Begin typing your search above and press return to search.

ఒక్క రోజులోనే రూ.3 లక్షల కోట్ల సంపద పెరుగుదల.. జెన్సన్ హువాంగ్‌కు జాక్‌పాట్ ఎలా తగిలింది?

ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ తిరిగి నియమితులైన వార్తతో కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి. నవంబర్ 23న షేరు ధర 31.48 శాతం పెరిగి 165.05 డాలర్లకు చేరడంతో, ఆయన సంపద ఒక్కరోజులో 33.7 బిలియన్ డాలర్లు పెరిగి మొత్తం 143.8 బిలియన్ డాలర్లకు చేరింది. ఏఐ చిప్స్‌కు పెరుగుతున్న డిమాండ్ ఎన్విడియా వృద్ధికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.

By:  A.N.Kumar   |   24 Nov 2026 11:50 PM IST
ఒక్క రోజులోనే రూ.3 లక్షల కోట్ల సంపద పెరుగుదల.. జెన్సన్ హువాంగ్‌కు జాక్‌పాట్ ఎలా తగిలింది?
X

మనం నెలంతా కష్టపడితే వచ్చే జీతం అకౌంట్‌లో పడకముందే ఖర్చుల లిస్ట్ సిద్ధమైపోతుంది. కానీ ఎన్విడియా బాస్ జెన్సన్ హువాంగ్ పరిస్థితి వేరు. ఆయన పొద్దున్నే లేచి తన ఫేవరెట్ బ్లాక్ లెదర్ జాకెట్ వేసుకుని ఆఫీసుకి వెళ్లేలోపే ఆయన సంపదలో అక్షరాలా రూ.3 లక్షల కోట్లు అమెరికన్ కరెన్సీలో చెప్పాలంటే 33.7 బిలియన్ డాలర్లు వచ్చి చేరింది. అవును.. మీరు చదివింది నిజమే సుమీ.. అలా నోరెళ్లబెట్టకండీ.. ఈగలు దూరుతాయి.. మన దేశంలో కొన్ని రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువే ఈయన ఒక్కరోజు సంపాదన.. ఆ లెవల్ వ్యక్తి ఎఫైర్లతో ఉద్యోగం కోల్పోయి మళ్లీ కంపెనీకి సీఈవోగా వచ్చేసరికి సంపద అలా వచ్చిపడింది. ఆయన మేధస్సు, క్రేజ్ కు ఇది నిదర్శనం..కొన్ని విషయాల్లో రాంగ్ అయినా.. సంస్థ , సీఈవోగా జెన్సాన్ లెవల్ వేరే లెవల్ అని అర్థమవుతుంది.

సాధారణంగా ఆఫీసుల్లో బాస్ మారితే ఉద్యోగులు టెన్షన్ పడతారు. కానీ ఎన్విడియాలో మాత్రం సీన్ రివర్స్ అయింది. నవంబర్ 23న కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశమై ‘మాకు నువ్వే సీఈఓగా కావాలి బాసూ’ అంటూ హువాంగ్‌ను తిరిగి నియమిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అంతే ఆ వార్త విన్న స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఒక్కసారిగా పూనకాలు వచ్చేశాయి. సోమవారం మార్కెట్ ముగిసేసరికి ఎన్విడియా షేరు ధర ఏకంగా 31.48 శాతం ఎగబాకి 165.05 డాలర్లకు చేరింది. 2003 తర్వాత ఈ స్థాయిలో షేరు పెరగడం ఇదే మొదటిసారి. ఈ దెబ్బకు కంపెనీ మార్కెట్ విలువకు అదనంగా 952 బిలియన్ డాలర్లు వచ్చి చేరాయి.

ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. ఈ రూ.3 లక్షల కోట్లు హువాంగ్ గూగుల్ పే లేదా బ్యాంక్ అకౌంట్‌లో టంగ్‌మని పడిపోలేదు. అంతా కంపెనీలో ఆయనకున్న షేర్ల విలువ పెరగడం వల్ల వచ్చిన పేపర్ వెల్త్ అన్నమాట. ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో ఈ దెబ్బతో ఆయన 143.8 బిలియన్ డాలర్లతో 13వ స్థానానికి దూసుకెళ్లారు. అయితే స్టాక్ మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. రేపు షేరు కాస్త తుమ్మితే ఈ సంపదలో కొన్ని వేల కోట్లు గాల్లో కలిసిపోయే ఛాన్స్ కూడా ఉంది.

ఈ సంపద వెనుక అసలు సీక్రెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ . గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా లాంటి దిగ్గజ కంపెనీలన్నీ ఏఐ రేసులో గెలవడానికి కోట్లు కుమ్మరిస్తున్నాయి. ఆ కంపెనీలకు కావాల్సిన అసలైన ఆయుధాలు జీపీయూ చిప్స్ తయారు చేసేది మాత్రం హువాంగ్ కంపెనీ ఎన్విడియానే.

1993లో కేవలం వీడియో గేమ్స్ ఆడుకునే కుర్రాళ్ల కోసం గ్రాఫిక్స్ చిప్స్ తయారు చేయడానికి మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు ప్రపంచ ఏఐ రంగానికే బాస్ అయిపోయింది. గేమింగ్ చిప్స్‌నే ఏఐ సూపర్ కంప్యూటింగ్‌కు వాడొచ్చని హువాంగ్ ముందే పసిగట్టడం ఆయనకు కలిసొచ్చింది.

ప్రస్తుతం ఏఐ చిప్స్ మార్కెట్‌లో ఎన్విడియాకు తిరుగులేదు. కానీ టెక్ ప్రపంచంలో ఎప్పుడూ ఒకరే రాజుగా ఉండరు కదా.. మిగతా టెక్ దిగ్గజాలు కూడా సొంత చిప్స్ తయారు చేసుకునే పనిలో పడ్డాయి. అవి కనుక మార్కెట్‌లోకి వస్తే హువాంగ్ ఏకఛత్రాధిపత్యానికి కాస్త బ్రేక్ పడొచ్చు. ఏదేమైనా ప్రస్తుతానికి మాత్రం ఏఐ అనే బంగారు బాతు ఎన్విడియా ఇంట బంగారు గుడ్లు పెడుతూనే ఉంది..