'రెడ్ బుక్'లో ఆ పేరుంది.. శిక్ష పడాల్సిందే: జేసీ
వైసీపీ హయాంలో తాడిపత్రి డీఎస్పీగా ఉన్న చైతన్య రెడ్డి పేరు నారా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్‌లో ఉందన్నారు.
By: Tupaki Desk | 1 July 2025 10:18 AMఅనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయాలు మరుగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. పెద్దారెడ్డికి.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య రాజకీయ దుమారం తారస్థా యికి చేరింది. ఈ క్రమంలో తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేష్ గత ఏడాది ఎన్నికలకు ముందు `రెడ్ బుక్` పేరుతో కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తమకు... తమ పార్టీ నాయకులకు ఇబ్బందులు కలిగిస్తున్నవారి పేర్లను దీనిలో రాసుకున్నట్టు చెప్పారు.
అధికారంలోకి వచ్చాక వారిని పేరు పేరునా శిక్షించి తీరుతామని కూడా.. అప్పట్లో నారా లోకేష్ చెప్పారు. అయితే.. ఇప్పుడు అలా జరుగుతోందని వైసీపీ.. లేదు తాము చట్ట ప్రకారం ముందుకు సాగుతున్నామని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం రెడ్ బుక్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో తాడిపత్రి డీఎస్పీగా ఉన్న చైతన్య రెడ్డి పేరు నారా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్‌లో ఉందన్నారు.
చైతన్య రెడ్డి ఎక్కడ ఉన్నా.. తాము శిక్షించి తీరుతామని జేసీ వ్యాఖ్యానించారు. తమ నాయకులు, కార్యకర్త లను తీవ్రస్థాయిలో వేధించారని.. కాబట్టి చైతన్యను శిక్షించి తీరాల్సిందేనని పట్టుబట్టారు. చైతన్య ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నా వదిలి పెట్టేది లేదన్నారు. ఇక, ఈ క్రమంలోనే మరో కీలక విషయాన్ని జేసీ చెప్పారు. చైతన్యపై చర్యలు తీసుకోవద్దంటూ.. కనుమూరి బాపిరాజు(కాంగ్రెస్ సీనియర్‌నేత) తనకు ఫోన్ చేశారని.. ఆయనను అమాయకుడిగా పేర్కొన్నారని తెలిపారు.
కానీ, చైతన్య రెడ్డి ఏం చేశాడో తమకు తెలుసునని.. ఇక్కడకు వస్తే.. బాధితులను కనుమూరికి చూపిస్తామని చెప్పామన్నారు. కాబట్టి చైతన్య రెడ్డికి తగిన విధంగా శిక్ష పడాల్సిందేనని జేసీ డిమాండ్ చేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని నగరం నుంచి పోలీసులు బయటకు పంపించారు. అయితే.. గతంలో తనకు అనుకూలంగా హైకోర్టు తీర్పుందని ఆయన చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నారు.