Begin typing your search above and press return to search.

భారతీయ సంప్రదాయ దుస్తుల్లో జేడీ వాన్స్ పిల్లలు.. వైరల్ వీడియో

ఈ సందర్భంగా పాలెం ఎయిర్‌పోర్ట్‌లో వాన్స్ కుటుంబం వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

By:  Tupaki Desk   |   21 April 2025 11:14 AM IST
JD Vance And family In Indian Tradition
X

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం భారతదేశానికి చేరుకున్నారు. దిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియాలో ఆయనకు, ఆయన కుటుంబానికి ఘన స్వాగతం లభించింది. వాన్స్‌తో పాటు ఆయన సతీమణి ఉషా వాన్స్, ముగ్గురు పిల్లలు.. ఉన్నతస్థాయి అమెరికా ప్రతినిధుల బృందం కూడా భారత్ పర్యటనకు వచ్చారు.

ఈ సందర్భంగా పాలెం ఎయిర్‌పోర్ట్‌లో వాన్స్ కుటుంబం వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వాన్స్ ఇద్దరు కుమారులు భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కుర్తా, పైజామా ధరించి కనిపించగా, వారి కుమార్తె లాంగ్ గౌనులో మెరిశారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో వాన్స్ పిల్లలు అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో వాన్స్‌కు భారత సైనిక దళాల గౌరవ వందనం లభించింది.

అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జేడీ వాన్స్ భారత్ పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో వాన్స్‌ దంపతులు, అమెరికా ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. అనంతరం ప్రధాని మోదీ, ఉపాధ్యక్షుడు వాన్స్ మధ్య అధికారిక చర్చలు జరగనున్నాయి.

ఈ చర్చల్లో వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రత, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. వాణిజ్య ఒప్పంద ప్రతిపాదనతో పాటు ట్రంప్ హయాంలో అనుసరించిన టారిఫ్ విధానాలు, ప్రస్తుతం అమెరికా అనుసరిస్తున్న కఠిన వలస విధానాల వల్ల భారతీయ విద్యార్థులు, పౌరులు ఎదుర్కొంటున్న సవాళ్లపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

ప్రధాని మోదీతో భేటీ, విందు అనంతరం సోమవారం రాత్రే వాన్స్‌ దంపతులు జయపురకు బయలుదేరి వెళ్తారు. అక్కడ రాంబాగ్ ప్యాలెస్ హోటల్‌లో బస చేస్తారు. మంగళవారం ఉదయం వారు అంబర్‌ కోటతో సహా పలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం రాజస్థాన్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో వాన్స్ ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో ట్రంప్‌ హయాంలో భారత్, అమెరికా సంబంధాల విస్తృతిపై మాట్లాడతారని తెలుస్తోంది.

ఏప్రిల్ 23న వాన్స్ కుటుంబం ఆగ్రాకు ప్రయాణమై తాజ్‌ మహల్‌ను, భారతీయ కళలను ప్రదర్శించే శిల్పాగ్రామ్‌ను సందర్శిస్తారు. అదేరోజు మధ్యాహ్నం తిరిగి జయపురకు చేరుకుంటారు. ఏప్రిల్ 24న జయపుర నుంచి వారు అమెరికాకు తిరిగి ప్రయాణమవుతారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాల దృష్ట్యా ప్రాధాన్యత సంతరించుకుంది.