Begin typing your search above and press return to search.

బ్యూరోక్రటిక్ పాలిటిక్స్.. జేడీ పార్టీ మరో జేపీ పార్టీ అవుతుందా?

లోక్ సత్తా వ్యవస్థాపకుడు జేపీ ఇప్పుడొక రాజకీయ విశ్లేషకుడిగా మిగిలారు. మేధావి మన్ననలు అందుకున్న ఆయన ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ నాయకుల ఇంటర్వ్యూలు చేస్తూ కనిపించారు.

By:  Tupaki Desk   |   24 Dec 2023 9:30 AM GMT
బ్యూరోక్రటిక్ పాలిటిక్స్.. జేడీ పార్టీ మరో జేపీ పార్టీ అవుతుందా?
X

భారత దేశంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చు.. రాజకీయాలు ఫలానావారే చేయాలని ఏం లేదు.. అందులోనూ బాగా చదువుకున్న వారు ఈ రంగంలోకి వస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. అవినీతి, అక్రమాలకు అవకాశం తక్కువగా ఉంటుంది. పాలనా వ్యవస్థపై పట్టున్నవారు కావడంతో ఏం చేస్తే ఎలా చేస్తో మేలు జరుగుతుందో తెలుస్తుంది.

బ్యూరోక్రటిక్ పార్టీలు నిలుస్తాయా?

తెలుగు రాష్ట్రాల్లో 20 ఏళ్ల కిందటనే సంచలనం రేపిన పార్టీ లోక్ సత్తా. మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ (జేపీ) స్థాపించిన ఈ పార్టీకి మొదట్లో విద్యావంతుల నుంచి ఆదరణ కూడా బాగానే దక్కింది. అయితే, డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా గెలుస్తామనే లోక్ సత్తా ఆదర్శాలు ఆచరణలోకి రాలేదు. ఎన్నికలకు వచ్చేసరికి ఆ పార్టీ కూడా ఇతర పార్టీల్లాగే మారిపోయింది. దీనికితోడు జేపీ ప్రసంగాలు సగటు గ్రామీణ వ్యక్తులకు అర్థం కాలేదు. దీంతో లోక్ సత్తా ఒక బ్యూరోక్రటిక్ పార్టీగా మిగిలిపోయింది. ఇప్పుడు లోక్ సత్తా కేవలం ఒక స్వచ్ఛంద సంస్థ, లేదా ప్రజా సంఘం పాత్రకు పరిమితమైపోయింది.

మరి జేడీ సంగతేమిటి..?

లోక్ సత్తా వ్యవస్థాపకుడు జేపీ ఇప్పుడొక రాజకీయ విశ్లేషకుడిగా మిగిలారు. మేధావి మన్ననలు అందుకున్న ఆయన ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ నాయకుల ఇంటర్వ్యూలు చేస్తూ కనిపించారు. ప్రభుత్వాల ఉచిత పథకాలను విమర్శించడం, ఉద్యోగుల పింఛను పథకంపై తన అభిప్రాయాలు వ్యక్తం చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక లోక్ సత్తా రాజకీయాలను ఆయన పూర్తిగా వదిలేసినట్లే అని స్పష్టమవుతోంది. మరి ఇదే సమయంలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ (జేడీ) లక్ష్మీనారాయణ కూడా జేపీ తరహాలో రాజకీయ పార్టీని స్థాపించారు. శుక్రవారం దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. వాస్తవానికి జేడీ లక్ష్మీనారాయణగా ఆయన అందరికీ తెలిసినా.. పూర్తి పేరు వీవీ లక్ష్మీనారాయణ. అయితే, సీబీఐ జేడీగా పనిచేసినందున జేడీ ఆయన పేరుముందు స్థిరపడిపోయింది.

సామాన్యులకు చేరే విధివిధానాలు ముఖ్యం

జేడీ అయినా జేపీ అయినా.. ఇద్దరూ ఉన్నత స్థాయి బ్యూరోక్రాట్లే. సొంతంగా పార్టీలు పెట్టిన వీరిద్దరూ సామాన్య ప్రజలను చేరుకోవడం చాలా కీలకం. జేపీ పార్టీ స్థాపించినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా తేడా ఉన్నాయి. 25 ఏళ్ల కిందట లోక్ సత్తా వచ్చినప్పుడు ఇన్ని ఉచిత పథకాలు లేవు. అప్పట్లో కాంగ్రెస్ ఉచిత విద్యుత్తు హామీని అందరూ అసాధ్యం అన్నారు. ఇప్పుడు చూస్తే కొన్ని వర్గాల వారికి అన్నీ ఉచితమే అన్నట్లుంది పరిస్థితి. ఉచితాలు వద్దంటే ప్రజల మద్దతు దక్కదు..? ఉచితాలు కావాలంటే మధ్య తరగతి, ఉద్యోగ వర్గాలు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది. మరి జేడీలాంటి వ్యక్తి దీనిని ఎలా చూస్తారు? అనేది కీలకం.

జనంలో కలవాలి.. ఉర్రూతలూగించాలి..

అధికార సాధనే పార్టీ లక్ష్యం కాబట్టి దానిని అందుకోవాలంటే తీవ్రంగానే శ్రమించాల్సి ఉంటుంది. జనంలో కలవాలి.. ప్రసంగాలతో వారిని ఉర్రూతలూగించాలి.. దీనికోసం బ్యూరోక్రటిక్ తాలూకు స్వభావాలను వదిలించుకోవాలి. అలాగైతేనే ప్రజాదరణను భారీగా పొందే అవకాశం ఉంటుంది. శుక్రవారం నాడు పార్టీ వ్యవస్థాపనా ప్రకటన సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ ప్రసంగం ఫర్వాలేదనే స్థాయిలో ఉంది. అయితే, ఏపీకి ప్రత్యేక హొదా అనే అంశమే కీలకమైతే మరి ఇన్నాళ్లూ ఏం చేశారనే ప్రశ్న తలెత్తుతోంది. అన్నిటికి మించి రాజకీయాల్లో ఎదురుదాడి ముఖ్యం. మాటకు మాట అనేలా ఉంటేనే ప్రజలు నాయకుల వెంట ర్యాలీ అవుతారు. అందులోనూ ఏపీ వంటి ప్రత్యేక పరిస్థితులున్న రాష్ట్రంలో ఇది మరీ కీలకం.

కొసమెరుపు: జేడీ దాదాపు పదేళ్లు లోక్ సత్తాను నడిపి 2009లో కూకట్ పల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సమైక్యవాదిగా పేరున్న ఆయన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు జేడీ వంతు వచ్చింది. గత ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి జన సేన తరఫున పోటీ చేసిన ఆయన చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఓట్లు తెచ్చుకున్నారు. అదే పార్టీలో కొనసాగితే ఎలా ఉండేదో కానీ.. ఎన్నికలు అయిన వెంటనే జన సేనకు గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఏపీలో రాజకీయం టీడీపీ-జనసేన వర్సెస్ వైసీపీ అన్న తీరున ఉంది. ఇందులో జేడీ ఎంతవరకు నెగ్గుతారో చూడాలి.