పోలీసులకే చెమటలు పట్టించిన జేసీ ప్రభాకర్ రెడ్డి! ఏం టెన్షన్ పెట్టారు బాసు..
ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పట్టణంలో అడుగు పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
By: Tupaki Desk | 23 Sept 2025 2:38 PM ISTటీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్టైలే వేరు.. ‘‘నేను మోనార్క్ ని నన్నెవడూ మోసం చేయలేరు’’ అన్నట్లు ఉంటుంది ఆయన తీరు. వయసు పైబడినా రాజకీయంగా దూకుడు ఏ మాత్రం తగ్గించని సీనియర్ నేత జేసీ.. తాడిపత్రిలో పోలీసులకు ముచ్చెమటలు పట్టించారని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో తాను ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహంతో ఉన్న జేసీ.. సోమవారం పోలీసుస్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అయితే గతంలో మాదిరిగా వందల మంది అనుచరులను వెంటబెట్టుకుని రాకుండా.. ఒక్కరే సింగిల్ గా వచ్చి రోడ్డుపై కుర్చీవేసుకుని కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పట్టణంలో అడుగు పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెలరేగిన వివాదంతో పోలీసులు పెద్దారెడ్డిని పట్టణ బహిష్కరణ విధించగా, ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో పెద్దారెడ్డికి మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. గత ప్రభుత్వంలో తాడిపత్రిలో తనకు ఎదురైన అవమానాలను ద్రుష్టిలో పెట్టుకున్న జేసీ.. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా, పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టకూడదని గతంలో అల్టిమేటం జారీ చేశారు. తన మాట కాదని పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అనుచరులతో కలిసి అడ్డుకుంటామని బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో శాంతిభద్రతల సమస్యను పరిగణలోకి తీసుకుని పోలీసులు పెద్దారెడ్డి తాడిపత్రికి రాకుండా గతంలో పలు ఆంక్షలు విధించారు.
అయితే పోలీసుల తీరును నిరసిస్తూ పెద్దారెడ్డి హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లి తాడిపత్రిలో తన నివాసానికి వెళ్లేందుకు అనుమతి తీసుకున్నారు. అంతేకాకుండా పోలీసులు భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు పొందారు. అయితే పెద్దారెడ్డి భద్రతకు అయ్యే ఖర్చును ఆయనే భరించాలని సుప్రీంకోర్టు షరతు విధించింది. ఈ ప్రకారం ఈ నెల 6న పెద్దారెడ్డి తాడిపత్రికి రాగా, సుమారు 650 మంది పోలీసులతో భద్రత కల్పించారు. అయితే పోలీసు బందోబస్తుకు పెద్దారెడ్డి డబ్బు చెల్లించాల్సివుండగా, ఆ మొత్తం చెల్లించకుండానే పోలీసులు భద్రత కల్పించారని టీడీపీ నేత జేసీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 6వ తేదీన పెద్దారెడ్డి భద్రత కోసం వినియోగించిన పోలీసుల బందోబస్తుకు అయిన వ్యయాన్ని ఆయన నుంచి వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై గతంలోనే తాడిపత్రి ఏఎస్పీకి జేసీ లేఖ రాశారు. అయితే ఆయన లేఖపై పోలీసులు సరిగా స్పందించడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం ఆందోళనకు దిగారు. ఏఎస్పీ కార్యాలయానికి వెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని కలిసి, తాను పెద్దారెడ్డి విషయంలో రాసిన లేఖపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
అయితే కార్యాలయం లోపలకు వస్తే అన్నీ చెబుతానని ఏఎస్పీ చెప్పగా, చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తేనే లోపలికి వస్తానని ప్రభాకర్ రెడ్డి తెగేసి చెప్పారు. దీంతో ఏఎస్పీ తన కార్యాలయం లోపలకి వెళ్లిపోగా, ఆయన తీరుకు నిరసనగా జేసీ అక్కడే కుర్చీ వేసుకుని భైఠాయించారు. కాసేపటి తర్వాత ఎండ తీవ్రంగా ఉండటంతో ఏఎస్పీ కార్యాలయం నుంచి గుత్తి రోడ్డులోని అశోక్ పిల్లర్ వద్దకు మకాం మార్చారు. సాయంత్రం 4.30 వరకు జేసీ ఒక్కరే అక్కడ కుర్చీ వేసుకుని కూర్చోవడంతో పోలీసులు టెన్షన్ పడ్డారు. ఇక పోలీసు ఉన్నతాధికారుల సూచనలతో ఇద్దరు సీఐలు జేసీకి నచ్చజెప్పి ఎస్పీ జగదీష్ తో మాట్లాడించారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో సాయంత్రం ఆయన తన నిరసనను ముగించారు.
