Begin typing your search above and press return to search.

ప్రపంచ కుబేరుడి పెళ్లి వేడుక కష్టాలు మామూలుగా లేవుగా?

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్.. జర్నలిస్టు లారెన్ శాంచెజ్ లు పెళ్లి చేసుకోవటానికి సిద్ధం కావటం తెలిసిందే. ఈ పెళ్లికి వేదికగా వెనిస్ నగరాన్ని ఎంచుకున్నారు.

By:  Tupaki Desk   |   26 Jun 2025 10:29 AM IST
ప్రపంచ కుబేరుడి పెళ్లి వేడుక కష్టాలు మామూలుగా లేవుగా?
X

దేశం ఏదైనా పర్యాటకులు తమ దేశానికి వస్తే.. రండి.. రండి అంటూ ఆత్మీయంగా ఆహ్వానిస్తారు. ప్రభుత్వం సైతం ఉత్సాహంగా మరిన్ని ఏర్పాట్లు చేస్తుంటుంది. అదే సమయంలో ప్రపంచలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరు.. ప్రపంచ కుబేరుడిగా హోదాను పలుమార్లు అనుభవించిన అమెజాన్ అధినేత పెళ్లి చేసుకోవటానికి ఫలానా ప్లేస్ డిసైడ్ చేసుకున్నామన్న ప్రకటనతో సదరు స్థానిక ప్రభుత్వం.. ప్రజలు ఆనందానికి గురవుతారు. అయితే.. అందుకు భిన్నమైన పరిస్థితులు ప్రపంచంలోనే అత్యంత సుందర నగరాల్లో ఒకటైన వెనిస్ లో భిన్నంగా ఉన్నాయి.

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్.. జర్నలిస్టు లారెన్ శాంచెజ్ లు పెళ్లి చేసుకోవటానికి సిద్ధం కావటం తెలిసిందే. ఈ పెళ్లికి వేదికగా వెనిస్ నగరాన్ని ఎంచుకున్నారు. ఈ పెళ్లికి వేదికగా తమ నగరాన్ని ఎంచుకోవటంపై వెనిస్ వాసులు మండిపడుతున్నారు. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఖర్చు పెట్టే సంపన్నుల నుంచి అత్యధిక పన్నులు వసూలు చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. దీంతో అమెజాన్ అధినేత పెళ్లి వేడుకను సురక్షిత ప్రాంతానికి మార్చినట్లుగా చెబుతున్నారు.

అమెజాన్ అధినేత పెళ్లి కారణంగా.. మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున సెలబ్రిటీలు.. ప్రముఖులు వెనిస్ నగరాన్ని పోటెత్తనున్నారు. దీనిపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘నో స్పేస్ ఫర్ బెజోస్’ పేరుతో ఆందోళనలు చేపట్టారు. సెంట్రల్ వెనిస్ లోని పలు పర్యాటక ప్రదేశాల్ని దిగ్భందించాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. వెనిస్ నగరంలోని పలుచోట్ల బెజోస్ ఫోటోలతో కూడిన భారీ బ్యానర్లు ఏర్పాటు చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే వెనిస్ నగర మేయర్ మాత్రం ఈ ప్రపంచ కుబేరుడి పెళ్లిపై సానుకూలంగా స్పందించారు. స్థానికంగా ఎంతో వ్యాపారం జరుగుతుందని.. అతిథ్యం.. రవాణా రంగాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. వేడుకకు సరఫరా చేసే వస్తువుల్లో 80 శాతం స్థానిక విక్రేతల నుంచి తీసుకుంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. కేవలం 200 మంది మాత్రమే హాజరు కానున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.

దీనికి భిన్నంగా వెనిస్ వాసుల వాదన ఉంది. ఈ ప్రముఖుడి పెళ్లి కారణంగా తాము పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. అతడి కోసం తమ స్వేచ్ఛను ఎందుకు కోల్పోవాలన్నది వెనిస్ వాసుల వాదన. ఇక.. బెజోస్ విషయానికి వస్తే ఆయన జర్నలిస్టుగా పని చేసే 54 ఏళ్ల లారెన్ శాంచెజ్ తో 2018 నుంచి డేటింగ్ చేస్తున్నారు. తన కన్నా ఏడేళ్లు చిన్నదైన ఆమెతో జరిపిన వ్యవహారం 2019 వరకు బయటకు రాలేదు. అదే ఏడాది ఆయన తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. గత ఏడాది ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఆయన తాజాగా పెళ్లికి సిద్ధమయ్యారు.