Begin typing your search above and press return to search.

రాజకీయాల్లో బాండ్ పేపర్స్.. మాజీ జేడీ అసక్తికర వ్యాఖ్యలు!

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

By:  Tupaki Desk   |   22 Dec 2023 2:30 PM GMT
రాజకీయాల్లో బాండ్  పేపర్స్.. మాజీ జేడీ  అసక్తికర వ్యాఖ్యలు!
X

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. రాజకీయ వర్గాల్లో ఆయన సుపరిచితుడే! ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గురువారం అర్ధరాత్రి ఆలోచన చేశారు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారగా.. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.

అవును... విజయవాడలో గురువారం (డిసెంబర్ 21) రాత్రి ఐలాపురం కన్వెన్షన్ హాలులో "అర్ధరాత్రి ఆలోచన" అనే కార్యక్రమాన్ని మాజీ జేడీ లక్ష్మీనారాయణ నిర్వహించారు. ఇందులో భాగంగా... ప్రజా సంఘాలు, రైతులు, వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో ఆయన రాత్రంతా చర్చలు జరిపారు! ఈ సందర్భంగా స్పందించిన ఆయన... అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చిన దేశంలో ప్రధాన సంఘటనలన్నీ అర్ధరాత్రే జరిగాయని గుర్తు చేసారు.

ఇదే సమయంలో దేశ ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చిన అతిముఖ్యమైన జీఎస్టీ చట్టం కూడా రాత్రే రిజల్యూషన్ పాసయ్యింది. నోట్ల రద్దు నిర్ణయం కూడా రాత్రి పూటే ప్రకటించబడిందని జేడీ తెలిపారు. పైగా ఉదయం పూట అందరూ బిజీగా ఉంటారు కాబట్టి... అర్ధరాత్రి మేల్కొని సమస్యలు తెలుసుకుంటున్నాని తెలిపారు‌. ప్రధానంగా తాను పలు విషయాలు, సమస్యల గురించి తెలుసుకోవడానికే ఈ మీటింగ్ అని అన్నారు.

అనంతరం మాట్లాడిన ఆయన... ధన, కుల, వంశ పారంపర్య రాజకీయాలకు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. ఇది జరగాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని అన్నారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో పోటీ చేసిన శిరీష అనే బర్రెలక్కకు తాను అందుకే మద్దతు పలికినట్లు తెలిపారు. ఆ ఎన్నికల్లో ఆమెకు 5 వేలకు పైగా ఓట్లు పోలవ్వడం నిజంగా శుభసూచకం అని లక్ష్మీనారాయణ అన్నారు.

ఇక ప్రధానంగా మేనిఫెస్టోలను రాజకీయ పార్టీలు చేయడం కాదని, ప్రజలే మేనిఫెస్టోలను తయారుచేయాలని.. అనంతరం ఓట్ల కోసం వచ్చిన నాయకులకు వాటిని ఇచ్చి, అమలు చేసేందుకు హామీ తీసుకోవాలని లక్ష్మీనారాయణ సూచించారు. ఈ క్రమంలో... తాను విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు తాను గెలిస్తే చేయబోయే పనులపై బాండ్ పేపర్ రాసిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రాజకీయ నాయకులందరూ ఇచ్చిన హామీలకు ఇలాగే బాండ్ పేపర్ రాసివ్వాలని ఆయన కోరారు.