Begin typing your search above and press return to search.

జేడీ లక్ష్మీనారాయణ... ఆ నాలుగు పార్టీలు....!

గత ఎన్నికల్లో పోటీ చేస్తే విశాఖ వాసులు గొప్పగా ఆదరించారు అని ఆయన అన్నారు.

By:  Tupaki Desk   |   19 Nov 2023 2:05 AM GMT
జేడీ లక్ష్మీనారాయణ... ఆ నాలుగు పార్టీలు....!
X

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు, చేస్తే ఎంపీగానా లేక ఎమ్మెల్యేగానా ఇక ఏ పార్టీ నుంచి పోటీలో ఉంటారు ఇలాంటి ప్రశ్నలు అయితే చాలానే ఉన్నాయి. రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వారికి ఇది చాలా పెద్ద చర్చగా కూడా ఉంది.

దీనిలో సగం డౌట్ ని మాత్రమే జేడీ లక్ష్మీనారాయణ తీర్చారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే ఎంపీగా మళ్ళీ పోటీ చేస్తాను అని చెప్పారు. గత ఎన్నికల్లో పోటీ చేస్తే విశాఖ వాసులు గొప్పగా ఆదరించారు అని ఆయన అన్నారు.

కాబట్టి ఈసారి కూడా విశాఖనే తన రాజకీయ కార్యక్షేత్రంగా ఎంచుకుంటున్నట్లుగా చెప్పారు. అలా విశాఖ నుంచి పోటీ అది కూడా ఎంపీగానే అంటూ జేడీ అయితే క్లారిటీ ఇచ్చేశారు. మరి ఏ పార్టీ నుంచి అన్నది మాత్రం ఆయన చెప్పలేదు.

పైగా తనకు ఏ రాజకీయ పార్టీ నుంచి ఇప్పటిదాకా ఆహ్వానం అందలేదని కూడా అంటున్నారు. కేవలం సోషల్ మీడియాలో ప్రచారమే తప్ప తాను ఏ రాజకీయ పార్టీలోనూ లేను ఈ రోజుకీ చేరలేదు అని కూడా ఆయన అంటున్నారు.

ఇదిలా ఉంటే జేడీకి ఏ రాజకీయ పార్టీ నుంచి ఎందుకు ఆహ్వానం అందలేదు అన్నది మాత్రం పెద్ద చర్చగానే ఉంది. జేడీ మాజీ ఐపీఎస్ అధికారి, సమాజంలో తనకంటూ ఒక ఇమేజ్ ఉన్న వారు. బలమైన సామాజికవర్గానికి చెందిన వారు. మేధావులు యువత విద్యావంతులు ఆయన అంటే ఇష్టపడతరు.

అలంటి జేడీని ఎంపీగా పోటీ చేయమని తమ పార్టీలో చేరమని ఎవరూ ఇంతవరకూ ఆహ్వానించలేదా అన్నదే సందేహంగా ఉంది. జేడీ వైసీపీలో చేరుతున్నారని ఆ మధ్య దాకా ప్రచారం సాగింది. అయితే దాన్ని జేడీ ఖండించారు. ఇక జేడీ టీడీపీ నుంచి పోటీ చేస్తారు అని కూడా ఒక దశలో చర్చ సాగింది.

అదే విధంగా జనసేన నుంచి 2019 ఎన్నికల్లో పోటె చేసి మంచి ఓట్లు సాధించిన జేడీ ఈసారి మళ్లీ అదే పార్టీ నుంచి పోటీకి దిగుతారు అని కూడా అనుకున్నారు. కానీ అది కూడా నిజం కాదు అని అంటున్నారు. బీజేపీ నుంచి జేడీ పోటీ చేస్తారు అంటే అక్కడ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎంపీ జీవీల్ నరసింహారావు వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి.

ఇలా జేడీ చేరే పార్టీ ఏది అన్నది మాత్రం ఎంతకూ తెగని ప్రశ్నగానే ఉంది. ఒక దశలో అయితే ఆయన బీయారెస్ నుంచి కూడా పోటీ చేస్తారు అని టాక్ వచ్చింది. అయితే జేడీ అనేది ఏంటి అంటే నేను నా ఆలోచనా విధానంతోనే ముందుకు వెళ్తున్నాను అని. అదే విధంగా ఏ పార్టీ అయినా ప్రజలను ఒప్పించగలిగినపుడే గెలుస్తుంది అని మరో మాట కూడా అన్నారు.

ప్రజల అభిప్రాయాలను గౌరవించి అమలు చేసే ప్రభుత్వాలు రావాలని ఆయన కోరుకున్నారు. అదే విధంగా తమ సొంత ఆలోచనలు ప్రజల మీద రుద్దే పార్టీలు వద్దు అని అంటున్నారు. ఇలా తనకంటూ కొన్ని భావాలు ఉన్న జేడీ ప్రస్తుతం ఉన్న ఏ పార్టీ సిద్ధాంతాన్ని అంగీకరిస్తారో కూడా తెలియదు. మొత్తానికి చూస్తే జేడీ ఎంపీగా విశాఖ నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఇండిపెండెంట్ గా చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.