Begin typing your search above and press return to search.

విశాఖ ఉత్తరం ఫిక్స్ చేసిన మాజీ జేడీ... గత లెక్కలివే!

ఈ క్రమంలో.. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓటమిపాలైన ఆయన... అనంతర పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీకే రాజీనామా చేశారు.

By:  Tupaki Desk   |   15 March 2024 5:21 AM GMT
విశాఖ ఉత్తరం ఫిక్స్  చేసిన మాజీ జేడీ... గత లెక్కలివే!
X

రాజకీయాల్లోకి రాకముందు నుంచీ ఆ సర్కిల్స్ లో లక్ష్మీనారాయణ పేరు ఫుల్ ఫేమస్ అనే సంగతి తెలిసిందే. ఇక రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ తాను నమ్ముకున్న సిద్ధాంతాల మేరకు తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. ఈ క్రమంలో.. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓటమిపాలైన ఆయన... అనంతర పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీకే రాజీనామా చేశారు. అనంతరం సొంతంగా “జై భారత్ నేషనల్” పార్టీని స్థాపించారు.

ప్రస్తుతం ఆయన తన సొంతపార్టీ "జై భారత్ నేషనల్ పార్టీ" నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఈ క్రమంలో జై భారత్ నేషనల్ పార్టీకి ఎన్నికల సంఘం టార్చ్ లైట్ గుర్తును కేటాయించింది. దీంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. తన పార్టీకి కామన్ సింబల్ గుర్తును కేటాయించినందుకు ఎన్నికల కమిషన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమయంలోనే... వచ్చే ఎన్నికల్లో టార్చ్ లైట్ వెలిగిస్తాం.. చీకటిని తరిమేస్తాం అని మాజీ జేడీ తెలిపారు.

ఇదే క్రమంలో... ఇద్దరు రాజుల మధ్య ఓ సామాన్యుడి పోరాటం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసేది వెల్లడించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఇందులో భాగంగా రానున్న ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆ నియోజకవర్గంలో సరికొత్త సమీకరణలు తెరపైకి వస్తున్నాయి.

ఎంవీపీ కాలనీలోని సెక్టార్ - 10లో ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా... రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం కోసమే యునైటెడ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేశామన్నారు.

ఆ సంగతి అలా ఉంటే... విశాఖ ఉత్తరం నియోజకవర్గాన్ని కూటమిలో భాగంగా బీజేపీకి కేటాయించినట్లు తెలుస్తుంది. అక్కడ నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేయనున్నారని అంటున్నారు. ఈయన బీజేపీ నుంచి 2014లో గెలవగా.. 2019 ఎన్నికల్లో నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. దీంతో ఈసారి విశాఖ ఉత్తరంలో రసవత్తర పోరు కన్ ఫాం అని అంటున్నారు పరిశీలకులు.

మరోపక్క గత ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా విశాఖ లోక్ సభ స్థానానికి పోటీ చేసిన లక్ష్మీనారాయణకు 2.88లక్షల ఓట్లు పోలవ్వగా.. మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఇక ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి పురందేశ్వరికి కేవలం 2.73శాతం ఓట్లు మాత్రమే పోలవ్వడం గమనార్హం.