పెళ్లికి ముందే పార్ట్నర్ తో డీల్!
ప్రపంచ కుబేరులలో ఒకరైన అమెజాన్ అధిపతి జఫ్ బెజోస్ తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో ఇటలీలోని వెనిస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.
By: Tupaki Desk | 28 Jun 2025 4:45 PM ISTప్రపంచ కుబేరులలో ఒకరైన అమెజాన్ అధిపతి జఫ్ బెజోస్ తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో ఇటలీలోని వెనిస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వివాహ వేడుకల కంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన విషయం చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే పెళ్లికి ముందే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేసుకున్న ఒక "డీల్" ఆసక్తిరేపుతోంది.
-విడాకులపై ముందస్తు ఒప్పందం?
గతంలో జెఫ్ బెజోస్ తన మొదటి భార్య మ్యాకెంజీ స్కాట్‌తో విడాకులు తీసుకున్నప్పుడు, ఆమెకు ఇచ్చిన సెటిల్‌మెంట్ మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దాదాపు 38 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని మ్యాకెంజీకి చెల్లించడంతో ఆమె ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలిగా నిలిచారు.
ఈ అనుభవాల నేపథ్యంలో బెజోస్ ఈసారి మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. లారెన్ శాంచెజ్‌తో పెళ్లికి ముందే విడాకుల సందర్భంలో ఆస్తి పంపకంపై ఒక "ప్రెనప్ డీల్" (వివాహ పూర్వ ఒప్పందం) చేసుకున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ఒప్పందంలో విడాకులు వస్తే ఎలాంటి ఆస్తులు ఎవరి పేరుమీద ఉండాలి, ఎవరికి ఎంత భరణం ఇవ్వాలి వంటి వివరాలను స్పష్టంగా పొందుపరిచినట్లు సమాచారం.
ఈ డీల్ ఎందుకు ముఖ్యం?
ప్రపంచస్థాయి వ్యాపారవేత్తలే కాకుండా, సినీ తారలు కూడా ఇప్పుడు పెళ్లికి ముందే ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కొంతమంది విడాకుల తర్వాత భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముందే ఈ రకమైన లీగల్ ఒప్పందాలతో జాగ్రత్త పడుతున్నారు.బెజోస్ విషయంలో ఇది రెండో వివాహం కావడంతో, గత అనుభవాన్ని బట్టి ఈసారి అన్ని విషయాల్లో ముందే స్పష్టత తెచ్చుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జఫ్ బెజోస్, లారెన్ శాంచెజ్ వివాహం వెనుక ప్రేమ కథ ఎంత బలంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తును ముందుగానే ఊహించి తీసుకున్న ఈ జాగ్రత్తలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. ఇది ప్రస్తుతం ప్రముఖుల వివాహాల్లో ఒక సాధారణ ప్రక్రియగా మారిందని నిపుణులు అంటున్నారు. ఇటలీలో ఘనంగా జరిగిన ఈ వివాహానికి ఇలా ఒక లీగల్ డీల్ కూడా జత కావడంతో, ఈ పెళ్లి నిజంగానే వార్తల్లో నిలుస్తోంది!
