Begin typing your search above and press return to search.

కొత్త జాబ్ లోకి జేడీ... పాలిటిక్స్ కి గుడ్ బై ?

జేడీ లక్ష్మీ నారాయణ అంటే అందరికీ తెలుస్తుంది. ఆయన ఇంటి పేరు వీవీ.కానీ సీబీఐ లో జేడీ స్థాయిలో పనిచేశారు.

By:  Satya P   |   16 Feb 2026 9:14 AM IST
కొత్త జాబ్ లోకి జేడీ... పాలిటిక్స్ కి గుడ్ బై ?
X

జేడీ లక్ష్మీ నారాయణ అంటే అందరికీ తెలుస్తుంది. ఆయన ఇంటి పేరు వీవీ.కానీ సీబీఐ లో జేడీ స్థాయిలో పనిచేశారు. దాంతో అదే ఇంటిపేరుగా మారిపోయింది. రాజకీయాల మీద ఆసక్తితో ఆయన 2018లో స్వచ్చందంగా పదవీ విరణమ చేసి బయటకు వచ్చారు. 2019లో ఆయన విశాఖ నుంచి లోక్ సభకు ఎంపీగా జనసేన తరఫున పోటీ చేశారు. దాదాపుగా 2 లక్షల 75 వేల దాకా ఓట్లు సాధించారు. అయితే జేడీ ఓటమి చెందిన తరువాత జనసేనను వదిలేశారు. ఇక 2024 ఎన్నికల్లో ఆయన జై భారత్ పార్టీని స్థాపించి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. ఇక్కడా ఓటమి చెందారు. ఆ తరువాత ఆయన జై భారత్ పార్టీ గురించి పెద్దగా మాట్లాడింది లేదు. ఇక రాజకీయ విశ్లేషకుడిగా కొన్నాళ్ళ పాటు కనిపించిన ఆయన సడెన్ గా కీలక నిర్ణయం తీసుకున్నారు.

కీలక బాధ్యతల్లోకి :

ఇదిలా ఉంటే జేడీ తాజాగా కొత్త జాబ్ లోకి చేరారు ఆయన మేఘా ఇంజనీరింగ్ కంపెనీ అనుబంధ సంస్థ అయిన ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రకటించడం విశేషం. జేడీ విషయానికి వస్తే ట్రాన్స్ పోర్టు ఫీల్డ్ లో ఆయన గతంలో కూడా పనిచేశారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ డిగ్రీ పొందిన జేడీ ఆ తర్వాత ఎంటెక్ చదివారు. ఇక ఆయన ఐపీఎస్ అధికారిగా ఉదొయగంలోకి చేరడానికి ముందు అశోక లేల్యాండ్‌లో పనిచేశారని అంటున్నారు. ఇపుడు కూడా ఆయన అదే ఫీల్డ్ లోకి వచ్చారు. అలా ఆయన ఈవీ ట్రాన్స్‌లో చేరారని చెబుతున్నారు.

అప్పట్లో స్టార్ ఇమేజ్ :

జేడీ లక్ష్మీ నారాయణ పేరు 2012 ప్రాంతంలో తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఆయన జగన్ అరెస్టు చేయడం ఆయన కేసులను దర్యాప్తు చేయడంతో ఒక స్టార్ ఇమేజ్ నే సొంతం చేసుకున్నారు. అంతే కాదు అత్యున్నత స్థాయి కేసులను టేకప్ చేయడం ద్వారా జేడీ అగ్రశ్రేణి ఆఫీసర్ గా ఉంటూ వచ్చారు. ఇక ఆయన మహారాష్ట్ర క్యాడర్ కి చెందిన ఐపీఎస్ అధికారి. అంతే కాదు ఆయన అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ గా ఉంటూ స్వచ్చంద పదవీ విరమణ నిర్ణయం

భారీ సంస్థలోకి :

ఇక చూస్తే జేడీ ఒక భారీ సంస్థలో చేరడం ద్వారా సరికొత్త జీవితానికి తెర తీశారా అన్న చర్చ వస్తుంది. ఆయన చేరిన ఈవీట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కి ఒక అనుబంధ సంస్థగా ఉంది. ఇది ప్రాముఖ్యత కలిగిన సంస్థ అందులో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నత హోదాలోకి జేడీ వెళ్ళారని చెప్పాల్సి ఉంది.జేడీకి ఈ ఫీల్డ్ లో అపారమైన అనుభవం ఉంది. మరీ ముఖ్యంగా కమర్షియల్ వెహికల్ సిస్టమ్ మీద ఆయనకు ఎంతో అవగాహన ఉంది అని అంటారు. అలాగే, మాన్యుఫ్యాక్చరింగ్ ఎన్విరాన్మెంట్స్ మీద ఆయనకు విశేషమైన అనుభవం ఉందని అంటున్నారు.

సంస్థ ట్రాక్ రికార్డు :

ఇక చూస్తే కనుక ఈవీట్రాన్స్ సంస్థ ఎలక్ట్రిక్ బస్సుల తయారీని పెద్ద ఎత్తున చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు జేడీ వంటి సీనియర్ అనుభవం కలిగిన వారి అండ దొరికింది అని అంటున్నారు. అందుకే ఆయనకు ఉన్నత స్థానం ఇచ్చి తమ సంస్థలోకి ఆహ్వానించింది అని అంటున్నారు. దేశంలో పేరున్న ఈ సంస్థ తెలంగాణ ఆర్టీసీలో నడుస్తున్న ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులను సైతం రూపొందించింది అని అంటున్నారు. అంతే కాదు, ముంబై, పుణే, గోవా తదితర ప్రాంతాల్లో ఈ సంస్థ తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులే ఉన్నాయని చెబుతున్నారు. ఈ రోజున ఈవీ ట్రాన్స్ సంస్థ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్‌గా ఉందని అందులో జేడీ చేరడం కీలకమైన అంశమని చెబుతున్నారు.

రాజకీయాలు సంగతేంటి :

ఇదిలా ఉంటే జేడీ కీలక బాధ్యతల్లోకి వెళ్ళారు. దాంతో ఆయన రాజకీయాల గురించి మళ్ళీ ఆలోచిస్తారా అన్న చర్చ సాగుతోంది. నిజానికి చూస్తే నిజాయితీపరుడిగా జేడీకి ఎంతో పేరు ఉంది. అలాగే యువతకు ఒక స్పూర్తిగా ఆయన ఉన్నారు. కానీ వర్తమాన రాజకీయాల్లో జేడీ లాంటి వారు ఇమడలేకపోతున్నారు. దాంతోనే ఆయన ఈ దిశగా తన ఆలోచనలు మార్చుకున్నారా అన్న చర్చ వస్తోంది. చూడాలి మరి 2029 ఎన్నికల నాటికి ఆయన రాజకీయ తెర మీద కనిపిస్తారో లేదో అన్నది.