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మత్తయ్య లేఖ రాశాడు. అప్పట్లో ఏం జరిగిందో తాను పూర్తిగా చెప్పేస్తానని అందులో పేర్కొన్నాడు. ఈ పరిస్థితుల్లో నిందితుడు మత్తయ్య వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
తొమ్మిదేళ్ల క్రితం నాటి ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఈ కేసుతో సంబంధం ఉన్నవారంతా ప్రస్తుతం మంచి పదవుల్లో ఉన్నారని చెబుతున్న మత్తయ్య.. తాను మాత్రం ఆర్థికంగా చితికిపోయానని, తన కుటుంబం తీవ్రక్షోభ అనుభవిస్తోందని వాపోతున్నాడు. కేసులో ఇరుక్కున్న తనకు సహచర నిందితుల నుంచి ఏ ఆసరా లభించడం లేదని ఆయన మాటల్లో కనిపిస్తోందని అంటున్నారు.
అదే సమయంలో సుప్రీంకోర్టులో ఉన్న కేసును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉపసహంరించుకుంటుందని ఆశించినట్లు మత్తయ్య గతంలో తెలిపాడు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసును యథాతథంగా కొనసాగిస్తుండటంతో ఏం జరుగుతుందోననే టెన్షన్ నిందితుల్లో కనిపిస్తోందని చెబుతున్నారు. చివరికి ఎవరు ఈ కేసులో బలైపోతారనే ఆలోచన కూడా కొందరికి నిద్రపట్టనీయడం లేదని అంటున్నారు. ఈ కారణంగానే మత్తయ్యతో ఎవరో వెనకుండి మాట్లాడిస్తున్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
