Begin typing your search above and press return to search.

జగన్ పార్టీలోకి పిలిచినా జేసీ బ్రదర్స్ ఎందుకు వెళ్లలేదు?

ప్రశ్నల కు సమాధానం ఇప్పటివరకు తెలీదు. ఆ విషయాల్ని తాజాగా చేసిన ఇంటర్వ్యూలో ప్రభాకర్ రెడ్డి చెప్పేశారు.

By:  Tupaki Desk   |   1 Aug 2023 12:30 AM GMT
జగన్ పార్టీలోకి పిలిచినా జేసీ బ్రదర్స్ ఎందుకు వెళ్లలేదు?
X

ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయటం.. ఓపెన్ గా మాట్లాడేయటం.. వెనుకా ముందు చూసుకోకుండా బోల్డ్ స్టేట్ మెంట్లు ఇచ్చే విషయం లో టీడీపీ నేత.. తాడిపత్రి మున్సిపాల్టీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డికి అలవాటు. ఆయన మాటలు సినిమాటిక్ గా అనిపించినా.. ఇంత వయసులోనూ ఇలా మాట్లాడటం ఆయనకే సాధ్యమన్నట్లుగా తీరు ఉంటుందని చెప్పాలి. తాజాగా ఆయన ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన బోలెడన్ని విషయాల్ని చెప్పుకొచ్చారు. దశాబ్దాల తరబడి బలమైన రాజకీయ కుటుంబంగా ఉన్న నేపథ్యంలో ఆయన వద్ద ఆసక్తికర అంశాలకు కొదవ ఉండదు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన జేసీ ఫ్యామిలీ.. విభజన నేపథ్యంలో టీడీపీ లోకి వచ్చేయటం తెలిసిందే. తండ్రి మరణించిన తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యం లో కాంగ్రెస్ నుంచి బయట కు వచ్చేసి వైసీపీ ని పెట్టిన జగన్.. ఆ తర్వాత కాంగ్రెస్ కు చెందిన పలువురు నేతలు ఆ పార్టీలోకి వెళ్లటం తెలిసిందే. అలాంటది జేసీ బ్రదర్స్ లో పెద్దవాడైన దివాకర్ రెడ్డి కొడుకు పవన్.. జగన్ కు అత్యంత సన్నిహిత స్నేహితుడిగా పేరుంది. మరి.. అలాంటప్పుడు జేసీ బ్రదర్స్ ను పార్టీలోకి రమ్మని చెప్పలేదా? ఎందుకు పార్టీలోకి వెళ్లలేదు? అన్న ప్రశ్నల కు సమాధానం ఇప్పటివరకు తెలీదు. ఆ విషయాల్ని తాజాగా చేసిన ఇంటర్వ్యూలో ప్రభాకర్ రెడ్డి చెప్పేశారు.

జగన్ పార్టీ పెట్టిన తర్వాత చాలాసార్లు పిలిచినా ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నకు బదులిచ్చిన ప్రభాకర్ రెడ్డి.. "ఒక రోజు కుటుంబం మొత్తం జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో ఏదో ఫంక్షన్‌లో ఉంటే మా అన్న ఇంటికి రమ్మని ఫోన్‌ చేశారు. ఎందుకని అడిగితే విజయసాయిరెడ్డి వస్తున్నారని చెప్పారు. ఇంటికి వెళ్లాక నోరెత్తకూడదు.. నోరెత్తకూడదని అనుకుంటూనే వచ్చాను. అయితే అక్కడ అంతా మాట్లాడిన తర్వాత.. ఎంత ఖర్చు పెట్టగలర ని విజయసాయి ఒక మాట అన్నారు. దాంతో మా అన్నకు తీవ్రమైన కోపం వచ్చేసింది.

ఆయన పై చెడామడా అరిచేశారు. నేను మనసు లో హ్యాపీ ఫీలయ్యా" అని చెప్పారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టుకోమన్నారా? సీటుకు డబ్బులు ఇవ్వమన్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. 'డబ్బులు ఖర్చు పెట్టి.. ఎంత ఇవ్వగలరు? అన్నట్లుగా మాట్లాడారు. దాంతో అన్నకు కోపం వచ్చేసింది. కమాండ్ చేస్తే ఎవడికీ లొంగేది లేదు. ప్రేమతో అడిగితే ఎక్కడిదాకా అయినా పోతాం' అని చెప్పుకొచ్చారు. వ్యాపారాలు పోయినాయి అని.. ఇక తనదగ్గర పీకేదేమీ లేదన్న ప్రభాకర్ రెడ్డి.. 'నా భార్య కోసం క్లీనర్ పని అయినా చేస్తా. ఎందుకు భయపడాలి? చట్టానికి లోబడి ఉండని అధికారుల తో నాకు గొడవ. నా మీద 74 కేసులు ఉన్నాయి. బస్సులు సీజ్ చేశారు. స్వాతంత్ర్యానికి పూర్వమే మాకు బస్సులున్నాయి. వాటిని కూడా సీజ్‌ చేశారు. ఇది తప్పు కదా! నాకు 32 రూట్‌ బస్సులుంటే వాటిని మొత్తం సీజ్‌ చేశారు. అందరిపైనా కేసులు పెట్టాను.. గెలిచాను. ఆ అధికారులు నాకు ఇప్పుడు పరిహారం కట్టాలి" అని చెప్పారు.