Begin typing your search above and press return to search.

కర్ణాటకలో అనూహ్య పరిణామం!

వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లోనూ గెలిచి మరోసారి కేంద్రంలో అధికారాన్ని సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ఉంది.

By:  Tupaki Desk   |   8 Sep 2023 10:38 AM GMT
కర్ణాటకలో అనూహ్య పరిణామం!
X

వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లోనూ గెలిచి మరోసారి కేంద్రంలో అధికారాన్ని సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ఉంది. ఇప్పటికే ప్రతిపక్షాల ఇండియా కూటమికి పోటీగా బీజేపీ తన నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పక్షాల సమావేశం కూడా నిర్వహించింది. మరోవైపు కొన్ని పార్టీలు ఏ కూటమిలోనూ చేరలేదు. వీటిలో కర్ణాటకలోని జనతాదళ్‌ సెక్యులర్‌ (జేడీఎస్‌) కూడా ఒకటి.

ఈ ఏడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసిన జేడీఎస్‌ గట్టి దెబ్బతింది. పార్టీకి కంచుకోటలైన మాండ్యా, పాత మైసూర్, హసన్‌ జిల్లాల్లోనూ తీవ్ర ఎదురుదెబ్బలు తప్పలేదు. 224 స్థానాలకు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 19 స్థానాలకే జేడీఎస్‌ పరిమితమైంది. గత ఎన్నికలతో పోలిస్తే మరో 18 స్థానాలను పోగొట్టుకుంది.

ఈ నేపథ్యంలో జేడీఎస్‌ ను పట్టించుకునేవారే కరువయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయడానికి జేడీఎస్‌ అంగీకరించడం కర్ణాటక రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేసేందుకు జేడీఎస్‌ అంగీకరించినట్లు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత బీఎస్‌ యడియూరప్ప వెల్లడించారు. లోక్‌ సభ ఎన్నికల్లో ఎవరెన్నీ సీట్లలో పోటీ చేయాలనే అంశంలోనూ అవగాహన కుదిరిందన్నారు.

బీజేపీ, జేడీఎస్‌ వచ్చే లోక్‌ సభ ఎన్నికల కోసం అవగాహనకు వచ్చాయని యడియూరప్ప తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో జేడీఎస్‌కు నాలుగు సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అగ్రనేత అమిత్‌ షా అంగీకరించారని వెల్లడించారు. ఇది తమకెంతో బలాన్ని ఇవ్వడంతోపాటు రాష్ట్రంలో 25–26 స్థానాల్లో గెలుపొందేందుకు దోహదపడుతుంది అని యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు.

కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జేడీఎస్, బీజేపీలు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అసెంబ్లీలోనూ పలు అంశాల్లో ఏకాభిప్రాయంతో వెళ్తున్నాయనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. విపక్ష నేతగా కుమారస్వామి ఎన్నికయ్యేలా ఉందే..? అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలనూ బీజేపీ నేతలు ఖండించకపోవడం గమనార్హం. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తుకు ఇదే నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

మరోవైపు జేడీఎస్‌ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని దేవగౌడ్‌ మాత్రం వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో జేడీఎస్‌ ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పడం విశేషం. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కాస్తో కూస్తో ఆశలు ఉన్నది దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో మాత్రమే. ఎందుకంటే కర్ణాటక మినహాయించి దక్షిణ భారతదేశంలో ఎక్కడా ఆ పార్టీ బలంగా లేదు.

కర్ణాటకలో 28 లోక్‌ సభ స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటిలో అత్యధిక స్థానాలు కొల్లగొట్టాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. కనీసం 20 స్థానాలైనా దక్కించుకోవాలంటే జేడీఎస్‌ తో పొత్తు కావాలని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జేడీఎస్‌ తో కలిసి వెళ్లడానికి బీజేపీ ఆసక్తి చూపిస్తోంది.

మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో జేడీఎస్‌ కనీసం ఆరుచోట్ల నేరుగా ప్రభావితం చూపుతుందని అంచనాలున్నాయి. మధ్య కర్ణాటకలోని హసన్, మాండ్యా, మైసూరు, తుమకూరు, కోలార్, చామరాజనగర, బెంగళూరు గ్రామీణలో జేడీఎస్‌ ప్రభావం ఉందని చెబుతున్నారు. రాష్ట్రంలోని మిగిలిన లోక్‌ సభ స్థానాల్లోనూ ఒక్కలిగ ఓట్లను చీల్చే సత్తా జేడీఎస్‌ కు ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీతో పొత్తు తమకు లాభిస్తుందని బీజేపీ లెక్కలేసుకుంటోంది.