ఎప్ స్టీన్ ఫైల్స్ : కొడుకు కోసం ‘ఇజ్రాయెల్ చేతిలో ట్రంప్ కాంప్రమైజ్ ?
ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ట్రంప్ వ్యాపార సామ్రాజ్యంపైనే కాకుండా ఆయన అధ్యక్ష పాలనలోనూ అత్యధిక ప్రభావం చూపారని ఈ నివేదికలు చెబుతున్నాయి.
By: A.N.Kumar | 1 Feb 2026 4:03 PM ISTఅమెరికా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న 'జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్' వ్యవహారం ఇప్పుడు భారతీయ వార్తా మాధ్యమాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్‌లకు సంబంధించి ఎఫ్‌బీఐ నివేదికలో వెల్లడైన అంశాలు సంచలనం రేపుతున్నాయి.
అమెరికా న్యాయ శాఖ (డీఓజే) ఇటీవల విడుదల చేసిన 30 లక్షలకు పైగా పేజీల పత్రాలు.. వేల సంఖ్యలో వీడియోలు.. లక్షలాది ఫోటోలలో డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. ఈ పత్రాల ప్రకారం ట్రంప్, ఆయన సన్నిహితులపై ఎఫ్‌బీఐ నివేదికల్లో కొన్ని తీవ్రమైన అంశాలను ప్రస్తావించారు.
ఇజ్రాయెల్ చేతిలో ట్రంప్ కాంప్రమైజ్: ఎఫ్‌బీఐ నివేదికలో ఏముంది?
ఎఫ్‌బీఐ రూపొందించిన ఒక నివేదికలో "నమ్మదగిన వ్యక్తి సీక్రెట్ ఏజెంట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ చేతిలో "కాంప్రమైజ్" అయ్యి ప్రలోభాలకు లేదా ఒత్తిళ్లకు లోనయ్యారని అయ్యారని ఆరోపించారు. ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వెనుక విదేశీ శక్తుల ప్రభావం ఉందనే కోణంలో ఈ ఆరోపణలు ఉన్నాయి.
జారెడ్ కుష్నర్ ప్రభావం.. ఆర్థిక లావాదేవీలు
ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ట్రంప్ వ్యాపార సామ్రాజ్యంపైనే కాకుండా ఆయన అధ్యక్ష పాలనలోనూ అత్యధిక ప్రభావం చూపారని ఈ నివేదికలు చెబుతున్నాయి. కుష్నర్ రష్యాకు చెందిన పెట్టుబడుల విషయంలో పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపారని, కొన్ని ప్రయోజనాలను వెల్లడించలేదని ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ 'కేడర్'లో కుష్నర్ వాటాలపై కూడా అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆర్థిక నేరాల్లో దోషిగా తేలిన కుష్నర్ తండ్రికి ట్రంప్ తన అధ్యక్ష హోదాలో క్షమాభిక్ష ప్రసాదించిన విషయాన్ని కూడా ఈ ఫైల్స్ గుర్తు చేస్తున్నాయి.
ట్రంప్ రియల్ ఎస్టేట్ డీల్స్.. 'రెడ్ ఫ్లాగ్స్'
బేవర్లీ హిల్స్‌లో ట్రంప్‌కు సంబంధించిన ఒక ఆస్తి లావాదేవీపై ఎఫ్‌బీఐ దృష్టి సారించింది. దాదాపు 41 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ఒక భవనాన్ని కేవలం కొద్ది కాలంలోనే విదేశీ సంబంధాలున్న ఒక షెల్ కంపెనీకి 95 మిలియన్ డాలర్లకు విక్రయించడంపై అధికారులు "రెడ్ ఫ్లాగ్స్" అనుమానాస్పద గుర్తులు ఉన్నాయని పేర్కొన్నారు.
అలన్ డెర్షోవిట్జ్.. మొసాద్ లింకులు
ఎప్స్టీన్ తరపు న్యాయవాది అలన్ డెర్షోవిట్జ్‌ను ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ ప్రభావితం చేసిందని, ఆయన తన ప్రతిష్ఠను ఉపయోగించి రాజకీయంగా బలమైన వ్యక్తులను ప్రభావితం చేసేవారని సీహెచ్ఎస్ ఆరోపించింది. ఎప్స్టీన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శక్తివంతమైన రాజకీయ వర్గాలను ప్రభావితం చేయడానికి ఒత్తిడి సాధనం గా ఉపయోగపడ్డాడని నివేదిక పేర్కొంది.
న్యాయ శాఖ.. ట్రంప్ స్పందన
ఈ పత్రాల్లో ఉన్నవన్నీ నిజాలు కావని కొన్ని అవాస్తవ ఆరోపణలు కూడా ఉండవచ్చని అమెరికా న్యాయ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా 2020 ఎన్నికలకు ముందు ట్రంప్‌కు వ్యతిరేకంగా వచ్చిన కొన్ని ఫిర్యాదులు కూడా ఈ పత్రాల్లో ఉన్నాయి.
ట్రంప్ దీనిపై వివరణ ఇచ్చాడు. 1990ల కాలంలో ఎప్స్టీన్‌తో సామాజికంగా పరిచయం ఉన్నప్పటికీ ఆయన నేరాల గురించి తనకు తెలియదని.. ఎప్పుడో ఆయనతో సంబంధాలు తెంచుకున్నానని ట్రంప్ గతంలోనే స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ట్రంప్‌పై ఎటువంటి అధికారిక నేరారోపణలు నమోదు కాలేదు.
ఈ తాజా వెల్లడితో అమెరికా ఎన్నికల ముంగిట రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఎప్స్టీన్ కేసులో ఇంకా ఎందరో ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
